Share News

YCP: ర్యాలీలకు వైసీపీ శ్రేణుల సమాయత్తం

ABN , Publish Date - Aug 11 , 2026 | 01:02 AM

జిల్లాలో 30 యాక్టు అమల్లో ఉన్నందున బహిరంగ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు.

YCP: ర్యాలీలకు వైసీపీ శ్రేణుల సమాయత్తం
చిత్తూరులో పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాదులాట

చిత్తూరు అర్బన్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 30 యాక్టు అమల్లో ఉన్నందున బహిరంగ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ శ్రేణులు వినిపించుకోలేదు. జనసమ్మర్థం అధికంగా ఉన్న రోడ్లు, బస్టాండ్లు, సర్కిళ్ల వద్ద పెద్ద సంఖ్యలో జనాన్ని పోగేసి ర్యాలీలు చేయడానికి ప్రయత్నించారు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.

పూతలపట్టులో గాయపడ్డ ఏఎ్‌సఐ

పూతలపట్టులోని ఓ కల్యాణ మండపం నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ఉన్నత పాఠశాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి మాలవేసేందుకు కొంతమందికే అనుమతిచ్చారు. దీంతో ఉన్నట్లుండి కొందరు బారికేడ్లు తోసుకుంటూ జాతీయ రహదారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇలా గుంపుగా రావడంతో పోలీసులను సైతం నెట్టేశారు. ఈ క్రమంలో మహిళా ఏఎ్‌సఐ జ్యోతి అదుపుతప్పి కింద పడ్డారు. ఈ తొక్కిసలాటలో ఆమె గాయపడ్డారు. వెంటనే కొందరు ఆమెను పైకి లేవదీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అడ్డుకుని.. కొత్తపల్లెమిట్ట వద్ద వదిలిపెట్టి

గంగాధరనెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ వైసీపీ కన్వీనర్‌ కృపాలక్ష్మి, పరిశీలకుడు పృథ్వీరెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకుని బస్సులోకి ఎక్కించి.. శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లెమిట్ట సమీపంలో వదిలిపెట్టారు. పోలీసులు, వైసీపీనేతల మధ్య తోపులాటలో బారికేడ్‌ పడటంతో కృపాలక్ష్మి కాలికి స్వల్పగాయమైంది. ర్యాలీకి అనుమతి లేదని తాము ముందే నేతలకు చెప్పినా, శ్రేణులు తరలిరావడంతో అడ్డుకున్నామని సీఐ ప్రసాద్‌ తెలిపారు.


కుప్పంలో ఇంటి ముందే..

కుప్పంలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో తన ఇంటి ముందు ఎమ్మెల్సీ భరత్‌, శ్రేణులు కాసేపు కూర్చుని నిరసన తెలిపి వెళ్లిపోయారు. ఇక, పలమనేరులో అనుమతి లేదని పోలీసులు చెప్పినా వెంకటేగౌడ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

చిత్తూరు ర్యాలీలో ఉద్రిక్తత

చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడానికి నేతలు, శ్రేణులు గంగినేని చెరువు వద్దకు ఉదయం 9.45 గంటలకు చేరుకున్నారు. ఆ సమయంలో ర్యాలీ నిర్వహిస్తే ట్రాఫిక్‌ సమస్య తలెత్తి విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు ఇబ్బందులు పడతారని సీఐ చిన్నపెద్దయ్య, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ ర్యాలీ తపోవనం వద్దకు రాగానే పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. విజయానందరెడ్డితో పాటు ప్రసన్న, హరిణిరెడ్డి, గాయత్రిదేవి, మధురెడ్డి, సద్దాం, చాంద్‌బాషా, హరీష, రూపే్‌షరెడ్డి, ప్రతిమ, స్టాండ్లీతో పాటు పలువురిని వాహనాల్లో ఎక్కించుకుని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. డీఎస్సీలో అక్రమాలకు మంత్రి లోకేశ్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండు చేశారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, నేతలు చంద్రశేఖర్‌, జ్ఞానజగదీశ్‌, అన్బు, అంజలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేవుడి దయవల్ల బయటపడ్డా

పూతలపట్టు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘నన్ను తొక్కుకుంటూ వెళ్లినప్పుడు చచ్చిపోయి ఉంటాను. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డా’నని ఏఎ్‌సఐ జ్యోతి విలపించారు. వైసీపీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో కిందపడి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఎమ్మెల్యే మురళీమోహన్‌ పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - Aug 11 , 2026 | 01:02 AM