Share News

కేతిరెడ్డీ.. లంచం తీసుకున్నట్లు నిరూపించు!

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:44 AM

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ధర్మవరం రూరల్‌ సీఐ ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. వైసీపీ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించేందుకు తాను లంచం తీసుకున్నానని కేతిరెడ్డి ఆరోపించారని, దీన్ని నిరూపించాలని ఆయన సవాలు విసిరారు.

కేతిరెడ్డీ.. లంచం తీసుకున్నట్లు నిరూపించు!

  • లేదంటే నీపై సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెడతా

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ధర్మవరం సీఐ హెచ్చరిక

ధర్మవరం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ధర్మవరం రూరల్‌ సీఐ ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. వైసీపీ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించేందుకు తాను లంచం తీసుకున్నానని కేతిరెడ్డి ఆరోపించారని, దీన్ని నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. శుక్రవారం ఆయన సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ‘మీ కార్యకర్తలతో నామినేషన్‌ వేయించడానికి నేను లంచం తీసుకున్నట్లు నిరాధార ఆరోపణలు చేశావు. అది నిరూపించు. లేదంటే నీపై రేపే సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెడతా’ అని హెచ్చరించారు. ‘మీ వాళ్లు నా వద్దకు వచ్చారు.

నామినేషన్‌ వేయడానికి వాహనాల్లో వెళితే టీడీపీ వాళ్లు ధ్వంసం చేస్తారని, పోలీసు వాహనంలో తీసుకెళ్లాలని ప్రాధేయపడ్డారు. మీ కార్యకర్తల ప్రాణాలను కాపాడటానికి నా ప్రాణాలను అడ్డుపెట్టి నామినేషన్‌ కేంద్రాల వద్దకు తీసుకెళ్లాను’ అని అన్నారు. ‘నేను నీలా డ్రామాలు ఆడే రాజకీయ నాయకుడిని కాదు. నిజాయితీగల పోలీసు అధికారిని. మీ కార్యకర్తలు అడిగితే బాధ్యతగా భావించి నా వాహనంలో నామినేషన్‌ వేయించడానికి తీసుకెళ్లాను. నేను డబ్బులు అడిగినట్లు రుజువుచేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే’ అని అన్నారు. ‘నీకూ నాకు నాలుగైదుసార్లు వాగ్వాదం జరిగింది.

మీరు చెప్పిన తప్పుడు పనులు నేను చేయలేదు. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నావు. ప్రతిదానికీ కోర్టులో కేసులు వేస్తా అని బెదిరిస్తావు కదా, నీకు దమ్ముంటే ఇప్పుడు పెట్టు కేసులు. లేదంటే నేనే పెడతా’ అని హెచ్చరించారు. కాగా, బత్తలపల్లిలో గురువారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తతల నేపథ్యంలో వైసీపీ నాయకులను సీఐ స్వయంగా తన వాహనంలో నామినేషన్‌ కేంద్రానికి తీసుకెళ్లారు. దీనికోసం సీఐ లంచం తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 05:44 AM