తల్లిని చంపిన తనయుడు
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:13 AM
తల్లి కష్టపడి సంపాదించిన సొమ్ములన్నీ కుమార్తెకే ఇస్తోందని, తనను పట్టించుకోవడం లేదనే అక్కసు ఒకవైపు, తల్లిపేరున చేసిన అప్పులు రద్దవ్వాలంటే ఆమె మరణించడమే పరిష్కారమని భావించిన కుమారుడు చివరకు కన్నతల్లినే హతమార్చాడు.
ఆమె పేరుతో చేసిన అప్పుల రద్దు కోసం ఎత్తుగడ
సంపాదన అంతా కుమార్తెకే ఇస్తోందనే అక్కసు కూడా..
అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించే యత్నం
ఏలూరు క్రైం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తల్లి కష్టపడి సంపాదించిన సొమ్ములన్నీ కుమార్తెకే ఇస్తోందని, తనను పట్టించుకోవడం లేదనే అక్కసు ఒకవైపు, తల్లిపేరున చేసిన అప్పులు రద్దవ్వాలంటే ఆమె మరణించడమే పరిష్కారమని భావించిన కుమారుడు చివరకు కన్నతల్లినే హతమార్చాడు. ఏలూరు జిల్లాలో శనివారం జరిగిందీ దారుణం. ఏలూరు త్రీ టౌన్ సీఐ వి.కోటేశ్వరరావు ఆదివారం ఆ వివరాలు వెల్లడించారు. ఏలూరు శాంతినగర్‌కు చెందిన కొమ్ము సత్యవతి(57) భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. దీంతో ఆమె ఒంటరిగా జీవిస్తూ హోటళ్లల్లో పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం.
వివాహాల అనంతరం పెద్ద కుమారుడు, కుమార్తె వేరే ప్రాంతాలకు వెళ్లారు. రెండో కుమారుడు సురేశ్ ఏలూరులోని శ్రీరామ్‌నగర్‌లో ఓ మహిళతో సహజీవనం చేస్తూ.. తల్లి ఇంటి సమీపంలోనే బజ్జీల బండి పెట్టుకుని జీవిస్తున్నాడు. తల్లిపేరున ఆన్‌లైన్‌లో అప్పులు చేశాడు. ఖరీదైన సెల్‌ఫోన్లు కూడా ఈఎంఐలు చెల్లించేలా తల్లి పేరున కొనుగోలు చేశాడు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ రుణాలన్నీ రద్దవ్వాలంటే తల్లి చనిపోవడమే పరిష్కారమని భావించాడు.
దీంతోపాటు తల్లి సంపాదించిన సొమ్ములన్నీ కుమార్తెకే ఇస్తోందని కక్ష పెంచుకున్నాడు. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం హోటల్‌కు వెళ్లడానికి సిద్ధమైన తల్లితో గొడవపడి గొంతు నులిమి చంపేశాడు. అనారోగ్యంతో తల్లి చనిపోయినట్టు అందరినీ నమ్మించాడు. అయితే, తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుమార్తె నజీమా త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో సురేశే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేశ్ పరారీలో ఉన్నట్టు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం