Share News

జనంలోకి వెళ్లాల్సిందే

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:56 AM

జిల్లా కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెలలో 8 రోజులు కచ్చితంగా ప్రజల వద్దకు వెళ్లాలని, గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు.

జనంలోకి వెళ్లాల్సిందే

  • కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయికి తరలాలి: సీఎం

  • విభాగాధిపతులు, కార్యదర్శులు కూడా...

  • పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు

  • నీరు, పాలు కలుషితమవుతుంటే ఏం చేస్తున్నారు?

  • ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనంగా ఉందా?

  • ఉదాసీనంగా ఉండేవారిపైకఠిన చర్యలు తప్పవు

  • వచ్చే మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

  • కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

  • ‘‘రాష్ట్రంలో వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం ఇస్తాం. ఈ దిశగా ప్రతిష్ఠాత్మక జాతీయ పరిశోధన, విద్యాసంస్థ ఏర్పాటుపై ఆలోచిస్తున్నాం. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ తరహాలో వ్యవసాయం కోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.’’

  • ‘‘రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏడాదిలోగా రెవెన్యూ శాఖను పూర్తిగా సంస్కరిస్తాం. 2027 మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని నిలపాలన్నదే లక్ష్యం. దీనికోసం రెవెన్యూ శాఖ, కలెక్టర్లు కృషి చేయాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నెలలో 8 రోజులు కచ్చితంగా ప్రజల వద్దకు వెళ్లాలని, గ్రామాలను సందర్శించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తాగే నీరు, పాలు కల్తీ అవుతుంటే ఏం చేస్తున్నారు? ఆయా శాఖలు ఏం పనిచేస్తున్నాయో చూసుకోనవసరం లేదా?’ అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనంగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కలెక్టర్లు ప్రజల వద్దకు వెళ్లడం లేదని, గ్రామాల సందర్శన జరగడం లేదని ‘కార్యాలయంలోనే కలెక్టర్లు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం కథనం ప్రచురించింది. కలెక్టర్ల సమావేశంలో ఇవే అంశాలను సీఎం ప్రధానంగా ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆన్‌లైన్‌ యుగంలో ఇంటర్నెట్‌, కంప్యూటర్ల ద్వారా ఇప్పుడు ఎక్కడున్నా పనిచేసే అవకాశం వచ్చిందని, కేవలం ఆఫీసులకే పరిమితం కావద్దని సీఎం హితబోధ చేశారు. గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడూ కంప్యూటర్‌, ల్యాప్‌టా్‌పలతో పనిచేయవచ్చని తెలిపారు. ‘‘విభాగాధిపతులు నెలలో ఆరుసార్లు జిల్లాల పర్యటనలకు వెళ్లి, ప్రజలను కలవాలి.


అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను కలిస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు ఏ మేరకు సాధిస్తున్నామో, సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందో తెలుస్తుంది. కార్యదర్శులు, సీనియర్‌ కార్యదర్శులు నెలలో నాలుగు రోజులు కచ్చితంగా ప్రజల వద్దకు వెళ్లాలి. క్షేత్రస్థాయి పర్యటనలపై ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటుచేసి, అందులో వివరాలు అందుబాటులో ఉంచుతాం’’ అని పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ఇకపై ప్రతి కలెక్టర్ల సమావేశంలోనూ ప్రత్యేకంగా సమీక్ష చేద్దామన్నారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీ పాలు, కాకినాడలో బాణసంచా పేలుడుతో సంభవించిన మరణాలపై సీఎం విచారం వ్యక్తం చేశారు. సరైన పర్యవేక్షణ ఉంటే ఈ పరిస్థితులు ఎందుకొస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా బాణసంచా తయారు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘ఈ విషాద సంఘటనలు ఓ కేస్‌ స్టడీస్‌. ఏదో మిస్‌ అవుతున్నామని సంకేతాలు ఇచ్చాయి. మీరు క్షేత్రస్థాయికి వెళ్లకుండా పనిచేస్తే వాస్తవ పరిస్థితులు ఎలా తెలుస్తాయి? ఇకపై కలెక్టర్లు విధిగా గ్రామాలను సందర్శించాలి’’ అని సీఎం ఆదేశించారు.

ఉగాదిన 2.50 లక్షల గృహప్రవేశాలు

‘‘ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల గృహప్రవేశాలు చేపట్టబోతున్నాం. ఇంధ్రధనస్సు పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. గృహావసరాలకు ఉపయోగించే విద్యుత్‌పై ట్రూఅప్‌ భారం 4,600 కోట్ల మేర తగ్గించాం. ఈ ఏడాది యూనిట్‌కు మరో 39 పైసల భారం తగ్గిస్తాం. జల్‌ జీవన్‌ మిషన్‌ను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించడం శుభసూచకం. ఈ స్కీమ్‌ కింద రూ.28 వేల కోట్లు ఖర్చు చేసేలా పొడిగింపు ఇచ్చారు. రెండేళ్లలో ఈ పథకం ద్వారా ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు అందించేలా కార్యక్రమాలు అమలు చేద్దాం. 23న ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తాం. రాయలసీమ స్టీల్‌ప్లాంట్‌ పనులూ త్వరలోనే ప్రారంభిస్తాం. ఇరాన్‌ యుద్ధ ప్రభావం రాష్ట్రంపైనా పడింది. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయి. మన ఉత్పత్తులు ప్రత్యామ్నాయ మార్కెట్లను చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి’’ అని ఆదేశించారు.

రేపు ‘అన్నదాతా సుఖీభవ’ నిధులు

రైతులకు ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద ఈ నెల 13న నిధులు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఖరీప్‌ సాగు కోసం మే 15 నుంచే నీటిని విడుదల చేస్తామని చెప్పారు.


సర్వేయర్లను ఇతర పనులకు వాడొద్దు: అనగాని

రాష్ట్రంలో భూముల రీసర్వేకు గ్రామ సర్వేయర్ల సేవలు అవసరమని, ఇతర శాఖల పనులకు వారిని వాడొద్దని కలెక్టర్లను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కోరారు. ఈ దిశగా ఆదేశాలు ఇవ్వాలని గ్రామ, వార్డు సచివాలయాల విభాగాన్ని కోరారు. ఈ విషయమై గతంలో సీఎం ఆదేశించినా, కొన్నిచోట్ల అమలు కావడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిషేధ జాబితా 22(ఏ)లో 1.95 కోట్ల ఎకరాల భూమి ఉందని మంత్రి తెలిపారు.

ప్రజల వద్దకే బడ్జెట్‌: పయ్యావుల

రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమం రూపొదిస్తుందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు. బడ్జెట్‌ మీటింగ్‌ లను క్షేత్రస్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. దీంట్లో భాగంగా జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరం అసాధారణ వృద్ధి సంవత్సరంగా నిలవబోతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు పనిచేయాలని కోరారు.

కలిసి పనిచేద్దాం.. కలిసి సాధిద్దాం: సీఎస్‌

ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా అధికారులు అంతా కలిసి పనిచేసి, కలిసి సాధిద్దామని సీఎస్‌ సాయిప్రసాద్‌ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధనలో భాగంగా రూ.55లక్షల తలసరి ఆదాయం సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందుకు అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.

మంత్రులతో కలిసి పనిచేయాలి: సీఎం

నైపుణ్యాభివృద్ధిపై అధికారులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. నైపుణ్య శిక్షణలో విజయవంతమైన అభ్యర్థుల వివరాలు నమోదు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి నైపుణ్యాభివృద్ధిని పర్యవేక్షించాలన్నారు. అన్ని వివరాలను నోడల్‌ అధికారికి పంపి, జిల్లా మంత్రితో కలిసి యువతకు నైపుణ్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు.


జనాభా నిర్వహణకు ఐదు పిల్లర్లు

జనాభా నియంత్రణ నుంచి జనాభా పెంపు దిశగా చర్యలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. 1993లో జననాల రేటు కుటుంబంలో 3.0గా ఉంటే ప్రస్తుతం అది 1.5కు పడిపోయిందన్నారు. ఇది ప్రమాదకర స్థాయిని సూచిస్తోందని చెప్పారు. రేటు పెంపునకు 5 పిల్లర్ల విధానం అమలు చేస్తున్నామన్నారు.

అందరికీ నీటి భద్రత

ప్రతి ఎకరాకు, ప్రతి ఇంటికీ నీటి భద్రత కల్పించాలని చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఏటా రాష్ట్రంలో వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఆ నీటిని నిల్వ చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో 38,628 చెరువులున్నాయని, వాటిని నింపే కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. నీరు ఎక్కువగా ఉంటే విద్యుత్‌ వినియోగం తగ్గుతుందన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 03:56 AM