బన్నీ ఉత్సవం.. రక్తసిక్తం
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:17 AM
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి బన్నీ ఉత్సవం రక్తసిక్తంగా మారింది. సంప్రదాయ కర్రల సమరం హోరాహోరీగా సాగడంతో పాటు, దేవుళ్ల విగ్రహాలను గ్రామాలకు తీసుకెళ్లే జైత్రయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హోరాహోరీగా సాగిన కర్రల సమరం.. తొక్కిసలాటలో ఒకరు మృతి
100 మందికి పైగా భక్తులకు గాయాలు
రాళ్లు, కాగడాలతో పరస్పర దాడులు
ఆలూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి బన్నీ ఉత్సవం రక్తసిక్తంగా మారింది. సంప్రదాయ కర్రల సమరం హోరాహోరీగా సాగడంతో పాటు, దేవుళ్ల విగ్రహాలను గ్రామాలకు తీసుకెళ్లే జైత్రయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆలూరుకు చెందిన పోతురాజు(35) మృతిచెందగా వంద మందికి పైగా గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన బన్నీ ఉత్సవం సందర్భంగా అరికెర, నెరణికి, నెరణికి తండా, బిలేహాల్ గ్రామాలకు చెందిన భక్తులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి కర్రల సమరంలో పాల్గొన్నారు.
జైత్రయాత్ర సమయంలో కొన్ని బృందాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పాటు కాగడాలు విసురుకున్నారు. ఈ ఘటనల్లో పలువురు భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో దేవరగట్టు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. గురువారం ఉదయం 7 గంటల వరకు జైత్రయాత్ర కొనసాగింది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఘర్షణలు, తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. కర్నూలు ఎస్పీ విక్రాంత్‌పాటిల్ సహా పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించినప్పటికీ పరిస్థితులు చేయిదాటాయి.
ఈ వార్తలనూ చదవండి: