‘ఎలిమెంటరీ విద్య’కు దారేదీ?
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:14 AM
రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ఏటా డీఎస్సీ అని ప్రకటిస్తుంటే.. ఎలిమెంటరీ స్థాయి టీచర్ విద్యను అభ్యసించేందుకు రాష్ట్రంలో దారి కనిపించడం లేదు.
‘ఎలిమెంటరీ విద్య’కు దారేదీ?
డీసెట్ అర్హులు 11,303.. సీట్లు 2,250
అయినా ప్రైవేటు డైట్‌ల రెన్యువల్‌కు నో
కోర్టు ఆదేశించినా కౌన్సెలింగ్‌కు నిరాకరణ
జగన్ నిర్ణయాన్ని రద్దు చేయాలి: అభ్యర్థులు
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ఏటా డీఎస్సీ అని ప్రకటిస్తుంటే.. ఎలిమెంటరీ స్థాయి టీచర్ విద్యను అభ్యసించేందుకు రాష్ట్రంలో దారి కనిపించడం లేదు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సు చదివేందుకు వేల మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నప్పటికీ సీట్లు తక్కువగా ఉండటంతో నిరాశకు గురవుతున్నారు. ఈ సంవత్సరం 17,632 మంది డీసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 14,093 మంది ప్రవేశ పరీక్ష రాసి, 11,303 మంది అర్హత సాధించారు. అయితే.. రాష్ట్రంలో ఉన్న 22 డైట్ కాలేజీలలో 2,250 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది 8 డైట్‌లకు అనుమతులు రెన్యువల్ చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అకారణంగా నిలిపివేసిన డైట్‌లకు ప్రస్తుత ప్రభుత్వం అనుమతులు జారీచేయలేదనే వాదన వినిపిస్తోంది. దీంతో కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించి కౌన్సెలింగ్‌లో చేర్చాలని కోరారు. కోర్టు సానుకూల ఉత్తర్వులిచ్చినా అధికారులు ససేమిరా అంటున్నారు. ఫలితంగా 163 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి సైతం డీఈడీ అడ్మిషన్ లభించలేదు. చాలా మందికి సుదూర ప్రాంతాల్లో సీట్లు రావడంతో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాంధ్రలో 3 ఉమ్మడి జిల్లాలకు కలిపి 300 సీట్లే ఉన్నాయి. విశాఖపట్నంలో 800 మంది డీసెట్ అర్హత సాధిస్తే వంద సీట్లు మాత్రమే ఉన్నాయి. నర్సీపట్నంలోని కాలేజీకి అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడి విద్యార్థులు వంద కిమీ వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి.. తమకు మార్గం సుగమం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.