Share News

Tiruchanur: తిరుచానూరులో కత్తితో యువకుడి స్వైర విహారం

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:45 AM

తిరుచానూరులో ఓ యువకుడు కత్తితో స్వైర విహారం చేశాడు. ఇద్దరిని పొడవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Tiruchanur: తిరుచానూరులో కత్తితో యువకుడి స్వైర విహారం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజేశ్వర్‌

తిరుచానూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుచానూరులో ఓ యువకుడు కత్తితో స్వైర విహారం చేశాడు. ఇద్దరిని పొడవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తిరుచానూరు ముత్తునగర్‌కు చెందిన యశ్వంత్‌ తన బావ తేజేశ్వర్‌, స్నేహితులతో కలిసి నవజీవన్‌ ఆస్పత్రి ఎదురుగా రోడ్డుపై శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో బర్త్‌డే పార్టీ చేసుకున్నాడు. కేక్‌ కట్‌ చేశాక టపాసులు పేల్చాడు. ఆ సమయంలో నేతాజీ వీధికి చెందిన దినే్‌షరెడ్డి, అతడి స్నేహితుడు శ్రీను అలియాస్‌ హేమంత్‌కుమార్‌తో కలిసి బైక్‌పై వచ్చాడు. గతంలో యశ్వంత్‌తో తనకున్న విబేధాలను దృష్టిలో పెట్టుకుని టపాసులు ఎందుకు కాల్చారని దినే్‌షరెడ్డి గొడవపడ్డారు. అది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అప్పటికే తన వద్ద ఉన్న కత్తిని దినే్‌షరెడ్డి బయటకు తీసి దాడి చేయడం మొదలుపెట్టాడు. అడ్డుకోబోయిన తేజేశ్వర్‌ను విచక్షణా రహితంగా పొడిచాడు. అతను తీవ్రగాయాలతో కిందపడి పోవడంతో మిగిలినవారు భయపడి పరుగులు తీశారు. అయినా దినే్‌షరెడ్డి మాత్రం రోడ్డుపై కత్తిని తిప్పుతూనే ఉన్నాడు. వాహనదారులు భయపడుతుండగా దినే్‌షరెడ్డిని అతడి స్నేహితుడు శ్రీను వారించబోయాడు. ఈ క్రమంలో అతడికీ కత్తిపోట్లు తప్పలేదు. పేగులు బయటకు వచ్చాయి. కొంతసేపటి తర్వాత కత్తిపోట్లకు గురైన ఇద్దరినీ ఆస్పత్రులకు కుటుంబీకులు తరలించారు. తేజేశ్వర్‌ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో దినే్‌షరెడ్డి,శ్రీనులపై హత్యాయత్నం కేసు నమోదుచేశామని ఎస్‌ఐ సిద్దారెడ్డి చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా, గతంలోనూ దినే్‌షరెడ్డి తిరుపతికి చెందిన యువకులతో గొడవపడడంతో వారు అతడి ఇంటికొచ్చి మరీ కత్తితో పొడిచిన సంఘటనలున్నాయని గుర్తించామన్నారు.


గస్తీ లేకపోవడం వల్లేనా..?

తిరుచానూరులోని దిగువవీధి, మెయిన్‌ రోడ్లపైనా.. అమ్మవారి ఆలయ సమీప ప్రాంతాల్లో రాత్రిపూట కేక్‌ కటింగ్‌లు పెరిగిపోయాయి. ఈ సందర్భంగా మద్యం మత్తులో యువత గొడవలు పడుతూ సమీపంలోని వారిని భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీనికంతటికీ రాత్రివేళ పోలీసుల గస్తీ కొరవడడమే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 21 , 2026 | 12:45 AM