Share News

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో చరిత్రాత్మక ఒప్పందం..

ABN , Publish Date - Jun 09 , 2026 | 09:16 PM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ టూరిజం శాఖ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) మధ్య చరిత్రాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో చరిత్రాత్మక ఒప్పందం..
Minister Kandula Durgesh

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ టూరిజం శాఖ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) మధ్య చరిత్రాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. విశాఖపట్నంలో సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు 41వ ఐఏటీవో వార్షిక సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ వార్షిక సదస్సు సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగానికి చెందిన ప్రముఖులు, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానుందని టూరిజం శాఖ అధికారులు భావిస్తున్నారు.


ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజన్‌కు అనుగుణంగానే ఐఏటీవోతో భాగస్వామ్యం ఏర్పడిందన్నారు. 41వ ఐఏటీవో వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఏపీకి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలో జరిగే ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని బీచ్‌లు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి సౌందర్య ప్రాంతాలు, వారసత్వ సంపద వంటి పర్యాటక విశేషాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభిస్తుందని మంత్రి దుర్గేశ్ చెప్పారు.


ఈ ఒప్పందం ద్వారా ఏపీకి విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుందని మంత్రి దుర్గేశ్ వివరించారు. సెప్టెంబర్‌లో జరిగే సదస్సుకు దాదాపు వెయ్యి మంది అంతర్జాతీయ టూరిజం ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక టూర్ ఆపరేటర్లకు ప్రోత్సాహంగా ఐఏటీవో సభ్యత్వ నమోదు ఫీజులో 50 శాతం ప్రత్యేక రాయితీ కల్పించడంతో పాటు రూ.10వేల జాయినింగ్ ఫీజును పూర్తిగా మినహాయించినట్లు దుర్గేశ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పర్యాటక రంగంలో ఇప్పటికే రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వంపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరగడంతో భారీ ప్రాజెక్టులు ముందుకు వస్తున్నాయని మంత్రి దుర్గేశ్ చెప్పుకొచ్చారు.


ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని మంత్రి దుర్గేశ్ స్పష్టం చేశారు. ఈ సదస్సు జాతీయ ట్రావెల్ ట్రేడ్, పర్యాటక రంగ అగ్రనేతల సమక్షంలో ఏపీలోని వైవిధ్యభరితమైన పర్యాటక అవకాశాలను ప్రదర్శించేందుకు అరుదైన వేదికగా నిలవనుందని మంత్రి దుర్గేశ్ అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం

లోకేశ్‌పై జగన్‌ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు.. రామ్మోహన్ ధ్వజం

Updated Date - Jun 09 , 2026 | 09:23 PM