తిరుమల పవిత్రతను కాపాడి తీరుతాం.. ఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:39 PM
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. మంత్రివర్గ సమావేశానికి ముందు NDA నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
అమరావతి, ఫిబ్రవరి 3: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన కార్యాచరణను ముమ్మరం చేసింది. కేబినెట్ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలతో కీలక భేటీ నిర్వహించారు. శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
రాజకీయ కోణం లేదు.. భక్తుల మనోభావాలే ముఖ్యం
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, 'తిరుమల కల్తీ లడ్డూ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ కోణం చూడటం లేదు. ఇది కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం కావాల్సిన అంశం కాదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు, శ్రీవారి పవిత్రతకు సంబంధించిన అంశం. ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది' అని సహచర నేతలకు వివరించారు. ఈ కుట్ర వెనుక ఉన్న నిందితులను నిగ్గుతేల్చేందుకే విచారణ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ప్రభుత్వానికి జనసేన పూర్తి మద్దతు
శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఆయన చంద్రబాబుకు స్పష్టం చేశారు. పవిత్రమైన ఆలయ ప్రాభవాన్ని దెబ్బతీసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
ఐక్యంగా వైసీపీ కుట్రలను తిప్పికొడదాం: సత్యకుమార్ యాదవ్
బీజేపీ తరపున మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ విషయంలో కూటమిలో పూర్తి ఏకాభిప్రాయం ఉందని తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ కుట్రలను ప్రజల ముందు పెట్టి, క్షేత్రస్థాయిలో వారిని ఎండగట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సమావేశంలో పాల్గొన్న కీలక నేతలు:
ఈ కీలక భేటీలో కూటమిలోని ముఖ్య నేతలు పాల్గొన్నారు.. వీరిలో..
నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి)
పవన్ కల్యాణ్ (ఉప ముఖ్యమంత్రి)
నాదెండ్ల మనోహర్(పౌరసరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి)
నారా లోకేష్(మానవ వనరుల అభివృద్ధి, పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఐటీ (IT), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి)
పయ్యావుల కేశవ్(ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి)
సత్యకుమార్ యాదవ్(ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి)
తిరుమల ఆలయ పవిత్రత, ప్రసాదాల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని, దోషులను విచారణ ద్వారా బహిర్గతం చేస్తామని కూటమి నేతలు ముక్తకంఠంతో తీర్మానించారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలోని 1వ బ్లాక్ లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను క్యాబినెట్ తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ
ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్