Share News

ఈ ముప్పునూ ఎదుర్కోవాలి!

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:42 AM

అర్నబ్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, మరో తుఫాన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఈ ముప్పునూ ఎదుర్కోవాలి!

  • ఉపగ్రహ చిత్రాలతో ప్రతి 6 గంటలకూ తుఫాన్‌ గమనాన్ని అంచనా వేయాలి

  • అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • ప్రస్తుత పరిస్థితిపై ఆర్టీజీఎస్‌లో సమీక్ష

అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, మరో తుఫాన్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ నుంచి శనివారం రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, అర్నబ్‌ తుఫాను అనంతరం చేపడుతున్న పునరుద్ధరణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఆగ్నేయ బంగాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారానికి తుఫాన్‌గా బలపడే అవకాశాలున్నాయని, వచ్చే నాలుగు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో వాయుగుండం గమనాన్ని ఉపగ్రహ చిత్రాలు, డాప్లర్‌ రాడార్ల ద్వారా ప్రతి ఆరు గంటలకు ఒకసారి అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు.

అరటికి రూ.35 వేలు, కొబ్బరికి రూ.54 వేలు

ప్రకృతి విపత్తుల నుంచి రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు పంటల బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే సీజన్‌ నుంచి ప్రతి రైతు.. బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 47 లక్షల మంది రైతులకు చేరువయ్యేలా యాప్‌ను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం కల్పించాలన్నారు. సాంకేతికతను వినియోగిస్తున్న చాంపియన్‌ రైతులను గుర్తించాలని సూచించారు. అర్నబ్‌ తుఫాన్‌ వల్ల కొబ్బరి, అరటి పంటలకు జరిగిన నష్టంపై సీఎం సమీక్షించారు. కొబ్బరి పంట దెబ్బతిన్న 1,293 హెక్టార్లుకు హెక్టారుకు రూ.54 వేలు చొప్పున, నేలకొరిగిన, తలలు దెబ్బతిన్న చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 1.95 లక్షల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. అలాగే 15వేల హెక్టార్లలో దెబ్బతిన్న అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేలు చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 03:45 AM