సివిల్ సప్లయిస్‌లో కమీషన్ల దందా
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:58 AM
సివిల్ సప్లయిస్‌లో కమీషన్ల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవినీతికి పాల్పడే అధికారులు, అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లు కుమ్మక్కై రూ.కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు.
మిల్లర్ల బకాయిల చెల్లింపునకు 150 కోట్ల డిమాండ్.. రూ.1500 కోట్ల బిల్లులకు 10 శాతం పర్సంటేజీ ఫిక్స్
బిల్లులు త్వరగా అప్‌లోడ్ చేయాలని జేసీలపై ఒత్తిళ్లు
వసూళ్ల పర్వంలో మిల్లర్ల సంఘం నేత కీలకపాత్ర
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సివిల్ సప్లయిస్‌లో కమీషన్ల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవినీతికి పాల్పడే అధికారులు, అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లు కుమ్మక్కై రూ.కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. తాజాగా ధాన్యం రవాణా చార్జీలు, రైసు మిల్లర్లకు చెల్లించాల్సిన డ్రైయేజ్, కస్టడీ అండ్ మెయింటెనెన్స్ చార్జీలకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం బకాయిపెట్టిన బిల్లులు చెల్లించేందుకు అధికారులు కమీషన్ల పర్వానికి తెరలేపారు. దాదాపు రూ.1500 కోట్ల బిల్లుల చెల్లింపునకు 10 శాతం పర్సంటేజీ ఫిక్స్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో సేకరించే ధాన్యానికి కస్టమ్ మిల్లింగ్, రవాణా, డ్రైయేజ్, కస్టడీ అండ్ మెయింటెనెన్స్ తదితర చార్జీలను ప్రభుత్వం రైసు మిల్లులకు చెల్లించాలి. రైసు మిల్లర్లు సీఎంఆర్ కింద తీసుకున్న ధాన్యం పరిమాణంపై ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరలో ఒక శాతం డ్రైయేజ్ చార్జీలుగా చెల్లిస్తారు. కస్టడీ, మెయింటెనెన్స్ చార్జీల కింద ప్రతి క్వింటాల్ ధాన్యానికి రూ.2.40 చొప్పున చెల్లిస్తారు. ధాన్యం రవాణా చార్జీలను ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం చెల్లిస్తారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సీఎంఆర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రైసు మిల్లర్లకు చెల్లించాల్సిన చార్జీలను భారీస్థాయిలో బకాయిలు పెట్టేసింది. ఆ పాత బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం 2021-22 ఖరీఫ్-రబీ సీజన్లలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా సేకరించిన ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.1,000కోట్ల మేర రవాణా చార్జీల బకాయిలు, అలాగే గత ఐదేళ్లకు సంబంధించిన డ్రైయేజ్, కస్టడీ అండ్ మెయింటెనెన్స్ చార్జీల బకాయిలు సుమారు రూ.500 కోట్లు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆమోదంతో 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం ఐదేళ్ల డ్రైయేజ్ చార్జీల బకాయిల బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశిస్తూ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సి.ఎస్.శ్రీనివాస్ ఈ నెల 10న జిల్లాల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.
నిబంధనలను అడ్డంపెట్టుకుని..
మిల్లర్లకు పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు పౌరసరఫరాల సంస్థ కొన్ని నిబంధనలు విధించింది. డ్రైయేజ్, కస్టడీ అండ్ మెయింటెనెన్స్ చార్జీల కోసం బిల్లులు సమర్పించే మిల్లర్లు రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్ టేకింగ్ సమర్పించడం తప్పనిసరి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డ్రైయేజ్, కస్టడీ, మెయింటెనెన్స్ చార్జీల కోసం విడివిడిగా.. ప్రతి కాంపోనెంట్ వారీగా రైసు మిల్లర్లు వేర్వేరుగా బిల్లులు సమర్పించాలని, ప్రతి డ్రైయేజ్ బిల్లుతో పాటు అఫిడవిట్‌ను తప్పనిసరిగా జతచేయాలని నిబంధనలు పెట్టారు. వీటిని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పక్కాగా స్కెచ్ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూస్తే రైసు మిల్లుల్లో రికార్డులను పక్కాగా నిర్వహించరు. కాబట్టి నిబంధనలను పట్టించుకోకుండా చార్జీల బిల్లులను చెల్లించాలంటే.. మిల్లర్లకు వచ్చే సొమ్ములో 10 శాతం కమీషన్‌ను ముందుగానే చెల్లించాలని రాష్ట్రస్థాయిలో సివిల్ సప్లయిస్ పెద్దలే నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని మిలర్ల సంఘంలో అంతా తానై పెత్తనం చెలాయిస్తున్న రాష్ట్రస్థాయి నాయకుడితో లోపాయికారిగా చర్చించడం, ఆ పెద్దలతో నిత్యం టచ్‌లో ఉండే ఆ మిల్లర్ల నాయకుడు పర్సంటేజీల వసూలుకు అంగీకారం తెలపడం చకచకా జరిగిపోయాయి.
పర్సంటేజీలను వసూలు చేసి తమకు ముట్టజెప్పే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. మిల్లర్లు సమర్పించే బిల్లులను త్వరగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయించే బాధ్యతను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌లోని ఓ మహిళా మేనేజరుకు అప్పగించినట్లు తెలిసింది. కార్పొరేషన్‌లో కీలక వ్యవహారాలను చక్కబెట్టగలరన్న పేరున్న ఆ మహిళా మేనేజరు జిల్లాల్లోని సివిల్ సప్లయిస్ డీఎంలు, జాయింట్ కలెక్టర్లపై కూడా ఒత్తిడి తెస్తున్నారు.
చక్రం తిప్పుతున్న మిల్లర్ల నాయకుడు
జిల్లాలో బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియలో అడ్డంకులు ఎదురవుతుండటంతో మిల్లర్ల సంఘ నాయకుడు రంగంలోకి దిగి చక్రం తిప్పుతున్నారు. పర్సంటేజీలు పెద్దలకు ముట్టజెప్పేస్తే అంతా వాళ్లే చూసుకుంటారని, వెంటనే చెల్లించాలని మిల్లర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు అనుకున్న విధంగా పర్సంటేజీల సొమ్ము చేతికి అందితే మిల్లర్లకు పెండింగ్ బకాయిలను విడుదల చేసేందుకు సివిల్ సప్లయిస్ అధికారులు కూడా ఉత్సాహం చూపుతున్నట్లు చర్చించుకుంటున్నారు. ప్రజా పంపిణీ కోసం ప్రతి ఖరీఫ్, రబీ సీజన్లలో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు (సీఎంఆర్) మొదలుకొని.. వాటికి సంబంధించిన రకరకాల చార్జీల కింద బిల్లుల చెల్లింపుల వరకూ ప్రతి దానికీ పర్సంటేజీలు నిర్ణయించి రూ.కోట్లలో అక్రమ వసూళ్లు చేయడం పౌరసరఫరాల శాఖలో ఎప్పుడూ జరుగుతున్న తంతే. గతంలో పలు జిల్లాల్లో వెలుగు చూసిన భారీ కుంభకోణాలు, వాటిపై జరిగిన విజిలెన్స్ విచారణలే దీనికి నిదర్శనం.
నిరాకరిస్తున్న జేసీలు
ధాన్యం రవాణా, డ్రైయేజ్, కస్టమ్ అండ్ మెయింటెనెన్స్ చార్జీల చెల్లింపులకు సంబంధించి మిల్లర్లు తప్పుడు బిల్లులను సమర్పిస్తుండటంతో వాటిని అప్‌లోడ్ చేయడానికి కొన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. రైతులకు దక్కాల్సిన రవాణా చార్జీల చెల్లింపు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశిస్తూ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ముగ్గురు జేసీలకు సివిల్ సప్లయిస్ కమిషనర్ కన్నబాబు గత నెల 9న ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో ధాన్యం రవాణా చార్జీల చెల్లింపు ప్రక్రియను నిలిపివేయాలంటూ విజయవాడకు చెందిన రాజు అనే వ్యక్తి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్‌కు లీగల్ నోటీసు ఇచ్చారు. ఆ వివరాలతో ‘30 కోట్ల రైతుల సొమ్ముకు ఎసరు?’ శీర్షికతో ఈ నెల 16న ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దాంతో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టరు ధాన్యం రవాణా చార్జీల విడుదలకు సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి నిరాకరించి పక్కన పెట్టేసినట్లు తెలిసింది.
ఈ వార్తలనూ చదవండి: