‘నీళ్లు’వునా ముంచారు..!
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:46 AM
పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని మాటలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం వారి ఆశలపై ‘నీళ్లు’ చల్లింది. జగనన్న కాలనీలు కాదు.. ఊళ్లు వెలుస్తున్నాయంటూ గొప్పలు చెప్పి, నివాసయోగ్యం కాని చోట్ల స్థలాలు మంజూరు చేసింది.
తుఫాన్ ధాటికి కాకినాడ కొమరగిరిలోని జగనన్న లేఅవుట్ కకావికలం
ఇళ్ల మధ్యకు చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు
నివాసయోగ్యం కాదని హెచ్చరించినా.. పట్టించుకోని అప్పటి వైసీపీ ప్రభుత్వం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని మాటలు చెప్పిన గత వైసీపీ ప్రభుత్వం వారి ఆశలపై ‘నీళ్లు’ చల్లింది. జగనన్న కాలనీలు కాదు.. ఊళ్లు వెలుస్తున్నాయంటూ గొప్పలు చెప్పి, నివాసయోగ్యం కాని చోట్ల స్థలాలు మంజూరు చేసింది. గత ప్రభుత్వం కాకినాడ నగరవాసులకు జనావాసాలకు దూరంగా ఉప్పు నీటికి చేరువలో ఉన్న స్థలాలు చూపించింది. సెంటు స్థలం ఇచ్చి, మౌలిక వసతులు కల్పించకుండా చేతులు దులుపుకొంది. నేడు ఆ స్థలాలన్నీ ఆర్నబ్ తుఫాన్ దెబ్బతో నీటితో నిండి చెరువులుగా మారాయి.
ఇదీ కాకినాడ నగర ప్రజలకు నాటి జగన్ ప్రభుత్వం కేటాయించిన సముద్రానికి కూత వేటు దూరంలోని కొమరిగిరి లేఅవుట్ దుస్థితి. ఈ లేఅవుట్ ఉవ్వెత్తున ఎగసిపడిన అలలతో సాగర తీరంలో కలిసి పోయింది! ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డును ధ్వంసం చేస్తూ.. నీరు భారీగా లేఅవుట్లోకి చొచ్చుకు వచ్చింది. దీంతో లేఅవుట్ మినీ సముద్రాన్ని తలపించింది. చుట్టూ నీరచేరడంతో స్థానికులు ఇళ్లల్లోనే ఉండిపోయారు. గత నాలుగు రోజులుగా కరెంటు లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు సైతం తెగిపోయాయి. అప్పటి వైసీపీ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన స్వప్రయోజనాలు చూసుకోవడం వల్లే నేడు ఆ ప్రాంతవాసులు నరకం అనుభవిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
భారీగా అవినీతి ఆరోపణలు
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కాకినాడ నగరవాసులకు ఇంటి స్థలాల కోసం కొమరగిరిలో 308 ఎకరాలు సేకరించారు. కాకినాడ జిల్లాలో అతి పెద్ద లేఅవుట్ ఇదే. ఎకరం రూ.30 లక్షలకు రైతుల వద్ద కొనుగోలు చేసి, రూ.55 లక్షలకు కొనుగోలు చేసినట్టుగా అప్పట్లో ప్రభుత్వానికి లెక్కలు చూపించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు కొంత మంది ఈ లేఅవుట్ పేరుతో పెద్దఎత్తున సొమ్ములు వెనకేసుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ లేఅవుట్లో 16,601 మందికి ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. వారిలో 9,727 మందికి ఇళ్ల నిర్మాణాలు మంజూరు చే శారు. సుమారు 1800 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా.. అక్కడ నివసించేది కేవలం 165 మంది మాత్రమే.
మౌలిక సదుపాయాలు కరువు:
అదనపు సొమ్ము చెల్లించే స్తోమత లేక లబ్ధిదారులు ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి వెనుకంజ వేస్తున్నారు. వందలాది ఇళ్లు మొండిగోడల్లా మిగిలిపోయాయి. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అటువైపు వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపడడం లేదు. ప్రస్తుతం ఉం టున్న వారికి కూడా కనీసం తాగునీరు కూడా దొరకడం లేదు. రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గంజాయి బ్యాచ్, దొంగల బెడదతో నిత్యం భయంభయంగా బతుకున్నారు.
వద్దని చెప్పినా వినకుండా..
ఈ లేఅవుట్ నివాసయోగ్యం కాదని అప్పట్లో స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అనేకసార్లు హెచ్చరించారు. ఈ ప్రాంతం సముద్రపు అలల ప్రభావానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని.. ఉప్పాడ, సుబ్బంపేట ప్రాంతాల మాదిరి భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించినా అప్పటి పాలకులు పెడచెవిన పెట్టారు. స్థలాలు పొందిన లబ్ధిదారులు కూడా అన్నివిధాలా సౌకర్యవంతంగా ఉన్న నగరాన్ని వదిలి, ఎక్కడో సుదూర ప్రాంతంలో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లలేమని లబోదిబోమన్నా పట్టించుకోలేదు.
పేదల జీవితాలతో చెలగాటం: ఎమ్మెల్యే కొండబాబు
తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన కొమరగిరి లేఅవుట్ కాలనీలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు శుక్రవారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ పేదలకు సొంతింటి కల నెరవేరుస్తామనే పేరుతో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ప్రకృతి వైపరీత్యాల ముప్పు పొంచిఉన్న ప్రాంతంలో ఇంటి స్థలాలిచ్చి పేదల జీవితాలతో చెలగాటమాడిందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ నిర్వాకానికి కొమరగిరి లేఅవుట్ నిలువెత్తు నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?