రైతుల గుండెల్లో ‘తుఫాన్’
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:54 AM
తుఫాను హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్ పంటలు చేతికొస్తాయో లేదోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. సార్వా వరి పంట కోత దశలో ఉంది.
ఇప్పుడిప్పుడే మొదలవుతున్న వరి కోతలు
పెసర, మినుము, పత్తి తీత ప్రారంభం
ఖరీఫ్ పంటలు చేతికొచ్చేనా?
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): తుఫాను హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్ పంటలు చేతికొస్తాయో లేదోనన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. సార్వా వరి పంట కోత దశలో ఉంది. చాలా ప్రాంతాల్లో గింజ పాలుపోసుకుని, పొట్ట దశలో ఉండగా, ముదురు పైరు కోతకు వచ్చింది. మరో వారం పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నవంబరు 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడానికి పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. అయితే శుక్రవారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఈ నెల 25నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.
వరి కోసి ఓదెలపై ఉంచే దశలో వర్షాలు కురిస్తే.. పనలు తడిసినా, గింజ తడిసినా, ధాన్యం పాడవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోస్తాలో వరితోపాటు ఖరీఫ్‌లో సాగైన మొక్కజొన్న ప్రస్తుతం గింజ గట్టిపడి, కోతకు వచ్చింది. పత్తి పంట 2-3 తీతల్లో ఉంది. కంది పూత, కాయ దశలోనే ఉండగా, పెసలు, మినుములు, ఉలవ పంటలను రైతులు కోత కోస్తున్నారు. రాయలసీమలో వేరుశనగ కాయ గట్టిపడి, కోత దశకు వచ్చింది. జొన్న, రాగి, సజ్జ పంటలు కోత దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వరి 14.64, పత్తి 4.72, వేరుశనగ 1.90 లక్షల హెక్టార్లలో సాగైంది.
ఖరీఫ్ పంటల్లో అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటలు కోతలు పూర్తవుతున్నాయి. కాగా ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురిస్తే ఖరీఫ్ పంటలకు ఇబ్బంది కలగనుండగా, రబీ పంటల సాగుకు అనుకూలమవుతాయని రైతులు చెప్తున్నారు. అయితే వర్షపాతాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. వరి కోత, నూర్పిడి దశలో వానలు పడితే భారీ నష్టం వాటిల్లడంతోపాటు బియ్యం ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి: