Share News

నెయ్యిలో కల్తీ... నిజం

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:48 AM

విశాఖపట్నం లీగల్‌, హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌ హయాంలో లడ్డూ తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సరఫరా అయింది కల్తీ నెయ్యేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సైతం నొక్కి చెప్పింది.

నెయ్యిలో కల్తీ... నిజం

  • పామాయిల్‌, రసాయనాలు కలిపారు

  • జగన్‌ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి వాటిని వాడినట్టు తేల్చిన ఈడీ

  • సుకృతి ఫుడ్స్‌ ఓనరు మంగ్లా అరెస్టు

  • టీటీడీకి రూ.96 కోట్ల నకిలీ నెయ్యి

  • లడ్డూ దందాలో సహ కుట్రదారు

  • కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు

  • కస్టడీకి పంపించిన పీఎమ్‌ఎల్‌ఏ కోర్టు

తిరుపతి (టీటీడీ), విశాఖపట్నం లీగల్‌, హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌ హయాంలో లడ్డూ తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సరఫరా అయింది కల్తీ నెయ్యేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సైతం నొక్కి చెప్పింది. మనీ లాండరింగ్‌ చట్టం కింద ‘సుకృతి ఫుడ్స్‌’ ప్రమోటర్‌ కైలాశ్‌ చంద్‌ మంగ్లాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పిలిపించి, హైదరాబాద్‌ జోనల్‌ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశంతో కైలాశ్‌ చంద్‌ను జ్యుడిషీయల్‌ కస్టడీకి తరలించారు. పవిత్రమైన లడ్డూ తయారీ వ్యవహారంలో నాడు చోటుచేసుకున్న అక్రమాలు, అరాచకాలను ఈ సందర్భంగా ఈడీ.. కోర్టుకు నివేదించింది. ‘‘లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో పామాయిల్‌, పామ్‌ కెర్నల్‌ ఆయిల్‌, పామోలిన్‌తోపాటు ఎంజీ-9, మోనోగ్లిజరైడ్స్‌, మైవాసెట్‌ సాఫ్ట్‌ 400, ఎసిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్‌ తదితర రసాయనాలు కలిశాయి. నాడు మొత్తం రూ.230 కోట్ల విలువైన కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా కాగా, అందులో రూ. 96 కోట్ల విలువైన సరుకు మంగ్లా కంపెనీయే సరఫరా చేసింది. ఈ వ్యవహారంలో మంగ్లా సహ కుట్రదారు. శ్రీ వైష్ణవి డెయిరీ, మాల్‌గంగా మిల్క్‌ అండ్‌ అగ్రో ప్రోడక్ట్స్‌, ఎ.ఆర్‌. డెయిరీ ఫుడ్స్‌ ద్వారా నెయ్యి సరఫరాను సమన్వయ పరిచారు. తన ఫ్యాక్టరీ సమీపంలో కల్తీ నెయ్యిని తయారు చేయించారు. విషయం బయటపడకుండా తప్పుడు రికార్డులను నిర్వహించారు.’’ అని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.


వైవీ పీఏ బేరమాడింది కైలాశ్‌తోనే..!

కైలాశ్‌ చంద్‌ మంగ్లా పేరు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది. నాటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న తనకు భోలేబాబా డెయిరీ తరపున కమీషన్‌ ముట్టజెప్పాలని రాయబారం పంపింది మంగ్లా ద్వారానే కావడం గమనార్హం.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 03:51 AM