ఉద్యోగాల స్కాం నిందితుడు అరెస్టు
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:30 AM
జనసేన రాష్ట్ర కార్యాలయం పేరుతో జరిగిన ప్రభుత్వ ఉద్యోగాల మోసం కేసులో ఏ2గా ఉన్న నిమ్మకాయల పెద్దిరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో ఏ2 పెద్దిరాజును అదుపులోకి తీసుకున్న సీఐడీ
14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
పరారీలో ఏ1 ధరణి కృష్ణ, మరికొందరు
నిరుద్యోగుల నుంచి రూ. 7 కోట్లు వసూళ్లు
మంగళగిరి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జనసేన రాష్ట్ర కార్యాలయం పేరుతో జరిగిన ప్రభుత్వ ఉద్యోగాల మోసం కేసులో ఏ2గా ఉన్న నిమ్మకాయల పెద్దిరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పెద్దిరాజును గురువారం సాయంత్రం గుంటూరులోని సీఐడీ కోర్టులో హజరుపరిచారు. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. పెద్దిరాజును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ అదనపు డీఎస్పీ బి.సీతారామయ్య గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్లు వసూలు చేసిన కేసులో అతడిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న బోడపాటి ధరణి కృష్ణతో పాటు మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన 36 మంది నిరుద్యోగుల నుంచి నిందితులు డబ్బు వసూలు చేశారు.
ఒక్కొక్కరి దగ్గర రూ. 15 నుంచి రూ. 25 లక్షల చొప్పున తీసుకుని దేవదాయ, పోలీసు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు ఇచ్చారని సీఐడీ తెలిపింది. పరారీలో ఉన్న ధరణి కృష్ణ తరచుగా సెల్ఫీ వీడియోలను విడుదల చేస్తోందని, ఆమె ఆచూకీ తెలిస్తే 88978 44666, 99598 21456, 77029 13576 నంబర్లకు ఫోను చేసి సమాచారం ఇవ్వాలని సీఐడీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పెద్దిరాజు అరెస్టుతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ