Share News

ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:54 AM

అర్నాబ్‌, మురసు తుఫాన్లతో అతలాకుతలమైన కోస్తాంధ్ర జిల్లాలను మరో తుఫాను ముప్పు భయపెడుతోంది. ఈ తుఫాను ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి లేదా 19న ఉదయం...

ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు

  • కాకినాడ లేదా కళింగపట్నం వద్ద 18-19 తేదీల్లో తీరం దాటే అవకాశం

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

  • రేపటికల్లా వాయుగుండం.. 16న తుఫాన్‌గా

విశాఖపట్నం, అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అర్నాబ్‌, మురసు తుఫాన్లతో అతలాకుతలమైన కోస్తాంధ్ర జిల్లాలను మరో తుఫాను ముప్పు భయపెడుతోంది. ఈ తుఫాను ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి లేదా 19న ఉదయం మచిలీపట్నం, గోపాలపూర్‌ మధ్య కాకినాడ లేదా కళింగపట్నం సమీపాన తీరం దాటుతుందని అంచనా. ఈ అంచనాకు బలం చేకూర్చేలా భారత వాతావరణ శాఖ తుఫాను డివిజన్‌ కూడా తుఫాను ఉత్తరాంధ్ర దిశగా వస్తుందని శుక్రవారం వెల్లడించింది.

అయితే బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన తర్వాత తీరం దిశగా వచ్చే సమయంలో కొంతవరకు బలహీనపడుతుందని పలు మోడళ్లు విశ్లేషిస్తున్నాయి. ఇదిలావుండగా ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే తీర ప్రాంత జిల్లాలు, దక్షిణ ఒడిశాలో అధికారులను అప్రమత్తం చేసింది.


ఉత్తర కోస్తాపై ప్రభావం ఎందుకంటే..!

శుక్రవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారంకల్లా తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. ఆపై ఈ నెల 15వ తేదీకల్లా వాయుగుండంగా బలపడుతుంది. అది ఉత్తర వాయవ్యంగా పయనించి మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి 16వ తేదీకల్లా తుఫానుగా మరింత బలపడుతుంది. ఆతర్వాత సుమారు రెండురోజులపాటు సముద్రంలోనే కొనసాగి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అధిక పీడనం లేకపోతే తుఫాను బంగ్లాదేశ్‌ వైపు వెళ్లేది.

కానీ రెండు సముద్రాల్లో ఉన్న అధిక పీడనాల ప్రభావంతో కొంతమేర బలహీనపడి ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తరాంధ్రలో తీరం దాటితే మూడు ఉమ్మడి జిల్లాలు, పొరుగునున్న తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి పైరు కొన్నిచోట్ల కోతకు సిద్ధంగా ఉండగా ఎక్కువ ప్రాంతాల్లో పొట్టదశలో ఉంది.

వదంతులను నమ్మొద్దు

తుఫాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ల వద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే వెళ్లినవారు తిరిగి తీరానికి చేరుకోవాలని సూచించింది. కాగా తుఫాను ఎక్కడ తీరం దాటుతుందో.. ఎటు పయనిస్తుందో.. స్పష్టత రావాల్సి ఉందని, దీనిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరింది.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 12:54 AM