Share News

నలుగురిని కబళించిన కంటైనర్‌

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:57 AM

భారీ కంటైనర్‌ లారీ ఢీకొనడం తో మధ్యలో ఉన్న కారు నుజ్జునుజ్జయిపోయింది. అందులో ఉన్న నలుగురు మృత్యువాత ప డ్డారు.

నలుగురిని కబళించిన కంటైనర్‌
accident

  • ముందు బస్సు ఉండగా ఢీకొట్టడంతో నలిగిన కారు

  • మృతుల్లో దంపతులు.. మృత్యుంజయుడిగా కుమారుడు

  • ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద ఘోరం

  • ఓటేసేందుకు బెంగళూరు నుంచి వస్తుండగా ఘటన

  • కంటైనర్‌ డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే కారణం

ఒంగోలు క్రైం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): టోల్‌ ప్లాజా వద్ద ముందు బస్సు ఆగి ఉంది.. మధ్యలో కారు ఆగింది... అదే సమయంలో వేగంగా వచ్చిన భారీ కంటైనర్‌ లారీ ఢీకొనడం తో మధ్యలో ఉన్న కారు నుజ్జునుజ్జయిపోయింది. అందులో ఉన్న నలుగురు మృత్యువాత ప డ్డారు. 12 ఏళ్ల బాలుడు మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రకాశంజిల్లా టంగుటూ రు సమీపంలోని టోల్‌ ప్లాజా వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలేనికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. చెరువుకొమ్ముపాలేనికి చెందిన జాగర్లమూడి శ్రీనివాసరావు(38) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. 12 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు భార్య శివపార్వతి(30), కుమారుడు సాయికృష్ణ (12), అత్త కామేశ్వరమ్మ(51), బెంగళూరులో పనిచేస్తున్న అదేగ్రామానికి చెందిన సోమేపల్లి సాయికుమార్‌(31)తో కలిసి శనివారం మధ్యా హ్నం కారులో స్వగ్రామానికి బయల్దేరారు. ఆదివారం రాత్రి 2గంటలకు టంగుటూరు టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్నారు. కారు నడుపుతున్న శ్రీనివాసరావు టోల్‌ చెల్లించేందుకు 5వ లైన్‌లో వాహనాన్ని ఆపారు. ముందు ట్రావెల్స్‌ బస్సు ఉంది. సరిగ్గా అదే సమయంలో వెనుక వైపు నెల్లూరు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కంటైనర్‌ వాహనం అతివేగంగా వచ్చి కారును బలం గా ఢీకొట్టింది. దీంతో బస్సు, కంటైనర్‌ మధ్య కారు నలిగిపోయింది.


ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు, ఆయన అత్త కామేశ్వరమ్మ, సాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. శివపార్వ తి, కుమారుడు సాయికృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో బయటికి తీయడం కష్టమైంది. టోల్‌ప్లాజా సిబ్బంది, హైవే మొబైల్‌ పోలీసులు అతికష్టమ్మీద క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలిస్తుండ గా మార్గమధ్యంలో శివపార్వతి మృతి చెందా రు. సాయికృష్ణకు ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కంటైనర్‌ డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

సీఎం చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. తీవ్రంగా గాయపడి న బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలకు ఆదేశించారు. ఘటనపై మంత్రి లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబాల కు సంతాపం తెలిపారు. మంత్రులు రామ్‌ప్రసాద్‌ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 30 , 2026 | 03:27 AM