కాస్త ఊరట!
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:07 AM
ఎల్‌నినోతో ఎండలు ఠారెత్తుతున్న సమయంలో రాష్ట్రంలో ఓవైపు వరుస తుఫాన్లు కాస్త ఊరటనివ్వగా.. మరోవైపు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రధానంగా భారీ వర్షాలు కురిసి, వానలోటు గణనీయంగా తగ్గింది.
వరుస తుఫాన్లతో పంటలకు నీటి ముంపు
ఎడతెరపి లేని వానలు.. పెరిగిన చలిగాలులు
అమరావతి, నవంబరు3(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోతో ఎండలు ఠారెత్తుతున్న సమయంలో రాష్ట్రంలో ఓవైపు వరుస తుఫాన్లు కాస్త ఊరటనివ్వగా.. మరోవైపు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రధానంగా భారీ వర్షాలు కురిసి, వానలోటు గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాభావం ఏర్పడి, వర్షపాతం 53శాతం లోటు ఏర్పడింది. అయితే సెప్టెంబరులో వాయుగుండంతో వర్షాలు కురవడంతో వానలోటు 31శాతానికి తగ్గింది. తర్వాత మళ్లీ వర్షాలు లేక 38శాతానికి చేరింది. గత నెలాఖరులో అర్నబ్ తుఫాన్‌తో కురిసిన వర్షాలతో 31.2 శాతానికి తగ్గిన వానలోటు.. తాజాగా మురసు తుఫాన్‌తో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో వర్షపాత లోటు 28శాతానికి తగ్గింది. ఆగస్టు నుంచి చూస్తే.. వాయుగుండం, తుఫాన్ల వల్ల వర్షపాత లోటు 25శాతం మేర తగ్గింది. కోస్తా జిల్లాల్లో వానలోటు గణనీయంగా తగ్గింది. కానీ రాయలసీమ జిల్లాల్లో ఇంకా వానలోటు కొనసాగుతోంది.
కాగా, వరుస తుఫాన్లతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మురసు తుఫాన్‌తో దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మురసు తుఫాన్‌తో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు కోస్తా,రాయలసీమ ప్రాంతంలో ముసురు పట్టి,ఎడ తెరపి లేని వర్షం కురుస్తోంది. తుఫాన్ తీరం దాటాక.. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేకచోట్ల వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయయ్యాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. వరి, పత్తికి అపార నష్టం వాటిల్లిందని రైతులు చెప్తున్నారు. కాగా, ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ఏపీలోనూ చలి తీవ్రత తగ్గుతుందని ఐఎండీ అంచనా వేయగా, ఇటీవల అర్నబ్ తుఫాన్, ఇప్పుడు మురసు తుఫాన్‌తో గత వారం రోజులుగా చలితీవ్రత పెరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం