ముంచుకొస్తున్న మురసు
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:27 AM
రాష్ట్రాన్ని మరో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. అర్నబ్ తుఫాన్ దెబ్బ నుంచి కోలుకోకముందే ‘మురసు’ తుఫాన్ ముంచుకొచ్చింది
ఒంగోలుకు530 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
నేటి ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం
అర్ధరాత్రి తరువాత ఒంగోలుకు సమీపంలో తీరం దాటుతుందని అంచనా
నేడు, రేపు దక్షిణ కోస్తా జిల్లాల్లో కుంభవృష్టి
తీరం దాటే సమయంలో పెనుగాలులు
రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు
ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు హెచ్చరిక
అర్నబ్ నుంచి కోలుకోకముందే మరో ముప్పు
తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి
అన్ని ముందస్తు సన్నద్ధత చర్యలు తీసుకోవాలి
సీఎం ఆదేశాలు.. నేటి ఢిల్లీ పర్యటన రద్దు
బుడమేరు సహా పలు వాగులకు వరద ముప్పు
అమరావతి/విశాఖపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని మరో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. అర్నబ్ తుఫాన్ దెబ్బ నుంచి కోలుకోకముందే ‘మురసు’ తుఫాన్ ముంచుకొచ్చింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో గల వాయుగుండం శనివారం అర్ధరాత్రి తరువాత తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా బలపడింది. ఆ తరువాత నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఆదివారం రాత్రికి చెన్నైకి 420, నెల్లూరుకు 490 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, ఒంగోలుకు ఆగ్నేయంగా 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి సోమవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది. అనంతరం వాయవ్యంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తాకు సమీపంగా వచ్చి సోమవారం అర్ధరాత్రి తరువాత మంగళవారం తెల్లవారుజాములోగా నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఒంగోలుకు సమీపంలో తీరం దాటనుంది. తుఫాన్ తీరం దాటే కేంద్రం మాత్రం శనివారం నాటి అంచనాలకు భిన్నంగా ఒంగోలుకు సమీపానికి మారినట్టు ఆదివారం రాత్రిభారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాత్రి ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కోస్తా, దానికి ఆనుకుని ఉత్తర తమిళనాడు ప్రాంతానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో ఆదివారం కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టి, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. ఈనెల మూడో తేదీన అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో కుంభవృష్టి, విజయనగరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అతిభారీగా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కడప, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నుంచి తీరం వెంబడి 100 నుంచి 110, అప్పుడప్పుడు 120 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మత్స్యకారులు ఈ నెల నాలుగో తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. కాగా, మురసు ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంట ఉత్పత్తుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
‘మురసు’ అంటే..
ఒక్కో తుఫాన్‌కు ఒక్కో దేశం పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత తుఫాన్‌కు భారత్ ’మురసు’ అనే పేరు పెట్టింది. తమిళంలో మురసు అంటే ‘పెద్ద ఢంకా’ అని అర్థం. ప్రాచీన కాలంలో ఏదైనా విపత్తు లేదా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి, ముఖ్యమైన ప్రకటనలు, హెచ్చరికలు, యుద్ధ సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ఢంకా/ డప్పు మోగించేవారు. ఇందులో వీర మురసు, న్యాయ మురసు, త్యాగ మురసు అనే మూడు రకాలు ఉండేవని చెబుతారు. వీర మురసును విజయం/ ఓటమిని సూచించడానికి, యోధులను సమీకరించడానికి యుద్ధాల సమయంలో (యుద్ధ భేరి) మోగించేవారు. అలాగే న్యాయ మురసును న్యాయానికి సంబంధించిన నిర్ణయాలు, ఆదేశాలు ప్రకటించడానికి ఉపయోగించేవారు. త్యాగ మురసును సహాయాన్ని, దాతృత్వాన్ని అందించే సమయంలో గౌరవప్రదంగా ధ్వనింపజేసేవారు.
‘మనమిత్ర’ ఉపయోగించుకోండి
తుఫాన్ వల్ల ఏదైనా సమస్య ఎదురైతే ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌ను వినియోగించుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వాట్సాప్ నం. 9552300009 ద్వారా అధికారులకు సమాచారం ఇస్తే ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, 7 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయని వివరించారు.
రెండురోజులు జాగ్రత్త: హోంమంత్రి
అర్నబ్ తరహాలో మురసు తుఫాన్‌ను కూడా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమ, మంగళవారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెస్క్యూ టీమ్‌లకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..
నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం