Share News

ఆ బంటు.. రాబందు!

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:59 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బంటు అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. నాడు జగన్‌ అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారీగా అక్రమాస్తులు పోగేసిన...

ఆ బంటు.. రాబందు!

  • అటు ఎడాపెడా అక్రమాస్తులు.. ఇటు జల్సాలు!

  • ఏడు దేశాల్లో జగన్‌ సహాయకుడి ముద్రలు!!

  • అమెరికాలో ఐటీ కంపెనీలో భార్య భాగస్వామి

  • ఉగాండాలోని ఫార్మా పరిశ్రమలోనూ వాటా

  • ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌, మరో 3 దేశాల్లో పర్యటన

  • మాల్దీవుల్లో సినీ నటి, టీవీ తారతో జల్సాలు.. లక్షల్లో ఖర్చు

  • బంటు గ్యాంగ్‌ ఆగడాలపై ఈడీకి కీలక సమాచారం

  • విశాఖ భూ దందాలో అతడి భాగస్వామిపైనా

  • 18 మంది బ్యూరోక్రాట్లకు రూ.200 కోట్లు టోపీ

  • కూపీ లాగుతున్న అధికారులు.. త్వరలో విచారణ

విశాఖలో జగన్‌ బంటు కొట్టేసిన రూ.250 కోట్ల భూ దందాలో కీలక సూత్రధారి, అతని భాగస్వామి వ్యవహారం కూడా బయటకు వచ్చింది. పలు రాష్ట్రాల్లోని 18 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులను అతడు మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. విశాఖలో నివాస స్థలాలు ఇస్తామని చెప్పి దాదాపు 200 కోట్లు వసూలు చేసి వారికి కుచ్చు టోపీ పెట్టినట్టు ఫిర్యాదులు వచ్చాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బంటు అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. నాడు జగన్‌ అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారీగా అక్రమాస్తులు పోగేసిన సదరు బంటు బాగోతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) లోతుగా వెలికి తీస్తున్నట్లు సమాచారం. అక్రమాస్తులు సంపాదించడంలో, జల్సాలు చేయడంలో అతడి ‘ఘనత’ ఖండాంతరాలకు చేరింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బంటు బామ్మర్ది పేరుతో అమెరికాలో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ(మనీ రూటింగ్‌ కోసమే)లో తన భార్య పేరుతో వాటా పొందారు. ఆ తర్వాత ఉగాండాలోని ఫార్మా కంపెనీలోనూ భార్య పేరుతో వాటా తీసుకున్నట్లు తేలింది.

జగన్‌ చేతికి కోడికత్తి గాయానికి వైద్యం చేసిన హైదరాబాద్‌ హాస్పిటల్‌ యజమానితో కలిసి ఉగాండాలో ఫార్మా వ్యాపారం చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. వీటితో పాటు ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌, నేపాల్‌, మలేషియా, అజర్‌ బైజాన్‌లో బంటు పర్యటనలపై ఈడీ అధికారులు కూపీ లాగారు. అక్కడ బంటు జరిపిన ఆర్థిక లావాదేవీలపై అత్యంత కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడు ఆయా దేశాలకు వెళ్లారు? ఎవరితో కలిసి వెళ్లారు? అక్కడ ఎవరిని కలిశారు? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారనే కోణంలో ఆరా తీశారు.

విజయవాడలో సెటిలైన కడప జిల్లా వాసి ద్వారా హవాలా చేసినట్లు సమాచారం లభించినట్లు తెలిసింది. ఈడీ అధికారులు ఏపీ సిట్‌ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలు, ఆధారాలు అడిగారు. వైసీపీ అధ్యక్షుడితో ఎవరైనా ఫొటో దిగాలంటే లక్ష, యాభై వేలు వసూలు చేసేవారని తెలిపారు. 2019 తర్వాత అప్పటి ముఖ్యమంత్రికి మీపై ఫిర్యాదులు వస్తున్నాయంటూ పలువులు వైసీపీ ప్రజా ప్రతినిధుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని వివరించినట్లు తెలిసింది.


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఒక టీవీ నటితో బంటు రాసలీలలు మొదలుకొని మాల్దీవుల్లో సినీతారలతో గడిపిన వివరాలు సైతం అందించినట్లు తెలిసింది. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్ల వివాదంలో చిక్కుకున్న ఆ బుల్లితెర నటితో పాటు మాల్దీవులకు వెళ్లిన మరో సినీ నటికి సైతం నోటీసులిచ్చి ఈడి విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విజయవాడలో కృష్ణా నది ప్రవాహం కృష్ణలంక మీదికి రాకుండా అడ్డుగా గోడ కట్టిన కాంట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తులు టీవీ నటికి చెల్లించినట్లు తెలుస్తోంది.

బ్యూరోక్రాట్లకు మోసం విశాఖపట్నంలో బంటు కొట్టేసిన రూ.250 కోట్ల భూ దందాకు కీలక సూత్రధారి అయిన అతని భాగస్వామి వ్యవహారం కూడా బయటకు వచ్చింది. పలు రాష్ట్రాల్లోని 18 మంది బ్యూరోక్రాట్లను అతడు మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. విశాఖలో నివాస స్థలాలు ఇస్తామని చెప్పి దాదాపు 200 కోట్లు వసూలు చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. కొందరు అధికారులు బంటు గ్యాంగ్‌ బాగోతాలు, మోసాల్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మోసగాళ్లను వదిలి పెట్టొద్దంటూ, తమకు విశాఖపట్నంలో ఖరీదైన ఆస్తి చూపించి మోసం చేసిన తీరు వివరించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ మోసగాడిపై 16 కేసులు నమోదయ్యాయని, అదే వ్యక్తితో బంటు నెరిపిన వ్యవహారం తమకు తీవ్ర నష్టం కలిగించిందని, అప్పటి ముఖ్యమంత్రి పేరు చెప్పడంతో తాము నోరెత్తలేక పోయామని వాపోతున్నట్లు తెలిసింది.

ఇదే సమయంలో సిట్‌ సేకరించిన దక్షిణాది రాష్ట్రాల్లోని బంటు ఆస్తుల వివరాలు, వాటి మార్కెట్‌ ధర, కొనుగోలు చేసినప్పటి ధరతో పాటు ఆ సొమ్ము ఎలా వచ్చిందనే మార్గాల్ని ఈడీ కనుక్కొంది. విదేశాల్లోని వ్యవహారాలపైనా సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది.


స్టార్‌ హోటళ్లలో మంతనాలు

విశాఖపట్నంలో రూ.250 కోట్ల భూదందా వ్యవహారంలో బంటుపై ఈడీకి ఫిర్యాదులు వచ్చాయి. బంటు గ్యాంగ్‌ చేతిలో మోసపోయిన అధికారులు అక్రమాల గురించి వివరించారు. బంటు రికార్డుల్లో రూ.32.67 కోట్లు చూపించి లావాదేవీల్లో రూ.12.50 కోట్లు మాత్రమే చెల్లించిన వైనంపై వివరాలను బ్యూరోక్రాట్లు ఈడీకి అందజేసినట్లు తెలిసింది. ఆ వివరాలు ముందుంచి ఈ కోణంలో మీరెందుకు లోతుగా ఆరా తీయలేదని సిట్‌ అధికారుల్ని ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది.

అయితే తాము లిక్కర్‌ స్కామ్‌ వరకే పరిమితం అయ్యామని సిట్‌ అధికారులు తెలిపారు. తిరుపతి సమీపంలోని చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వెంచర్‌లో కొనుగోలు చేసినట్లు చూపించిన పదెకరాల భూమి వ్యవహారంలోనే తమకు ఆధారాలు లభించాయని చెప్పినట్టు తెలుస్తోంది. విశాఖ భూమికి బంటు బామ్మర్ది పంపిన రూ.5 కోట్లు, స్నేహితులతో అప్పుగా తీసుకున్న రూ.2.50 కోట్లు మినహా మద్యం ముడుపుల ఆధారాలు ఎక్కడా లభించక పోవడంతో తాము లోతుగా ఆరా తీయలేదని వివరించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌, హైటెక్‌ సిటీ సమీపంలో ట్రైడెంట్‌ హోటళ్లలో 2019 నుంచి 2024వరకూ వందల సార్లు లిక్కర్‌ స్కామ్‌ నిందితులు సమావేశం అయ్యారని, వారితో పలుమార్లు బంటు కూడా కలిసినట్లు తమ వద్ద సమాచారం ఉందని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆ వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు విజయవాడలోని నోవాటెల్‌, వైజాగ్‌, చెన్నైల్లోని మరో స్టార్‌ హోటళ్లలో జరిగిన లావాదేవీలపై సమాచారాన్ని కోరినట్లు తెలిసింది. కడప జిల్లా నుంచి వచ్చి విజయవాడలో సెటిలైన ఒక వ్యక్తి ద్వారా ఆర్థిక వ్యవహారాల కోసం చర్చించేవారని చెప్పినట్టు సమాచారం. అలాగే విశాఖపట్నంలో భూ దందాల కోసం, చెన్నైలో నెల్లూరుకు చెందిన మైనింగ్‌ వ్యవహారాల కోసం సమావేశం అయ్యేవారని వివరించినట్లు తెలిసింది. సిట్‌ అధికారులు చెప్పిన వివరాలు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు త్వరలో బంటుపై ఈసీఐఆర్‌ నమోదు చేసి, బంటు చుట్టూ చేరి వ్యవహారాలు నడిపిన వారిని సైతం విచారించనున్నట్లు సమాచారం.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 03:06 AM