Share News

అర్హులందరికీ రుణాలివ్వాలి!

ABN , Publish Date - Sep 17 , 2026 | 03:53 AM

రాష్ట్రంలోని అన్ని రంగాలను, అన్ని వర్గాలనూ బలోపేతం చేసేలా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్‌ సేవలు చేరాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) 236వ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.

అర్హులందరికీ రుణాలివ్వాలి!

  • కౌలు రైతులకు సమృద్ధిగా సమకూర్చాలి

  • టిడ్కో రుణాలపై కార్యాచరణ అమలు కావాలి

  • ‘స్త్రీనిధి’ డివిడెండ్‌ తిరిగి ఆ సంస్థకే: సీఎం

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని రంగాలను, అన్ని వర్గాలనూ బలోపేతం చేసేలా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్‌ సేవలు చేరాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) 236వ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు సీఎం కీలక సూచనలు చేశారు. కొన్ని బ్యాంకులు రుణపంపిణీలో చాలా వెనుకబడి ఉన్నాయని, లక్ష్యాలను చేరుకుంటేనే బ్యాంకర్ల కమిటీ సమావేశాలకు అర్థం ఉంటుందని చెప్పారు. గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారని బ్యాంకర్లను అడిగారు.

మొత్తం 13 అంశాలకు గాను ఇప్పటివరకు తొమ్మిదింటిపై చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. సీఎం స్పందిస్తూ.. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవడం సరికాదన్నారు. పీఎం సూర్యఘర్‌ అమలులో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలని భావిస్తున్నామని చెప్పారు. బ్యాంకులు పెద్దఎత్తున రుణాలిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. 15 శాతం రాష్ట్ర ఆర్థిక వృద్ధి సాధించాలని లక్ష్యం పెట్టుకున్నా.. ఎల్‌నినో కారణంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని తెలిపారు. కౌలు రైతులకు రుణాలు సమృద్ధిగా అందించేందుకు బ్యాంకులు ముందుకు రావాలని పిలుపిచ్చారు. ‘రుణాల చెల్లింపుల్లో మన డ్వాక్రా సంఘాల మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. 99 శాతానికి పైగా సకాలంలో చెల్లిస్తున్నారు. 0.67 శాతం మంది వెనుకబడ్డారు. వారినుంచి 100 శాతం రికవరీకి ’వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌’ విధానం గురించి బ్యాంకులు ఆలోచించాలి’ అని సీఎం సూచించారు. ‘స్త్రీ నిధి’ కింద బ్యాంకులు ఇచ్చిన డివిడెండ్‌ను తిరిగి స్త్రీ నిధి సంస్థకే ఇస్తున్నట్లు ప్రకటించారు. టిడ్కో గృహాలకు రుణాలిచ్చేందుకు కార్యాచరణను త్వరగా అమల్లోకి తేవాలన్నారు. అమరావతి ఫైనాన్షియల్‌ హబ్‌లో పలు బ్యాంకు కార్యాలయాల నిర్మాణాల పురోగతిని అధికారులు వివరించారు. మరింత వేగంగా పూర్తి చేయడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇకపై బ్యాంకులు, జిల్లాలు, విభాగాల వారీగా ఫలితాలను విశ్లేషించిన తర్వాతే ఎస్‌ఎల్‌బీసీపై సమీక్షించాలని ఆయన నిర్ణయించారు.


అడ్వాన్సులు రూ.10.28 లక్షల కోట్లు..

రాష్ట్ర బ్యాంకింగ్‌ రంగంలో రుణాల వేగం పెరిగింది. మొత్తం అడ్వాన్సులు ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.10.28 లక్షల కోట్లకు చేరాయి. వ్యవసాయ రంగానికి భారీగా రుణ మద్దతు లభిస్తోంది. జూన్‌ నాటికి రూ.3.98 లక్షల కోట్ల మేర సాగు రుణాలిచ్చారు. తొలి త్రైమాసికంలో 2.33 లక్షల ఎంఎ్‌సఎంఈలకు రూ.63,686 కోట్ల రుణ పంపిణీ జరిగింది. పీఎం సూర్యఘర్‌ కింద ఈ నెల 10 వరకు 1,57,703 దరఖాస్తులు రాగా, రూ.3,081 కోట్ల రుణాలు మంజూరుచేశారు. డ్వాక్రా రుణాలపై అన్ని బ్యాంకులూ సర్వీసు చార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చాయి. ఈనెల 10 నాటికి రూ.18,621 కోట్ల రుణ పంపిణీ జరిగిందని బ్యాంకర్లు వివరించారు.


ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 03:53 AM