Share News

ఆరు క్లస్టర్లలో క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకులు

ABN , Publish Date - Aug 11 , 2026 | 06:38 AM

రాష్ట్రంలో సంప్రదాయ హస్త కళాకారులకు జీవనోపాధికి భద్రత కల్పించే లక్ష్యంతో అటవీశాఖ క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకులను సిద్ధం చేస్తోంది. మొదటి దశలో ఆరు క్లస్టర్ల పరిధిలో ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

ఆరు క్లస్టర్లలో క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకులు
Craft Wood Banks

  • ధవళేశ్వరం వద్ద సెంట్రల్‌ బ్యాంక్‌

  • హస్త కళాకారుల జీవనోపాధికి భద్రత

  • లాభనష్టాలు లేకుండా కలప సరఫరా

  • అటవీశాఖకు డిప్యూటీ సీఎం నిర్దేశం


అమరావతి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంప్రదాయ హస్త కళాకారులకు జీవనోపాధికి భద్రత కల్పించే లక్ష్యంతో అటవీశాఖ క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకులను సిద్ధం చేస్తోంది. మొదటి దశలో ఆరు క్లస్టర్ల పరిధిలో ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఉడ్‌ బ్యాంక్‌ల కోసం గోదాముల గుర్తింపు, కలప సేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కొండపల్లి, ఏటికొప్పాక, బొబ్బిలి, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి ప్రాంతాల్లో చెక్కలపై శిల్పాలు చెక్కే కళాకారుల కోసం ఈ ఉడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సమీపంలోని సామిల్‌ వద్ద వీటి అన్నింటికీ అనుసంధానంగా ఒక సెంట్రల్‌ ఉడ్‌ బ్యాంకును సిద్ధం చేస్తున్నారు. కొండపల్లిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్స్‌ క్వార్టర్స్‌ను ఉడ్‌ బ్యాంక్‌గా మార్చారు. కొండపల్లి బొమ్మల తయారీదారులకు అవసరమైన తెల్లపొనికి సేకరణ జరుగుతోంది. ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులకు తక్షణ సేవలు అందించేందుకు వీలు గా ఓ ప్రైవేట్‌ భవనాన్ని అద్దెకు తీసుకుని, కార్య కలాపాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. కొయ్య బొమ్మల కళాకారులకు విక్రయించేందుకు ఇప్పటికే 1.5 ఘనపు మీటర్ల(1.5సీఎంటీ) అంకుడు కర్రను సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో లేపాక్షి హ్యాండ్‌క్రాఫ్ట్‌ సొసైటీకి చెందిన కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకుగా గుర్తించారు. ఈ కళాకారుల కోసం ఇప్పటికే 50 ఘనపు మీటర్ల టేకు, 150 ఘనపు మీటర్ల నాన్‌ టేకు కలపను సిద్ధం చేశారు. తిరుపతి జిల్లా మాధమాల చెక్క బొమ్మల కళాకారుల కోసం పాత ఎర్రచందనం డిపోను ఉడ్‌ బ్యాంక్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 14.158 ఘనపు మీటర్ల నారియేపి, 8,495 ఘనపు మీటర్ల ఆకేసియా కటేచు కలపను సేకరించారు. ఉదయగిరి కళాకారుల కోసం ప్రస్తుత ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ క్వార్టర్‌ను ఉడ్‌ బ్యాంక్‌గా మార్చారు. బొబ్బిలి వీణ కళాకారులకు మద్దతుగా ఉడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు గొల్లపల్లి క్రాఫ్ట్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను గుర్తించారు. వీరి కోసం 15.66 ఘనపు మీటర్ల పనస, రోజ్‌వుడ్‌ కలప సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి సమీపంలోని సెంట్రల్‌ ఉడ్‌ బ్యాంక్‌లో వెదురు బొంగులతో పాటు రోజ్‌వుడ్‌, టేకు కలప అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎడ్ల బండ్ల తయారీకి ఖ్యాతి చెందిన ఏలూరు జిల్లా కాపవరంలో టేకుతో పాటు ఇతర కలపనూ అందుబాటులో ఉంచనున్నారు.


వారసత్వ కళలకు ప్రాణం పోసేందుకే...

క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుల ఏర్పాటుపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘మన సంప్రదాయ వారసత్వ కళలకు ప్రాణం పోసేందుకు, కళాకారులకు అండగా నిలిచేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాం. అటవీ వనరుల సుస్థిర వినియోగం, శాస్త్రీయ నిర్వహణ, అక్రమ కలప సేకరణ నివారణ, కళాకారులకు ఉపయోగపడే ముఖ్యమైన కలప జాతుల పునరుత్పత్తి, తోటల అభివృద్ధితో పాటు నిరంతర కలప సరఫరా లక్ష్యాల సాధనకు ఆ బ్యాం కులు ఉపయోగపడతాయి. కళాకారులకు అవసరమైన నాణ్యమైన చెక్కను తక్కువ ధరకు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఫలితంగా ఉత్పత్తి ఖర్చు తగ్గి, కళాకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. తద్వారా భవిష్యత్‌ తరాలు సంప్రదాయ కళ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది’ అని అన్నారు.


సింహాలు వారసత్వ సంపద: పవన్‌

అన్ని వన్యప్రాణుల మాదిరిగానే సింహాలు మన వారసత్వ సంపద అని అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆసియా సింహ గర్జన భారతదేశపు వన్య వారసత్వపు గర్జనగా అభివర్ణించారు. బలం, దృఢత్వం, గంభీరమైన, అమూల్యమైన సహజ వారసత్వానికి ప్రతీక సింహం. సింహాల సంరక్షణ, దాని ప్రయాణానికి ప్రభుత్వాలు, అటవీశాఖ, వన్యప్రాణి నిపుణులు, క్షేత్రస్థాయి బృందాలు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ లయన్‌ అద్భుతమన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర అటవీ శాఖ మంత్రి చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.


ఇవి కూడా చదవండి:

ఫిట్‌నెస్‌ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌ ఈసారైనా నిరూపించుకుంటాడా?

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

Updated Date - Aug 11 , 2026 | 06:38 AM