Share News

దిశ మార్చుకుంటూ.. ‘అక్వాన్‌’ మందగమనం

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:04 AM

రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ‘అక్వాన్‌‘ తుఫాను అతి నెమ్మదిగా కాకినాడ వైపు వస్తోంది. మచిలీపట్నానికి ఉత్తరంగా తీరం దాటుతుందన్న తొలి అంచనా మారుతోంది.

దిశ మార్చుకుంటూ.. ‘అక్వాన్‌’ మందగమనం

  • కాకినాడ వైపు కదులుతున్న తుఫాన్‌

  • తీరం దాటే ప్రాంతంపై తర్జనభర్జన

  • ఉమ్మడి విశాఖ జిల్లాలో దాటొచ్చు!

  • ఆ సమయానికి బలహీనపడే అవకాశం

  • రేపు సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్‌

  • 20న తీరం దాటుతుందని అంచనా

  • తగ్గనున్న గాలుల వేగం.. వర్షాలు అధికమే

విశాఖపట్నం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ‘అక్వాన్‌‘ తుఫాను అతి నెమ్మదిగా కాకినాడ వైపు వస్తోంది. మచిలీపట్నానికి ఉత్తరంగా తీరం దాటుతుందన్న తొలి అంచనా మారుతోంది. మంగళవారం రాత్రి 8.30 గంటలకు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం... గడచిన ఆరు గంటల్లో.. గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో తుఫాను ప్రయాణించింది. ఈ క్రమంలో రాత్రి 8.30కు విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 640 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.

ఇది బుధవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా, 19వ తేదీ నాటికి అతితీవ్ర తుఫానుగా మారుతుంది. అయితే తుఫాను తీరం దాటడానికి ముందే కొంతమేర బలహీనపడుతుందని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అతి తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ భూ ఉపరితలం నుంచి చలిగాలులు ఈ నెల 19 నుంచే తుఫాను దిశగా వీస్తాయని చెబుతున్నారు. దీంతో అతి తీవ్ర తుఫానుగా కాకుండా తుఫానుగా బలహీనపడి తీరం దాటే అవకాశం ఉన్నందున గాలుల వేగం తగ్గుతుందని అంటున్నారు.

అయితే వర్షాల తీవ్రత కొనసాగుతుందని, ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని, ఇంకా కృష్ణా జిల్లా వరకు కొంతమేర ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా తుఫాను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తీరం దాటుతుందని కొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నా దానిపై బుధవారం సాయంత్రానికి స్పష్టత వస్తుందని తెలిపారు.


గంటకు 3 కిలోమీటర్ల వేగంతో!

సోమవారం సాయంత్రం నుంచి తుఫాను బాగా నెమ్మదిగా కదులుతోంది. సగటున గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. సాధారణంగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాను ప్రయాణించాలి. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తుఫాను వేగం తగ్గిందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దిశ మార్చుకుంటున్న క్రమంలో వేగం తగ్గిందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికే తీవ్ర తుఫానుగా మారుతుందని తొలుత ప్రకటించినా, తాజా బులెటిన్‌ ప్రకారం బుధవారం ఉదయం తీవ్ర తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటన చేసింది. తీవ్ర తుఫానుగా బలపడిన తరువాత వాయవ్య దిశగా పయనించి కోస్తాంధ్ర తీరం దిశగా వస్తుంది. తుఫాను ప్రభావంతో బుధవారం నుంచి ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి.

తీరం వెంబడి గంటకు 60 నుంచి 70, అప్పుడప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 19 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలో ముఖ్యంగా విశాఖపట్నం నుంచి బాపట్ల వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా కుంభవృష్టి కురుస్తుంది. 19వ తేదీ నుంచి పలు జిల్లాల్లో గంటకు 120 నుంచి 130 అప్పుడప్పుడు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 04:14 AM