ఏపీ విద్యార్థిని ఘనత.. లూనార్ మిషన్‌కు ఎంపిక..
ABN , Publish Date - Jul 23 , 2026 | 08:25 AM
పేదరికం ప్రతిభకు అడ్డుకాదని మరోసారి నిరూపించింది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కందుల జెస్సీ. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'మిషన్ శక్తి శాట్'కు ఆమె ఎంపికై రికార్డు సృష్టించింది.
రాజమహేంద్రవరం: పేదరికం ప్రతిభకు అడ్డుకాదని తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కందుల జెస్సీ నిరూపించింది. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'మిషన్ శక్తి శాట్'కు ఎంపికై రికార్డు సృష్టించింది. భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో జెస్సీ చోటు దక్కించుకుని.. ఈ ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచింది. 108 దేశాల నుంచి సుమారు 12 వేల మంది బాలికలు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా.. పలు దశల ఎంపిక ప్రక్రియ అనంతరం జెస్సీ తుది జాబితాలో స్థానం సంపాదించింది. ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లాకే కాకుండా రాష్ట్రానికీ గర్వకారణంగా మారింది.
ఉపాధ్యాయురాలి ప్రోత్సాహంతో..
జెస్సీలో ఉన్న విజ్ఞాన ఆసక్తిని గుర్తించిన పాఠశాల భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలు, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌ఛార్జ్ మణిమాల ఆమెను ప్రోత్సహించారు. ఉపాధ్యాయురాలే మిషన్ శక్తి శాట్ కార్యక్రమానికి జెస్సీ పేరును నమోదు చేయించారు. ఆమెతో పాటు మరో 8 మంది విద్యార్థినులతోనూ దరఖాస్తు చేయించారు. ఆన్‌లైన్ కోర్సు అప్పటికే ప్రారంభమైందని తెలిసినా వెనుకడుగు వేయకుండా నిర్వాహకులతో మాట్లాడి మణిమాల మరో అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని జెస్సీ సద్వినియోగం చేసుకుని తన ప్రతిభను చాటుకుంది.
చదువుతో పాటు అంతరిక్ష శిక్షణ..
ఒకవైపు పదో తరగతి చదువులు, మరోవైపు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ. రెండింటినీ సమన్వయం చేస్తూ పాఠశాల తరగతుల అనంతరం రోజూ ఆన్‌లైన్ తరగతులకు జెస్సీ హాజరైంది. ఇప్పటికే కోర్సులో 50 నుంచి 60 శాతం వరకు ఆమె పూర్తి చేసింది. మిషన్ శక్తిశాట్‌లో మొత్తం 550 సెషన్లు, 21 మాడ్యూల్స్ ఉన్నాయి. శాటిలైట్ వ్యవస్థలు, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, స్పేస్ టెక్నాలజీ వంటి ఉన్నత స్థాయి అంశాలను ఇందులో బోధిస్తున్నారు. పాఠశాల సిలబస్‌కు పూర్తిగా భిన్నమైన ఈ అంశాలు తొలుత క్లిష్టంగా అనిపించినా, పట్టుదలతో నేర్చుకుంటూ ముందుకు సాగింది జెస్సీ.
ఇంగ్లిష్‌పై పట్టు సాధించి..
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ లెర్నింగ్‌తో పాటు శాస్త్రవేత్తలతో గంటపాటు ఇంగ్లిష్‌లో ఇంటర్వ్యూ, మిషన్ శక్తిశాట్ ప్రాధాన్యతపై ఒక నిమిషం వీడియో సమర్పించాల్సి వచ్చింది. ముఖ్యంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో మాట్లాడాల్సి రావడంతో ఉపాధ్యాయుల సహకారంతో కొన్ని వీడియోల ద్వారా జెస్సీ తన ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది.
ఢిల్లీలో శిక్షణ.. అక్టోబరులో ప్రయోగం..
ఆగస్టు 23 నుంచి న్యూఢిల్లీలో జరిగే తదుపరి దశ శిక్షణలో జెస్సీ పాల్గొననుంది. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాలతో పాటు శాస్త్రవేత్తలతో కలిసి శాటిలైట్ డిజైన్, పేలోడ్ అభివృద్ధి, మిషన్ ఆపరేషన్స్‌పై ప్రాక్టికల్ శిక్షణ పొందనుంది. మరోవైపు విద్యార్థినులు రూపొందించే లూనార్ క్యూబ్‌శాట్‌ను అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
కష్టాల్లో పెరిగినా కలలకు రెక్కలు..
జెస్సీ తండ్రి వృత్తిరీత్యా వడ్రంగి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మారాల్సి వచ్చింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. మరోవైపు తమ కుమార్తె మిషన్ శక్తిశాట్‌కు ఎంపిక కావడం, అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో ఆత్మవిశ్వాసంగా మాట్లాడటం తమ జీవితంలోనే అత్యంత గర్వకారణమైన క్షణమని జెస్సీ తల్లి అరుణ సంతోషం వ్యక్తం చేశారు.
ఇస్రోలో చేరడమే లక్ష్యం..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిగా తాను ఎంపికవుతానని అసలు ఊహించలేదని జెస్సీ తెలిపింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో మాట్లాడేటప్పుడు చాలా ఉత్కంఠగా అనిపించిందని పేర్కొంది. ఈ విజయం తనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, భవిష్యత్తులో ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని తెలిపింది. 'నా తల్లిదండ్రులకు అండగా నిలవాలి. నా ఉపాధ్యాయులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి' అంటూ జెస్సీ చెప్పుకొచ్చింది.
ప్రశంసల వెల్లువ..
జెస్సీ విజయంపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'మిషన్ శక్తిశాట్'కు ఎంపికైన కందుల జెస్సీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రపంచ అంతరిక్ష యాత్ర వరకు ఆమె ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. 'జెస్సీ, నువ్వు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచావు. నువ్వు చంద్రుడిని, ఆపై శిఖరాలను చేరుకుంటున్న ఈ ప్రయాణంలో నీకు శుభాకాంక్షలు' అంటూ పోస్టు చేశారు. విద్యార్థిని జెస్సీని రాజ్యసభ సభ్యుడు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు సానా సతీశ్ కూడా అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీజేపీ ఉద్యమంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పోస్టు..
నేడు కేబినెట్ భేటీ.. పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం స్పెషల్ ఫోకస్