Share News

రక్తం చిందిన దేవరగట్టు

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:00 AM

కదన రంగంలో కర్రలు నాట్యం చేశాయి. రక్తం చిందింది. ఆచారమే గెలిచింది. తలలు పగిలినా, గాయాలైనా భక్తులు వెనుకడుగు వేయలేదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం పేరుతో దేవరగట్టు కొండపై మరోసారి బన్నీ సమరం రక్తసిక్తమైంది.

రక్తం చిందిన దేవరగట్టు

  • కర్రల సమరంలో పలువురికి గాయాలు

  • ఉత్కంఠ భరితంగా బన్నీ ఉత్సవం

ఆలూరు/హొళగుంద, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): కదన రంగంలో కర్రలు నాట్యం చేశాయి. రక్తం చిందింది. ఆచారమే గెలిచింది. తలలు పగిలినా, గాయాలైనా భక్తులు వెనుకడుగు వేయలేదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం పేరుతో దేవరగట్టు కొండపై మరోసారి బన్నీ సమరం రక్తసిక్తమైంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలు బుధవారం అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ స్వామివారి జైత్రయాత్ర సాగింది. దేవరగట్టు కొండపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బన్ని ఉత్సవాల సందడి మొదలైంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత వేద పండితులు రవిశర్మ మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో కొండపై నుంచి కిందకు తీసుకొచ్చి సింహాసన కట్ట వద్దకు చేర్చారు. అక్కడ మహా మంగళహారతి నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు కర్రలతో కదన రంగంలోకి దిగడంతో బన్నీ ఉత్సవం ప్రారంభమైంది. ‘డిర్ర్‌ర్ర్‌... గోపరాక్‌’ నినాదాలతో కొండ ప్రాంతం మార్మోగింది. కాగడాల వెలుగులో వేలాది కర్రలు గాల్లోకి లేవగా, పసుపు బండారుతో నిండిన భక్తులు తలపడ్డారు. సుమారు అరగంటకుపైగా ఈ సమరం సాగింది. తీవ్రంగా గాయపడిన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్సలు చేశారు. సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న దేవరగట్టు కొండపై అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉత్సవాలు కొనసాగాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 06:00 AM