Share News

ఇది కష్టకాలం.. బాధితులందరినీ ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:14 AM

పర్యావరణాన్ని సరిగా పరిరక్షించుకోకపోతే తుఫాన్లు వంటి విపత్తులే సంభవిస్తాయి. నిన్నటి వరకు లేని నీరు.. ఇప్పుడంతా సముద్రం పాలవుతోంది.రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది.

ఇది కష్టకాలం.. బాధితులందరినీ ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

  • ఓవైపు ఎల్‌నినోతో లోటు వర్షపాతం

  • మరోవైపు.. స్వల్ప వ్యవధిలో రెండు తుఫాన్లు

  • ఏ ఒక్కరికీ సాయం అందలేదన్న మాటే రానివ్వను

  • 1893 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

  • కౌలు రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ

  • ఉపాధి పథకంలో వ్యవసాయ, ఉద్యాన పంటలనూ చేర్చాలని కేంద్రానికి నివేదిస్తాం: చంద్రబాబు

  • గుంటూరు జిల్లా రేటూరు ముంపు పొలాల సందర్శన

  • బాధిత రైతులతో ముఖ్యమంత్రి మాటామంతీ

ఇందుకోసం రూ.35 వేల కోట్లు అవసరం. ఇవి పూర్తయితే కరువు శాశ్వతంగా దూరమవుతుంది. డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరుచుకోవచ్చు.

- సీఎం చంద్రబాబు

గుంటూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నికలు ముఖ్యం కాదు. వారి కష్టాలు తీర్చడమే నా ప్రాధాన్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం రాష్ట్రానికి గడ్డుకాలమన్నారు. ఒకపక్క ఎల్‌నినోతో 57 శాతం లోటు వర్షపాతం.. మరోవైపు గత నెల 27న అర్నబ్‌ తుఫాను కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దెబ్బతీసిందని చెప్పారు. దాని నుంచి తేరుకోకముందే ఈ నెల 3వ తేదీన మురసు తుఫాను అర్ధరాత్రి అతలాకుతలం చేసిందన్నారు. చరిత్రలో ఇలా స్వల్ప వ్యవధిలో రెండు తుఫాన్లు రావడం ఇదే ప్రథమమన్నారు. మురసు దిశ మార్చుకుని తీర ప్రాంతానికి దూసుకొచ్చి బాపట్ల, ప్రకాశం, గుంటూరు, ఎన్‌టీఆర్‌ జిల్లాలకు తీవ్ర విషాదం మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా

ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం రేటూరు గ్రామంలో మురసు తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలను సీఎం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. రైతులు కూడా చైతన్యవంతులై పంటల బీమా చేసుకుంటే ఇలాంటి విపత్తులు వచ్చినా ఆర్థికంగా నష్టం జరగదని చెప్పారు. ‘విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తోంది. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. రైతులు బీమా కడితే నష్టపరిహారం వస్తుంది’ అని సూచించారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..


పంట చేతికొచ్చే సమయంలో...

ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా నీళ్లు అందించాం. నీటిని పొదుపుగా వినియోగించుకుని రైతులు వరి పండించారు. కొద్దిరోజుల్లో కోతలు అనగా మురసు దెబ్బకు పంట మట్టిపాలైపోయింది. తుఫానును ఎదుర్కొనేందుకు పకడ్బందీగా సన్నద్ధమయ్యాం. పునరావాసం కల్పించి ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించాం. రాయలసీమలో వర్షమే లేదు. కోస్తాలో తుఫాన్ల విపత్తులు. ఆర్‌టీజీఎస్‌ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపి అధికారులను అప్రమత్తం చేయడం వల్లే నష్టాన్ని తగ్గించగలిగాం.

తుఫాను ధాటికి వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమిళనాడు, కర్ణాటక సీఎంలు విజయ్‌, డీకే శివకుమార్‌తో మాట్లాడి సిబ్బందిని పంపాలని కోరాను. వారు అంగీకరించి సిబ్బందిని పంపించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఇప్పటికే చాలావరకు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాం. మరో 1893 గ్రామాలకు శనివారం ఉదయం కల్లా ఇస్తాం.

తుఫాన్లలో నష్టపోయిన చివరి వ్యక్తికి కూడా న్యాయం తప్పక చేస్తా. ఏ ఒక్కరూ సాయం అందలేదన్న మాట రాకుండా చూసుకుంటాం. వీబీ-జీరాంజీ ఉపాధి పథకం కింద వ్యవసాయ, ఉద్యాన పంటలను చేర్చాలని కేంద్రానికి నివేదిస్తాం. ఎల్‌నినో ప్రభావం, రెండు తుఫాన్లతో జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు నివేదించాను. తుది నివేదిక అందజేయగానే సాయం విడుదల చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:51 AM