Share News

దెబ్బతిన్న 48 గంటల్లో విద్యుత్‌ పునరుద్ధరణ

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:16 AM

మురసు తుఫాను ప్రభావం విద్యుత్తు శాఖపై ఏ స్థాయిలో ఉండనుంది..

దెబ్బతిన్న 48 గంటల్లో విద్యుత్‌ పునరుద్ధరణ
CM Chandrababu Naidu

  • అర్నబ్‌ తుఫాన్‌ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని..

  • మరింత సమర్థంగా సహాయక చర్యలు చేపట్టాలి

  • విద్యుత్‌ శాఖ సన్నద్దతపై సీఎం చంద్రబాబు సమీక్ష

  • సాయం చేయాలని తమిళనాడు, కర్ణాటక సీఎంలకు ఫోన్‌

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మురసు తుఫాను ప్రభావం విద్యుత్తు శాఖపై ఏ స్థాయిలో ఉండనుంది.. దాన్ని ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీనిపై విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ విజయానంద్‌, ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభావిత జిల్లాలకు సిబ్బంది, సామగ్రిని ముందే తరలించాలని సూచించారు. అవసరమైతే తెలంగాణ, తమిళనాడు నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలు, పరికరాలు తెప్పించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి 500 మంది సిబ్బంది వచ్చారని, అవసరమైన సిబ్బందిని, యంత్రాలు పంపేందుకు తమిళనాడు కూడా అంగీకరించిందని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సీఎంకి తెలిపారు. కాగా, విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిన్న 48 గంటల్లోనే సరఫరాను పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. సోమవారం నుంచి ప్రతి 4-6 గంటలకు తుఫాను ప్రభావంపై బులిటెన్‌ విడుదల చేయాలన్నారు. కాగా, విద్యుత్‌ మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులను ఆదేశించారు.


తమిళనాడు, కర్ణాటక సీఎంలకు చంద్రబాబు ఫోన్‌

తుఫాన్‌ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్‌కు చంద్రబాబు ఫోన్‌ చేశారు. విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని, వాటి పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. దీనిపై విజయ్‌ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా సిబ్బందిని, యంత్రాలను పంపుతామని హామీ ఇచ్చారు. అలాగే కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..

నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం

Updated Date - Nov 02 , 2026 | 01:50 AM