Share News

పుష్కరాలకు 10 కోట్ల మంది

ABN , Publish Date - Nov 22 , 2026 | 02:27 AM

‘గోదావరి పుష్కరాల నిర్వహణకు చేపడుతున్న పనులు ఆయా జిల్లాలకు శాశ్వత ఆస్తిగా మిగలాలి. పనుల నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడొద్దు’ అని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పుష్కరాలకు 10 కోట్ల మంది

  • 217 రోజులే ఉంది... పనుల్లో వేగం పెంచండి

  • గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం సమీక్ష

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘గోదావరి పుష్కరాల నిర్వహణకు చేపడుతున్న పనులు ఆయా జిల్లాలకు శాశ్వత ఆస్తిగా మిగలాలి. పనుల నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడొద్దు’ అని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్షించారు. ‘2027 గోదావరి పుష్కరాలకు దాదాపు 10 నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారు. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు, రవాణా, భద్రత, వైద్య సేవ లు, పారిశుద్ధ్యంపై పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలి’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘22 ప్రభుత్వ శాఖల పరిధిలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులను ప్రతిపాదించాం.

వీటిలో ఇప్పటికే రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి’ అని అధికారులు వివరించారు. 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరా లు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. కేవలం ప్రభుత్వం కార్యక్రమంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో పుష్కరాలను నిర్వహించాలని సూచించారు. పుష్కరాలు నిర్వహించే జిల్లాల్లో చేపడుతున్న పనులు ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశంగా చూడాలని స్పష్టం చేశారు.


రాజమహేంద్రవరంలో రూ.1.80 కోట్లతో సూర్య భగవానుడు, బృహస్పతి ఆలయాల నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. పుష్కరాల నిర్వహణకు ప్రజల నుంచి మంచి పేరు, సూచనలు స్వీకరించడంతో పాటు ప్రత్యేక ప్రచార గీతాలను రూపొందించాలని చెప్పారు.

గోదావరి నదీ హారతి, సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన, సామూహిక యో గా వంటి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకా పుష్కరాలకు 217 రోజుల సమయమే ఉన్నందున పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 440 ఘాట్ల వద్ద భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. రూ.300 కోట్లతో 78 రహదారుల పనులు చేపట్టగా, 2027 ఏప్రిల్‌ నాటికి పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. పట్టిసీమ నుంచి పోలవరం వరకు, కొవ్వూరు నుంచి ధవళేశ్వరం వరకు, పోలవరం లెఫ్ట్‌ బండ్‌పై రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు.

4 వేల ప్రత్యేక బస్సులు...

భక్తుల రవాణా అవసరాల కోసం 4 వేల ప్రత్యేక బస్సులు, 649 గ్రీన్‌ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. పుష్కరాల సమయంలో 1560 ప్రత్యేక రైల్వే సర్వీసులు నిర్వహించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు 135 భాషల్లో సమాచారం అందించేలా ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ వ్యవస్థతోపాటు వర్చువల్‌ రియాల్టీ, డిజిటల్‌ స్ర్కీన్‌లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించా రు. పుష్కరాల సమయంలో వైద్య సేవల కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 02:29 AM