Share News

ZP: జడ్పీ చైర్మన్‌ పీఠం ఎవరికో?

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:36 AM

జడ్పీటీసీల ఎన్నిక పూర్తవడంతో జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి కోసం పోటీ పడుతున్న నలుగురు ఎవరి స్థాయిలో వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ZP: జడ్పీ చైర్మన్‌ పీఠం ఎవరికో?

జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక 12 నుంచి 20వ తేదీకి వాయిదా

చిత్తూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీల ఎన్నిక పూర్తవడంతో జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి కోసం పోటీ పడుతున్న నలుగురు ఎవరి స్థాయిలో వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నలుగురిలో ముగ్గురు అమరావతిలోనే ఉండి అధిష్ఠాన పెద్దల్ని కలిసి విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పదవి ఎవరికి వరిస్తుందా అని పార్టీ వర్గాల్లో, జిల్లాల్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఈనెల 11వ తేదీన ఎంపీపీ.. 12న జడ్పీ చైర్మన్‌ ఎన్నిక ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పేరును త్వరగా ప్రకటిస్తారని అంతా భావించారు. ఈ క్రమంలో మంగళవారం ఎన్నికల సంఘం తేదీల్ని మారుస్తూ ఉత్తర్వులిచ్చింది. నవంబరు 19న ఎంపీపీ ఎన్నిక, 20న జడ్పీ చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది. ఈ కారణంగా జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

చిత్తూరు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని అన్‌రిజర్వుడ్‌ మహిళకు కేటాయిస్తూ అక్టోబరు 13న ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. దీంతో ముగ్గురు ఈ పదవిని ఆశిస్తూ తెరపైకి వచ్చారు. బంగారుపాళ్యానికి చెందిన జయప్రకాష్‌, ఈశ్వర్‌నాయుడు,పాలసముద్రం చిట్టిబాబునాయుడు..వారి కుటుం బసభ్యుల మహిళల్ని బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేశారు. అనుకోకుండా మధ్యలో పూతలపట్టుకు చెందిన విజయం విద్యాసంస్థల చైర్మన్‌ తేజోమూర్తి కూడా రంగంలోకి దిగారు. ఆయన తన సతీమణి శైలజతో పూతలపట్టు మండలానికి జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారు. బంగారుపాళ్యం నుంచి ఎన్‌పీ జయప్రకాష్‌ తన సతీమణి సుచిత్రతో నామినేషన్‌ వేయించడంతో ఈశ్వర్‌నాయుడుకు ఆమండలంనుంచి పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాలతో మాట్లాడి గుడిపాల మం డలంనుంచి తన సతీమణి మమతశ్రీని పోటీ చేయించారు. పాలసముద్రం నుంచి చిట్టిబాబు తన కుమార్తె డాక్టర్‌ జాహ్నవిని బరిలోకి దింపారు. వీరిలో బంగారుపాళ్యం, పూతలపట్టు మండలాల్లో సుచిత్ర, శైలజ ఏకగ్రీవం చేసుకోగలిగారు. పాలసముద్రం, గుడిపాల నుంచి జాహ్నవి, మమతశ్రీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. మమతశ్రీ 4821,జాహ్నవి 2737ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో నలుగురు ఆశావహులకూ చైర్‌పర్సన్‌ పదవి కోసం ప్రయత్నాలు చేసుకునే అవకాశం లభించింది.

నలుగురు ఆశావహుల్లో మమతశ్రీ భర్త ఈశ్వర్‌నాయుడు, సుచిత్ర భర్త ఎన్‌పీ జయప్రకాష్‌, జాహ్నవి తండ్రి చిట్టిబాబు నాయుడు అమరావతిలో మకాం వేశారు. జడ్పీటీసీ ఫలితాలు విడుదలయ్యాక దీపావళి పండుగ వచ్చింది. పండుగ అయిన వెంటనే అధిష్ఠాన పెద్దల్ని కలిసేందుకు ఈ ముగ్గురు వెళ్లిపోయారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమకు చైర్‌పర్సన్‌ అవకాశం దక్కాల్సిందేనని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. శైలజ భర్త తేజోమూర్తి మాత్రం తనకు బలమైన హామీ ఉందని.. చిత్తూరులోనే తన పనులు చేసుకుంటున్నారు.

ధీమాగా ఆ నలుగురు..!

చిత్తూరు రూరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలకుగాను.. ఏకగ్రీవంతో కలుపుకొని టీడీపీకి 22, జనసేనకు ఒకటి చొప్పున కూటమికి 23 స్థానాలు వచ్చాయి. వైసీపీకి నాలుగు వచ్చాయి. దీంతో జడ్పీ చైర్‌పర్సన్‌కు కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు ఎన్నికల సంఘం తేదీలనూ ప్రకటించేసింది. జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వం కోసం పూతలపట్టు, బంగారుపాళ్యంలలో ఏకగ్రీవంగా ఎన్నికైన శైలజ, సుచిత్ర.. పాలసముద్రం, గుడిపాల నుంచి పోటీలో ఎన్నికైన జాహ్నవి బాబు, మమతశ్రీ ఉన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వం తమకేనంటూ ఈ నలుగురూ ధీమాగా ఉన్నారు. వీరి అనుచరులు కూడా తమ నాయకురాలికే అధిష్ఠానం హామీ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నలుగురు కూడా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం. ఆర్థికంగానూ బలమైన నేపథ్యం కలిగినవారే. దీంతో ఎంపిక మరింత క్లిష్టతరం గా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో అధిష్ఠానం ఎలాంటి సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


‘పరిషత్‌’ చైర్మన్ల ఎన్నికకు షెడ్యూల్‌ వచ్చేసింది

19న ఎంపీపీలు, ఉపాధ్యక్షుల ఎన్నిక

20న జడ్పీ చైర్‌పర్సన్‌.. వైస్‌ చైర్మన్‌కు..

చిత్తూరు రూరల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 19న జిల్లాలోని 27 మండల పరిషత్‌లలో ఎంపీపీలు, ఉపాధ్యక్షులకు.. 20న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరగనుంది. దీంతో జిల్లాలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీలోగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులు అందజేయనున్నారు. ఎన్నికల రోజున తొలుత కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వమిస్తారు. ప్రతి మండల పరిషత్‌కు ఒకరు.. జిల్లా పరిషత్‌కు ఇద్దరు చొప్పున కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు ఎంపీపీలు, జడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహిస్తారు. అధ్యక్షుల ఎన్నిక పూర్తయిన తర్వాత ఉపాధ్యక్షులు, వైస్‌ చైర్‌పర్సన్ల ఎంపిక ప్రక్రియ చేపడతారు.

పరోక్ష పద్ధతిలో ఎన్నికలు

ఈ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో జరగనున్నాయి. ఆయా మండలాల్లో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోనుండగా, జిల్లా పరిషత్‌లో ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు. చేతులెత్తే విధానంలో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులు తమ పార్టీ జారీ చేసిన విప్‌నకు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది.

ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరుకావచ్చు కానీ..

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక సమావేశాలకు హాజరుకావచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే, వారికి అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఉండదని స్పష్టంచేసింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. సమావేశాల ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయడంతోపాటు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తారు. జిల్లాలోని 27 మండలాలకు ఎంపీపీలు ఎన్నిక కానుండగా, జిల్లా పరిషత్‌కు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎంపికతో స్థానిక సంస్థల పాలనకు పూర్తిస్థాయి నాయకత్వం ఏర్పడనుంది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందిన సభ్యులతో ఆయా రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహిస్తూ తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఎంపీపీ పదవులతో పాటు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకునేందుకు రాజకీయ సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.

Updated Date - Nov 11 , 2026 | 12:36 AM