Share News

Swarna Chandragiri: స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టుపై మొదలైన కసరత్తు

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:56 AM

స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.

Swarna Chandragiri: స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టుపై మొదలైన కసరత్తు
ఎమ్మెల్యే నానీ

నేడు సీఎం పేషీ అధికారులతో సమావేశం

తిరుపతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. సీఎం చంద్రబాబు స్వ గ్రామమైన నారావారిపల్లె సమగ్ర అభివృద్ధి కోసం కందులవారిపల్లె, ఎ.రంగంపేట, చిన్న రామాపురం పంచాయతీల పరిధిలో స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూడు పంచాయతీల పరిధిలో రోడ్లు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, సౌర విద్యుత్‌, తాగునీటి ఆర్వో ప్లాంట్లు, ఇంటింటికీ కొళాయిలు, వంట గ్యాస్‌ కనెక్షన్లు తదితర మౌలిక సదుపాయాలన్నీ వంద శాతం కల్పించారు. ఇంటింటి సర్వే చేపట్టి ఎవరి అవసరాలేమిటన్నది గుర్తించారు. దానికనుగుణంగా విద్యార్థులకు బోధనాపరంగా, నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణతో ఉద్యోగ ఉపాధి కల్పనా పరంగా చర్యలు తీసుకున్నారు. స్వయం ఉపాధిని ఎంచుకునేవారికి శిక్షణతో పాటు రుణ సదుపాయం కూడా కల్పించారు. రైతులకు, ఉద్యాన రైతులకు, పాడి రైతులకు కూడా అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందించారు. వీటితో పాటు ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, సాగునీటి పరంగా మూలపల్లె చెరువుకు హంద్రీ-నీవా జలాలు అందించే భారీ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఏడాదిలో స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు విజయవంతమైన నేపధ్యంలో సీఎం చంద్రబాబు ఇటీవల ఆ ప్రాజెక్టును చంద్రగిరి మండలానికి వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం నుంచీ చంద్రగిరి ఎమ్మెల్యేకి పిలుపు వచ్చింది. శనివారం మధ్యాహ్నం సీఎం పేషీ అధికారులతో నానీ సమావేశం కానున్నారు. స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టుకు తుది రూపు ఇవ్వడంపై అక్కడి సీనియర్‌ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. దీనికోసం ఆయన పలు ప్రతిపాదనలతో బయల్దేరి వెళుతున్నారు.


సాధారణ మౌలిక సదుపాయాలకు అదనంగా వీటిని సీఎం పేషీ అధికారుల ముందుంచనున్నారు. వాటిలో 2021 తుఫాను సందర్భంగా తిరుచానూరు, తనపల్లె, వేదాంతపురం, ఐతేపల్లె తదితర చోట్ల స్వర్ణముఖి నదిపై కూలిపోయిన నాలుగు వంతెనలను రూ. 90 కోట్లతో పునర్నిర్మించే ప్రతిపాదన కూడా వుంది. అలాగే రూ. 13 కోట్లతో పదిపుట్లబైలు నుంచీ ఎ.రంగంపేట వరకూ డబుల్‌ రోడ్డు, రూ. 9 కోట్లతో దామలచెరువు నుంచీ మంగళంపేట వరకూ డబుల్‌ రోడ్డు, రూ. 22 కోట్లతో నేండ్రగుంట నుంచీ పెనుమూరుకు డబుల్‌ రోడ్డు, రూ. 13 కోట్లతో ఎర్రావారిపల్లె నుంచీ ఎల్లమంద మీదుగా పీలేరు వైపు డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల ప్రతిపాదనలున్నాయి. అలాగే పింఛా ప్రాజెక్టులో కలిసే తలకోన బ్యాక్‌ వాటర్స్‌ను చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాల్లోని చెరువులకు మళ్లించేందుకు రూ. 31 కోట్లతో కాలువల నిర్మాణం, చెరువుల పటిష్టీకరణ పనుల ప్రతిపాదనలు సైతం వున్నాయి. వీటితో పాటు చంద్రగిరి మండలంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఎమ్మెల్యే సమావేశంలో ప్రస్తావించనున్నారు.

Updated Date - Jan 31 , 2026 | 01:56 AM