దమ్ముంటే.. ఫేక్ అని నిరూపించండి
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:30 AM
‘ఇవిగో.. మా సర్టిఫికెట్లు చూడండి. దమ్ముంటే.. మావి ఫేక్ సర్టిఫికెట్లని నిరూపించండి’ అంటూ వైసీపీ నేతలకు డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు సవాల్ విసిరారు. చేతిలో ఉన్న టెట్ ఉత్తీర్ణత, క్రీడా సర్టిఫికెట్లను వైసీపీ నేతలకు చూపించారు.
ఇవిగో మా సర్టిఫికెట్లు చూడండి
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల సవాల్
శాప్ కార్యాలయం వద్ద బైఠాయింపు
అసత్య ప్రచారాలు మానాలని హితవు
ఫేక్ ప్రచారంపై చర్యలు తీసుకోవాలని శాప్ ఎండీ భరణి, మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి వినతి
విజయవాడ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘ఇవిగో.. మా సర్టిఫికెట్లు చూడండి. దమ్ముంటే.. మావి ఫేక్ సర్టిఫికెట్లని నిరూపించండి’ అంటూ వైసీపీ నేతలకు డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు సవాల్ విసిరారు. చేతిలో ఉన్న టెట్ ఉత్తీర్ణత, క్రీడా సర్టిఫికెట్లను వైసీపీ నేతలకు చూపించారు. కళ్లు తెరిచి తమ సర్టిఫికెట్లను చూడాలని, ఇకనైనా నిజాలు తెలుసుకుని నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. సోమవారం విజయవాడలోని శాప్ కార్యాలయం ఇందుకు వేదికైంది. మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు, వైసీపీ నేతలు సోమవారం ఎదురెదురుపడ్డారు. వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ శాప్ ఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు స్పోర్ట్స్ కోటా టీచర్లు వచ్చారు. అదే సమయంలో డీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు అక్కడ ఆందోళనకు దిగారు. టీచర్లు కార్యాలయం గేటు లోపల ఉండగా, రోడ్డుపై వైసీపీ నేతలు ఆందోళన చేశారు.
రెచ్చగొట్టిన వైసీపీ నేతలు
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అభ్యర్థులు శాప్ కార్యాలయం వద్ద ఉండగా.. ‘మీరందరూ ఫేక్.. మీ సర్టిఫికెట్లు ఫేక్.. మీరు అసలు టెట్ రాయలేదు.. డబ్బులిచ్చి ఉద్యోగాలు పొందారు’ అంటూ వైసీపీ నేతలు ఆరోపణలకు దిగారు. దీంతో టీచర్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొందరు కంట తడి పెట్టుకున్నారు. వెంటనే వారి బ్యాగ్‌లలో ఉన్న టెట్ ఉత్తీర్ణత, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాధించిన క్రీడా సర్టిఫికెట్లను బయటకు తీశారు. వాటిని చేతితో పట్టుకుని వైసీపీ నేతల వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. టీచర్లు తమ సర్టిఫికెట్లను చేతితో పైకి ఎత్తి వైసీపీ నేతలకు చూపించారు.
మీ వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినవే
‘మా దగ్గర ఉన్న కొన్ని సర్టిఫికెట్లు.. మీ వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినవే. ఎంతో కష్టపడి జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాణించి పతకాలు, సర్టిఫికెట్లు సాధించాం. మీ రాజకీయ కుట్ర కోణంలో మాపై బుదర జల్లడం న్యాయమా’ అని టీచర్లు ప్రశ్నించారు. పదేపదే ఫేక్, ఫేక్ అంటూ ఎందుకు విషప్రచారం చేస్తున్నారంటూ నిలదీశారు. మీరు చేస్తున్న విష ప్రచారంతో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పని చేసే స్కూల్‌లోని విద్యార్థులు, సహ ఉపాధ్యాయుల ముందు తలెత్తుకోలేక పోతున్నామని కంట తడి పెట్టుకున్నారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: శాప్ ఎండీ
వైసీపీ నేతలకు, టీచర్లకు మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలను పోలీసులు అక్కడ నుంచి తరిమేశారు. అనంతరం శాప్ ఎండీ భరణికి టీచర్లు వినతిపత్రం ఇచ్చారు. వైసీపీ విషప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. భరణి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగాలను పారదర్శకంగా నియమించిందని చెప్పారు. ప్రతి సర్టిఫికెట్‌ను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతనే అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అసత్య ప్రచారాలపై అధైర్య పడొద్దని టీచర్లకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాలని సూచించారు.
సబబు కాదు
నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. నా తండ్రి ప్రోత్సాహంతో బాక్సర్‌గా రాణించాను. జాతీయ క్రీడా వేదికపై రాష్ట్ర ఖ్యాతిని చాటాను. దీనికోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నా సర్టిఫికెట్‌ను ఫేక్ అంటున్నారు. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం వైసీపీ వాళ్లకు సబబు కాదు.
- గాయత్రి, బాక్సర్, కోనసీమ జిల్లా
రాజకీయమే..
వైసీపీ వాళ్లు మా సర్టిఫికెట్లను ఫేక్ అంటున్నారు. వారి రాజకీయ ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. నేను జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. పేద కుటుంబం నుంచి వచ్చాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేయాలనే కోరికతోనే ఉద్యోగంలో చేరాను.
- ఇ.రమ్య, రెజ్లర్, చిత్తూరు
విషప్రచారం చేస్తున్నారు
నాకు టెట్‌లో 116.5 మార్కులు వచ్చాయి. కానీ నేను టెట్ పాస్ కాలేదని విషప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు. వైసీపీ వాళ్లు చేసే అసత్య ప్రచారంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇకనైనా నిజాలు తెలుసుకుని మాట్లాడతారని ఆశిస్తున్నాను.
- సుచిత్ర, జూడో, అనంతపురం
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక