దాల్మియా సిమెంట్స్ కేసులో ఏ-1గా జగన్!
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:43 AM
వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తాజాగా ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (చార్జిషీటు) దాఖలు చేశారు.
ప్రత్యేక కోర్టులో సవరించిన చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ
407.05 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజులో మతలబు
ప్రతిఫలంగా జగన్‌కు రూ.150 కోట్ల ముడుపులు
గతంలోనే చార్జిషీటు వేసిన సీబీఐ
దీనిపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ
రూ.793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తాజాగా ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (చార్జిషీటు) దాఖలు చేశారు. గతంలో సాంకేతిక కారణాలతో ప్రాసిక్యూషన్ ఫిర్యాదును నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తిప్పిపంపడంతో ఈడీ మరిన్ని ఆధారాలు సేకరించి సవరించిన కంప్లయింట్‌ను సమర్పించింది.
ఇందులో వైఎస్ జగన్‌ను ఏ-1గా, విజయసాయిరెడ్డి ఏ-2గా, ఏ-3గా పునీత్ దాల్మియాతో పాటు అప్పటి గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాటి ఉన్నతాధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్, ఈశ్వర్ సిమెంట్స్ డైరెక్టర్ సజ్జల దివాకర్‌రెడ్డి, సంజయ్ మిశ్రా, నీల్ కమల్ జైన్, జయదీప్, రఘురాం సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఈశ్వర్ సిమెంట్స్‌ను కూడా నిందితులుగా పేర్కొన్నట్లు సమాచారం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామంలో దాల్మియా సిమెంట్స్‌కు 407.05 హెక్టార్ల (సుమారు 1,006 ఎకరాలు) సున్నపు రాయి గనులను 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. వాస్తవానికి ఈ లీజు మొదట ఈశ్వర్ సిమెంట్స్ పేరిట ఉండగా దానిని దాల్మియాకు బదిలీ చేశారు.
ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందన్న ఆరోపణలపై మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ తాజా ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. వాస్తవానికి 2013లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో జగన్‌కు రూ.150 కోట్ల ముడుపులు అందినట్లు పేర్కొంది. వీటిలో రూ.95 కోట్లు రఘురాం సిమెంట్స్ నుంచి షేర్ల రూపంలో, మరో రూ.55 కోట్లు హవాలా రూపంలో జగన్‌కు దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు సీబీఐ ఆరోపించింది.
దీని ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో విచారణ సాగించిన ఈడీ అధికారులు.. దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అప్పట్లో జప్తు చేశారు. సజ్జల దివాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భగీరథి డైరెక్టర్లుగా ఉన్న ఈశ్వర్ సిమెంట్స్‌కు దాల్మియా నుంచి వచ్చిన రూ.2.14 కోట్లు సైతం మనీలాండరింగ్‌లో భాగమేనని ఈడీ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ కేసులో గతంలో పీఎంఎల్‌ఎ అప్పిలేట్ ట్రైబ్యునల్ దాల్మియా సిమెంట్స్‌కు కొంత ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ తొలి దశలో పేర్కొన్న నేరార్జనను రూ.793.34 కోట్ల నుంచి రూ.92.52 కోట్లకు తగ్గించింది.
దీంతో దాల్మియా సిమెంట్స్ కేసులో మళ్లీ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరుగనుంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేయగా.. ఈడీ కూడా ఇప్పటివరకు కోర్టులో 9 చార్జిషీట్లను (ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు) మనీలాండరింగ్ చట్టం ప్రకారం దాఖలు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్న నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై కోర్టులో రోజువారీ విచారణ ప్రారంభం కావడంతో ఐదారు నెలల్లో అసలు కేసు ట్రయల్ మొదలయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్