Share News

కోస్తాకు మరో తుఫాన్‌ ముప్పు

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:37 AM

అర్నబ్‌ అతి తీవ్ర తుఫాన్‌ సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోక ముందే మరో తుఫాన్‌ కోస్తా దిశగా రానుంది. అర్నబ్‌ తుఫాన్‌ ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై విరుచుకుపడగా, రానున్న తుఫాన్‌ మధ్య కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది.

కోస్తాకు మరో తుఫాన్‌ ముప్పు

  • బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం

  • నేడు తుఫాన్‌గా మార్పు.. ‘మురసు’గా నామకరణం

  • ఎల్లుండికి మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం

  • రేపు, ఎల్లుండి మధ్యకోస్తాలో కుంభవృష్టి!

  • ఓడరేవుల్లో ఒకటో నంబరు సూచిక జారీ

  • 4 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

  • ఈ ముప్పునూ ఎదుర్కోవాలి.. సీఎం కీలక సమీక్ష

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ అతి తీవ్ర తుఫాన్‌ సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇంకా కోలుకోక ముందే మరో తుఫాన్‌ కోస్తా దిశగా రానుంది. అర్నబ్‌ తుఫాన్‌ ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలపై విరుచుకుపడగా, రానున్న తుఫాన్‌ మధ్య కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 29 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవడం తుఫాన్‌లకు అనుకూలంగా మారిందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం రాత్రికి తీవ్ర అల్పపీడనంగా, శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది.

అనంతరం ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. శనివారం సాయంత్రానికి ఇది విశాఖపట్నానికి 980, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1030 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా, ఆదివారం మధ్యాహ్నానికి తుఫాన్‌గా బలపడనున్నది. దీనికి భారతదేశం సూచించిన ‘మురసు’ అని పేరు పెట్టనున్నారు. తుఫాన్‌ సోమవారం సాయంత్రానికి మధ్య కోస్తాకు అతి చేరువగా వచ్చి అదేరోజు రాత్రి లేదా మంగళవారం ఉదయం నరసాపురం, ఒంగోలు మధ్య మచిలీపట్నానికి దక్షిణంగా తీరం దాటుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. తీరం దగ్గరకు వచ్చే సమయంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కోస్తాలో మత్స్యకారులు ఆదివారం నుంచి నవంబరు 4వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.


తీరం వెంబడి ఆదివారం గాలులు మొదలవుతాయని, సోమవారం నుంచి మరింత పెరుగుతాయని తెలిపింది. కాకినాడ నుంచి ఒంగోలు వరకు గంటకు 70 నుంచి 80 కి.మీ. అప్పుడప్పుడు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110, అప్పుడప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కుంభవృష్టి, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, తిరుపతి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అతి భారీ, కోనసీమ, కడప, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. కోస్తాలో ప్రధాన ఓడరేవుల్లో ఒకటవ నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. కాగా, తుఫాన్‌ ప్రభావంతో రానున్న మూడు రోజులు మధ్య ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 03:54 AM