కోస్తాకు ఊరట
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:04 AM
కోస్తాకు కాస్త ఉపశమనం కలిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జనానికి ఊరట లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
3 రోజులుగా విస్తారంగా వర్షాలు
51.6 నుంచి 55 శాతానికి పెరిగిన వర్షపాతం
స్వల్పంగా తగ్గిన లోటు.. పంటలకు ఊపిరి
కోనసీమ జిల్లా మలికిపురంలో 11 సెం.మీ.
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పల్నాడులో పిడుగుపాటుకు నలుగురు బలి
నిద్రలోనే ప్రాణాలు ఆవిరి.. సీఎం విచారం
అమరావతి, విశాఖపట్నం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కోస్తాకు కాస్త ఉపశమనం కలిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జనానికి ఊరట లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణకోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ ఏడాది బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఎక్కువగా ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్ తీర ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి. వాటి ప్రభావం రాష్ట్రంపై పెద్దగా చూపలేక.. వర్షాభావం కొనసాగుతోంది. కానీ ప్రస్తుత అల్పపీడనం దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల్లో ఏర్పడింది. దాని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై, తేమతో కూడిన వాతావరణం ఏర్పడటంతో ఎండ వేడి నుంచి పంటలకు, పశువులకు, మనుషులకు కొద్దిగా ఉపశమనం కలిగింది. 54శాతం వాన లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత వర్షాలు పెద్దగా లోటును తీర్చకపోయినా.. పంటలకు జీవం, ప్రజలకు ఊరటనిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షాలు కురవడంతో వాగులు పొంగాయి. మరో 17 రోజుల్లో రుతుపవనాల సీజన్ ముగియనున్నది. సీజన్ ప్రారంభం నుంచి ఇంత వరకు కోస్తాలో మూడు రోజులపాటు వర్షాలు కురవడం ఇదే ప్రథమం. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు కోనసీమ జిల్లా మలికిపురంలో 11.02, కృష్ణాజిల్లా పెనమలూరులో 10.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంగూరులో 9.82, పెనమలూరులో 9.6, పల్నాడు జిల్లా గోవిందపురంలో 9.2, చిలకలూరిపేటలో 8.9, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 8.8, బాపట్ల జిల్లా కొంకణిలో 8.6, ప్రకాశం జిల్లా అద్దంకిలో 8.2 సెంమీ వర్షం కురిసింది. జూన్ 1 నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో 48.63 సెంటీమీటర్లకు గాను 23.52 సెంటీమీటర్లు(51.6 శాతం తక్కువ)గా వర్షపాతం నమోదైంది.
మరో రెండు రోజులు వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40-50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’