అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడా?
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:56 AM
హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకల దాడి యత్నాన్ని సీఎం చంద్రబాబుతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.
ఇది వైసీపీ విష సంస్కృతికి నిదర్శనం: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకల దాడి యత్నాన్ని సీఎం చంద్రబాబుతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఈ దుశ్చర్యకు తెగబడిందని వారు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ చర్యలను ఖండిస్తూ ఎక్స్‌లో స్పందించారు. ‘‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమే. వైసీపీ ఐదేళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడినా నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదు. రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మీడియా కార్యాలయంపైకి వెళ్లడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనం. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్దాలుగా కేసులకు, దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజా గళంగా నిలిచే పత్రికను, చానెల్‌ను నడుపుతున్నారు. జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. అలాంటి సంస్థపై వైసీపీ బెదిరింపులు పనిచేయవు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ‘ఆర్‌కే వీకెండ్ కామెంట్’కు సమాధానం చెప్పలేక దాడులు, నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. ఆంధ్రజ్యోతి సంస్థపై వైసీపీ దాడిని అన్ని వర్గాలూ ఖండించాలి’’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏబీఎన్ భయపడే రకం కాదు: లోకేశ్
జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం వైసీపీ రౌడీ మూకలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతిని మరోసారి బయటపెట్టిందని మంత్రి లోకేశ్ అ న్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే, దమ్మున్న చానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ‘జగన్... మీ మీడియా హైదరాబాద్ ఆఫీ్‌సకు ఆంధ్రజ్యోతి ఎంత దూ రమో... ఆంధ్రజ్యోతికి, మీ మీడియా కార్యాలయం కూడా అంతే దూరంలో ఉందన్న సంగతి మర్చిపోవద్దు. మీడియా కథనాల పట్ల నిరసనలు తెలియజేసే పద్ధతి ఇది కాదు. మీలాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కు భయపడే రకం కాదు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ. మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపైకి బుల్డోజర్లు పంపించినా ఏబీఎన్ ఆర్కే వెనక్కి తగ్గలేదు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి. కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి. కథనం ప్రసారం చేస్తే తప్పయితే తప్పని చెప్పగలగాలి. ఇవేవీ మీ దగ్గర లేనప్పుడు ఇలాంటి దుర్మార్గపు దాడులకు తెగబడటం అలవాటుగా మార్చుకున్నారు. ఇది తప్పు జగన్.. జనం ఛీకొట్టినా మారకపోతే ఎలా? మీ వెనక గూండాలు ఉండొచ్చు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ వెనుక, ముందు ప్రజలు ఉన్నారు’’ అని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.

దాడులు అప్రజాస్వామికం
- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ ఆధ్వర్యంలో దాడికి ప్రయత్నించడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఖండించారు. వైసీపీ చర్యలపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసి న విశ్లేషణను జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు దాడులకు దిగడం అప్రజాస్వామికమన్నా రు. ఆయన చేసిన వ్యాఖ్యలు నచ్చకపోతే ప్రజాస్వామ్య రీతి లో సమాధానం ఇవ్వాలి తప్ప దాడులకు దిగడం సరికాదని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ కార్యాలయంపై దాడిచేసి విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు, పత్రికా స్వేచ్ఛను ఆకాంక్షించేవారు ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిప్పుకణిక: ఎంపీ లావు
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిజాలను నిర్భయంగా రాసే నిప్పుకణిక. వాటిని గుప్పెటో ్లపెట్టుకొని అణచివేయాలని చూడడం అవివేకం’ అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, సొంత పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకత నుం చి బయటపడడానికి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సం స్థలపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. మంగళవారం పాలువాయిగేట్‌లో ఎంపీ మాట్లాడుతూ, పత్రికా స్వేచ్ఛను హరించాలని చూసే ఏ శక్తి చరిత్రలో నిలబడలేదని హెచ్చరించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూ డా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారని దాని పర్యవసానమే 11 సీట్లకు పరిమితం కా వాల్సి వచ్చిందన్నారు.ఆంధ్రజ్యోతి రాతలు ఎప్పటికీ ప్రజాపక్షమేనని ఎంపీ స్పష్టం చేశారు.
గూండాగిరికి తావులేదు: సానా
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు చేసిన దాడి దుర్మార్గం. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా రౌడీ మూకలను వెంటేసుకుని మీడియా కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటు. అమరావతి అంశంపై ఆధారాలతో ప్రశ్నిస్తున్న మీడియాపై దాడులకు దిగడం వైసీపీ పిరికిపంద చర్యకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గూండాగిరికి తావులేదు. రెండు తెలుగు రాష్ర్టాలు సంతోషంగా ఉండటం జగన్‌కి ఇష్టం లేదు. అందుకే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు’ అని రాజ్యసభ టీడీపీ ఎంపీ సానా సతీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతిపై విషం చిమ్మే జగన్ పత్రిక వద్ద నిరసన తెలపాలి: మాధవ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడటాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఖండించారు. అమరావతిపై నిరంతరం విషం చిమ్మే జగన్ పత్రిక ముందు వైసీపీ నేతలు తమ నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. ఆంధ్రజ్యోతిలో అభ్యంతర కథనాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండన ఇవ్వాలి తప్ప భౌతిక దాడులకు దిగుతామంటే హర్షించే పరిస్థితి ఉండదన్నారు. జగన్ మీడి యా సాక్షిలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కూటమి నేతలపై నిరంతరం విషం చిమ్ముతారని, తప్పుడు వార్తలపై ఖండన ఇచ్చినా ప్రచురించరని మాధవ్ మండిపడ్డారు.