రస్ అల్ ఖైమా వాదన వినాల్సిందే
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:19 AM
మన్యం బాక్సైట్ మైనింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ మైనింగ్ సరఫరా ఒప్పందం(బీఎస్ఏ) రద్దు వల్ల యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా (రాకియా) పెట్టుబడితోపాటు, ఆర్థికంగా నష్టపోయిందని ఇంగ్లాండ్‌లోని వేల్స్ అప్పీల్ కోర్టు తేల్చింది. కాబట్టి దాని వాదనలు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ వినాల్సిందేనని తీర్పునిచ్చింది.
ఏపీ బాక్సైట్ కేసులో ఇంగ్లాండ్ కోర్టు తీర్పు
కేంద్రంలో అత్యవసరంగా ఐఎంజీ మీటింగ్
నేడు మళ్లీ భేటీకానున్న మంత్రుల బృందం
ఇంగ్లాండ్ సుప్రీం కోర్టుకు కేంద్రం?
(అమరావతి-ఆంధ్రజ్యోతి): మన్యం బాక్సైట్ మైనింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ మైనింగ్ సరఫరా ఒప్పందం(బీఎస్ఏ) రద్దు వల్ల యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా (రాకియా) పెట్టుబడితోపాటు, ఆర్థికంగా నష్టపోయిందని ఇంగ్లాండ్‌లోని వేల్స్ అప్పీల్ కోర్టు తేల్చింది. కాబట్టి దాని వాదనలు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ వినాల్సిందేనని తీర్పునిచ్చింది. ఈ కేసును విచారించే అధికార పరిధి ట్రైబ్యునల్‌కు ఉందని స్పష్టం చేసింది. తాజా కోర్టు ఆదేశాలతో బాక్సైట్ మైనింగ్ వ్యవహారం ‘రాకియా’కు అనుకూలంగా కొత్తమలుపు తిరుగుతోంది. ఈ పరిణామంపై కేంద్రం స్పందించింది. శుక్రవారం ఢిల్లీలో ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ (ఐఎమ్‌జీ)నకు చెందిన కేంద్ర మంత్రుల బృందం సమావేశమైంది. కేంద్ర గనులశాఖతోపాటు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్థి సంస్థ (ఏపీఎండీసీ)ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. శనివారం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని కేంద్ర మంత్రుల బృందం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, ఇంగ్లాండ్‌లోని వేల్స్ అప్పీల్‌కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి సుప్రీం కోర్టుకు వెళ్లే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు తెలిసింది.
ఇదీ బాక్సైట్ కేసు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2007లో విశాఖ మన్యంలో బాక్సైట్ మైనింగ్, అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రస్ అల్‌ఖైమాతో ఒప్పందం జరిగింది. దీని ప్రకారం మన్యం ఏరియాలో అల్యూమినియం రిఫైనరీ, అల్యూమినియం స్మెల్టర్‌ను నిర్మించడానికి రాకియా, దాని భాగస్వాములు ఒక భారతీయ ప్రాజెక్టు కంపెనీని (అన్‌రాక్) ఏర్పాటు చేయాలి. ఈ ప్రాజెక్టులో కీలకమైంది 2008, అక్టోబరులో కుదిరిన బాక్సైట్ సరఫరా ఒప్పందం(బీఎస్ఏ). దీని ప్రకారం ఏపీ ప్రభుత్వానికి చెందిన మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ), ప్రాజెక్టు కంపెనీ అయిన అన్‌రాక్ అల్యూమినియం లిమిటెడ్‌కు బాక్సైట్ సరఫరా చేయాలి. ఈ మేరకు కేంద్రం నుంచి ఏపీఎండీసీ బాక్సైట్ మైనింగ్ లీజులు, అనుమతులు పొందింది.
ఇంగ్లాండ్ సుప్రీంలో అప్పీల్
కేంద్రం పరిశీలన
రాకియాకు అనుకూలంగా ఇంగ్లాండ్ హైకోర్టు, కోర్టు ఆఫ్ అప్పీల్ ఇచ్చిన తీర్పులను ఆ దేశ సుప్రీం కోర్టులో సవాల్‌చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అప్పీల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై శుక్రవారం సాయంత్రం ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్‌లోని వివిధ శాఖల మంత్రులు, అధికారుల బృందం సమావేశమై చర్చించినట్లు తెలిసింది. రాకియాపై అంతర్జాతీయ కోర్టుల్లో పోరాడేందుకు కేంద్ర సర్కారు ముందున్న న్యాయపరమైన అవకాశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఇంగ్లాండ్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసే అంశంపై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. శనివారం కూడా ఈ అంశంపై కేంద్ర మంత్రుల బృందం సమావేశం కానుందని సమాచారం.
ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌లో రాకియా కేసు
ఏపీ సర్కారు చర్యల వల్ల తాము చేసుకున్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం(బీఐటీ) ఉల్లంఘనకు గురైందని, తమకు పెట్టుబడితోపాటు ఆర్థిక నష్టం జరిగిందని, కాబట్టి వెంటనే మధ్యవర్తిత్వం జరిపి న్యాయం చేయాలని ‘రాకియా’ 2016లో ఇంగ్లాండ్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు చేసింది. అయితే, కేసు విచారణ పరిధి తనకు లేదంటూ ‘రాకియా’ అభ్యర్థనను 2022, మే 11న ఆ ట్రైబ్యునల్ తిరస్కరిస్తూ తుది తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత రాకియా ఇంగ్లాండ్‌లోని హైకోర్టులో అప్పీల్ చేసింది. రాకియా అప్పీల్‌ను 2025, జూన్20న కోర్టు విచారణకు స్వీకరించింది. ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌కు ఈ కేసును విచారించే అధికార పరిధి ఉందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ భారత సర్కారు ఈ ఏడాది మేలో కోర్టు ఆఫ్ అప్పీల్‌కు వెళ్లింది. ఇంగ్లాండ్ హైకోర్టు తీర్పు సరైనదేనని కోర్టు ఆఫ్ అప్పీల్ తాజాగా తీర్పునిచ్చింది. రాకియా వేసిన కేసును ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌లోనే తేల్చుకోవాలని ఆదేశించింది. ’’ ప్రస్తుత కేసులో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాకియా పెట్టుబడిని నేరుగా ప్రభావితం చేశాయి ’’ అని అప్పీల్‌కోర్టు వ్యాఖ్యానించింది.
మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరాటం
బాక్సైట్ మైనింగ్, సరఫరా ఒప్పందం అనంతరం మన్యంలో ఆదివాసీ పోరాటాలు తెరమీదకు వచ్చాయి. మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ, గిరిజనులు, మావోయిస్టులు, ప్రజా సంఘాలు పోరాటాలు చేశాయి. మైనింగ్ వద్దంటూ నినదించాయి. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. మన్యంలో తీవ్ర అలజడి వాతావరణం నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాక్సైట్ సరఫరా ఒప్పందానికి సంబంధించిన జీవో 44ను 2016, ఏప్రిల్ 6వ తేదీన నాటి తెలుగుదేశం ప్రభుత్వం రద్దుచేసింది. అలాగే, ఏపీఎండీసీ పేరిట ఇచ్చిన మైనింగ్ లీజులను కూడా కేంద్రం రద్దుచేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల