Share News

Water: జలధార లబ్ధి అవార్డు తెచ్చేనా?

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:07 AM

అన్నమయ్య జిల్లాలో జలధార పథకంతో సాధించిన ప్రగతిని కేంద్రం దృష్టికి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తీసుకెళ్లారు. జలవనరుల శాఖ, ఉపాధిహామీ పథకాలతో చేపట్టిన పనుల వివరాలతో నివేదికను పంపించారు.

Water: జలధార లబ్ధి అవార్డు తెచ్చేనా?
జలధార పథకంలో భాగంగా బి.కొత్తకోట మండలంలో బొమ్మిరెడ్డిచెరువుకు చేపట్టిన మరమ్మతులు

మదనపల్లె, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లాలో జలధార పథకంతో సాధించిన ప్రగతిని కేంద్రం దృష్టికి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తీసుకెళ్లారు. జలవనరుల శాఖ, ఉపాధిహామీ పథకాలతో చేపట్టిన పనుల వివరాలతో నివేదికను పంపించారు. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలతో పాటు భూగర్భజలాల వృద్ధి, తాగునీరు, పశుగ్రాసం సమస్యల పరిష్కారం, భూసారం పెంపు, భూమికోత నివారణ, వృక్షసంపద పెరుగుదల తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఇచ్చే ప్రధానమంత్రి అవార్డు కోసం ఈ నివేదికను ఆయన పంపించారు. ఇందుకోసం ఆయన పెద్ద కసరత్తే చేశారు. జలవనరులశాఖ, ఉపాధిహామీ, వ్యవసాయం, ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ, సచివాలయ విభాగాలను ఇందులో భాగస్వామ్యం చేశారు. వీరంతా క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులను టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వివరించారు. జలధార పథకం ప్రగతిని, అవార్డు ఎంపికకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. జలధారతో లబ్ధి పొందిన రైతుల వివరాలు సేకరించాలని లక్ష్యాలు విధించారు. ఒక్కోశాఖకు 500 నుంచి 700 మందితో మొత్తం 15వేల నుంచి 20వేల మంది ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. దీంతో మదనపల్లె, రాయచోటి, పీలేరు, రాజంపేట డివిజన్ల పరిధిలోని ఆయా శాఖల అధికారులు రైతుల వివరాలను సేకరించారు. సాగునీటి సంఘాల కమిటీలతో మాట్లాడి చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతుల వివరాలు, వారి ఫోన్‌నంబర్లు సేకరించారు.మరోవైపు జిల్లా యంత్రాంగం కేంద్రానికి పంపిన నివేదికపై అక్కడినుంచి సంబంధిత అధికారులు కూడా రైతుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారు. రైతులు వేసే మార్కులు, వారు వ్యక్తం చేసే సంతృప్తిని బట్టి, జిల్లాకు గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి అవార్డుకు జిల్లా ఎంపికైతే జలధార పథకాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా నిర్వహించడానికి కావాల్సిన నిధులు కేంద్రం సమకూర్చనుండడంతో అక్కడినుంచి వచ్చే ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌కాల్స్‌లో చెప్పాల్సిన అంశాలను కూడా రైతులకు అధికారులు వివరించారు.చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలను వారికి వివరించడంతోపాటు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, వాటికి ఎలా సమాధానం చెప్పాలనే అంశంపై కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఐవీఆర్‌ఎ్‌సలో ఇచ్చే సమాధానంతో వచ్చే లాభాలను కూడా ముందే చెబుతూ రైతుల్లో అవగాహన కలిగిస్తున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 03:07 AM