Share News

తర్వాతి వంతు అవినాశ్‌రెడ్డిదే?

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:08 AM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మనీ లాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. వరుసగా కీలక నిందితులను విచారిస్తున్నారు. తదుపరి వంతు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిదేనని...

తర్వాతి వంతు అవినాశ్‌రెడ్డిదే?

  • వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌పై వరుసగా నిందితులను విచారిస్తున్న ఈడీ

  • దస్తగిరి, సునీల్‌ వాంగ్మూలాల ఆధారంగా ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిల విచారణ

  • నగదు, బ్యాంకు లావాదేవీలపై ఆరా

హైదరాబాద్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మనీ లాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. వరుసగా కీలక నిందితులను విచారిస్తున్నారు. తదుపరి వంతు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిదేనని, త్వరలోనే ఆయనకు నోటీసు పంపనుందని తెలుస్తోంది. హత్య కేసులో ఆయన ఏ-7గా, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఏ-8గా ఉన్న సంగతి తెలిసిందే. వివేకా హత్యకు కుదిరిన రూ.40 కోట్ల డీల్‌పై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అప్రూవర్‌గా మారిన ఏ-4 దస్తగిరి, ఏ-3 సునీల్‌యాదవ్‌లను ప్రశ్నించింది. వారి వాంగ్మూలాల ఆధారంగా సోమ, మంగళవారాల్లో ఏ-1 ఎర్రగంగిరెడ్డిని, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించింది. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా హత్య జరిగిన తర్వాత 15వ తేదీన నిందితుల్లో కొందరు ఎర్రగంగిరెడ్డి ఇంట్లో సమావేశం కావడంపై అతడిని ఆరా తీసింది.

ఆ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు.. హత్యకు కుదుర్చుకున్న 40 కోట్ల డీల్‌.. వాటాల పంపకం తదితర అంశాల గురించి అడిగినట్లు తెలిసింది. అలాగే వివేకా హత్య తర్వాత ఉమాశంకర్‌రెడ్డి గోడ దూకి పారిపోతున్న సీసీ ఫుటేజీ చూపించి అతడిని ప్రశ్నించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. ఆధారాలు, సీసీ ఫుటేజీ దృశ్యాలు, కాల్‌ డేటాను ఎదుటపెట్టి ప్రశ్నించడంతో.. వారిద్దరూ గుట్టువిప్పినట్లు సమాచారం. దీని ఆధారంగా అతి త్వరలో ఎంపీ అవినాశ్‌రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని ఈడీ పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 06:08 AM