మద్యం రవాణాలో అంబటి బినామీలు!
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:18 AM
ఒకసారి కాదు.. రెండు టెండర్లలోనూ అప్పటి మంత్రి అంబటి రాంబాబు తన బినామీలు ఇద్దరికీ మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టులు ఇప్పించుకున్నారు.
వాసుదేవరెడ్డితో మాట్లాడి సన్నిహితులిద్దరికీ సబ్‌కాంట్రాక్టులు ఇప్పించుకున్న మాజీ మంత్రి!!
సిట్, ఈడీలకు సుబ్బారెడ్డి, పురుషోత్తమరావు వాంగ్మూలం
2020-24 మధ్య రెండు టెండర్లు
సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ తరఫున 74.51 లక్షల మద్యం పెట్టెల రవాణా
ఇద్దరికీ రూ.19.58 కోట్ల చెల్లింపులు
రెండు టెండర్లలోనూ ఒకటే తీరు
సబ్‌కాంట్రాక్టుల్లో అంబటి కీలక పాత్ర
ఇన్వాయిస్‌లు, బ్యాంకు లావాదేవీలు,డిపాజిట్లు సహా సిట్, ఈడీ చేతికి ఆధారాలు
ఒకసారి కాదు.. రెండు టెండర్లలోనూ అప్పటి మంత్రి అంబటి రాంబాబు తన బినామీలు ఇద్దరికీ మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టులు ఇప్పించుకున్నారు. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో మాట్లాడి.. మద్యం రవాణా కాంట్రాక్టు పొందిన సంస్థలతో నేరుగా పరిచయం పెంచుకుని వాటిని పొందినట్లు వారిద్దరూ స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట వాంగ్మూలాలిచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి 2020 నుంచి 2024 వరకు రెండు వేర్వేరు టెండర్ల సమయంలో నాటి ప్రధాన రవాణా కాంట్రాక్టు సంస్థ నుంచి సుబ్బారెడ్డి, పురుషోత్తమరావు సబ్‌కాంట్రాక్టులు పొందారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలోనే వెలుగుచూసింది. అంబటి మాట్లాడిన తర్వాతే వాసుదేవరెడ్డి తమకు సబ్‌కాంట్రాక్టులు వచ్చేలా సహకరించారని వారిద్దరూ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం తమ ముందుకు రావాలని అంబటికి ఈడీ నోటీసులు జారీచేసింది.ఏపీలో మద్యం రవాణా టెండర్లలో అక్రమాలకు 2020 నవంబరులో తొలి అడుగు పడింది. అప్పట్లో మద్యం రవాణా టెండర్‌ను సిగ్మా సప్లయ్ చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ సంస్థ మద్యం స్కాంలో కీలక నిందితుడైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆయన సన్నిహితుడు తుకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డిలకు చెందినదన్న సంగతి తెలిసిందే.
మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టుల కోసం అంబటి రాంబాబును ఆయన బినామీలు, వైసీపీ నేతలైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తమరావు సంప్రదించారు. ఆయన నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో మాట్లాడారు. ఆయన సూచనతో సిగ్మా సంస్థకు అధీకృత ప్రతినిధిగా ఉన్న మహ్మద్ సెహన్ పాషాను సుబ్బారెడ్డి, పురుషోత్తమరావు సంప్రదించారు. హైదరాబాద్ రావాలని అతడు వారికి చెప్పాడు. హైటెక్ సిటీ సమీపంలోని కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌లో పాషాతో వారు సమావేశమయ్యారు. 2020 నవంబరు 2న సిగ్మాతో ఒప్పందం చేసుకున్నారు. సుబ్బారెడ్డికి గుంటూరు-3 మద్యం డిపో, పురుషోత్తమరావుకు గుంటూరు-1 డిపో రవాణా పనులు అప్పగించారు. ఒక్కో పెట్టె రవాణాకు రూ.13 మాత్రమే ఖర్చవుతాయి. కానీ వరుసగా రూ.26, రూ.25 చొప్పున వారిద్దరికీ రవాణా రేటు ఖరారైంది. ఇద్దరూ రూ.10 లక్షల చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. అంబటి రాంబాబు చెప్పడం వల్లే తమకు సబ్ కాంట్రాక్టులు వచ్చాయని వారు గతంలో సిట్‌కు, తాజాగా ఈడీకి వాంగ్మూలమిచ్చారు.
సిగ్మా నుంచి సబ్‌కాంట్రాక్టులు పొందాక పాషాకు తాము రూ.2 లక్షల చొప్పున ముడుపులు కూడా చెల్లించినట్లు తెలిపారు. రెండో టెండర్ సమయంలోనూ సబ్‌కాంట్రాక్టు పొందేందుకు సుబ్బారెడ్డి, పురుషోత్తమరావు మరోసారి అంబటిని సంప్రదించారు. ఆయన వాసుదేవరెడ్డితో మాట్లాడిన తర్వాత.. ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన కిశోర్ ఫోన్ నంబర్లను తమకు ఇచ్చారని వారిద్దరూ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. 2023 డిసెంబరు 19న మద్యం రవాణా కాంట్రాక్టు ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్‌కు వెళ్లింది. అదే రోజు విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో కిశోర్‌ను సుబ్బారెడ్డి కలిశారు. ఒక్కో పెట్టె రవాణాకు రూ.25.35 చొప్పున సబ్‌కాంట్రాక్టు దక్కించుకున్నారు. అదే రోజు పురుషోత్తమరావు కూడా అదే హోటల్‌లో కిశోర్‌ను కలిశారు. ఒక్కో పెట్టెకు రూ.26.85 చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.10 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు కిశోర్‌కు రూ.2.5 లక్షలు నగదు రూపంలో చెల్లించినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రవాణా, చెల్లింపులు ఇలా..
సుబ్బారెడ్డి గుంటూరులో పదేళ్లు బార్ వ్యాపారం, తర్వాత పల్నాడులో మైనింగ్ వ్యాపారం చేపట్టారు. గణపవరం సర్పంచ్‌గా పనిచేశారు. పురుషోత్తమరావు సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ళకు చెందిన మిర్చివ్యాపారి. సిగ్మాతో సబ్‌కాంట్రాక్టు కింద సుబ్బారెడ్డి 2020 నవంబరు 1 నుంచి 2023 డిసెంబరు 18 వరకు గుంటూరు-3 డిపో నుంచి మద్యం రవాణా చేశారు. 25.33 లక్షల పెట్టెలను తరలించారు. 75 ఇన్వాయిస్‌లు సమర్పించి సిగ్మా నుంచి రూ.6.65 కోట్లు అందుకున్నారు. పురుషోత్తమరావు గుంటూరు-1 డిపో నుంచి 33.81 లక్షల పెట్టెలను రవాణా చేశారు. 75 ఇన్వాయిస్‌ల ద్వారా రూ.8.79 కోట్లు పొందారు.
ఆ లావాదేవీలు కీలకం..
మొదటి కాంట్రాక్టు కాలంలో సుబ్బారెడ్డి, పురుషోత్తమరావు కలిసి 59.14 లక్షల మద్యం పెట్టెలను రవాణా చేశారు. సిగ్మా నుంచి వారు పొందిన మొత్తం రూ.15.44 కోట్లు. రెండో కాంట్రాక్టు కాలంలో మరో 15.37 లక్షల పెట్టెలను తరలించి ప్రసాద్ నుంచి రూ.4.14 కోట్లు పొందారు. ఇలా మొత్తం 74.51 లక్షల మద్యం పెట్టెల రవాణా, రూ19.58 కోట్ల చెల్లింపుల లెక్క దర్యాప్తు రికార్డుల్లోకి వచ్చింది. కాంట్రాక్టులు దక్కించుకునేక్రమంలో జరిగిన నగదు చెల్లింపులు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఇన్వాయిస్‌లు, బ్యాంకు ఖాతాల మధ్య జరిగిన లావాదేవీలు కూడా విచారణలో కీలకంగా మారాయి.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక