నాలుగు జిల్లాలకు అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..
ABN , Publish Date - May 28 , 2026 | 11:33 AM
ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా విజృంభిస్తూ రాష్ట్ర ప్రజలు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భారీ గాలులకు పెద్దఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. అలాగే గాలుల బీభత్సానికి పంటలు నష్టపోవడంతో రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈ మేరకు ప్రతిరోజూ వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ హెచ్చరిస్తున్నారు.
తాజాగా నేడు (గురువారం) ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న మూడు గంటల్లో కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఆ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు