Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ..
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:40 AM
భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది.
మదనపల్లె, ఆంధ్రజ్యోతి: భౌగోళికంగా ఎత్తయిన ప్రదేశం... చల్లని ప్రాంతం.. ప్రశాంతతకు పేరు.. తాత్విక క్షేత్రం.. విద్యాలయాల నిలయం.. బ్రిటీష్ పాలనలో ప్రాముఖ్యంగల డివిజన్ కేంద్రం.. జనగణమన జాతీయ గీతం పురుడు పోసుకున్న నేల.. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగసిన తావు.. క్షయ పీడితులకు ప్రాణం పోసిన ఆరోగ్యవరం ఉన్న చోటు.. భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. వాగ్గేయకారుడు అన్నమయ్య పేరుతో ఏర్పడిన జిల్లాకు కొత్త కేంద్రంగా గురువారం నుంచి పాలన మొదలైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు 62 ప్రభుత్వ విభాగాల పని ప్రారంభమైంది. 1799లో నిజాం పాలనకు, బ్రిటీష్ పాలకులకు జరిగిన ఒప్పందం మేరకు మదనపల్లెను 1800 అక్టోబరు 12వ తేదీన కడప జిల్లాలో చేర్చారు. తర్వాత 1911 ఏప్రిల్ ఒకటో తేదీన చిత్తూరు జిల్లా ఆవిర్భవించింది. నిజానికి అన్ని అర్హతలున్న మదనపల్లె జిల్లాగా అప్పుడే ఆవిర్భవించి ఉండాల్సింది. పట్టించునే నేతలు లేకపోవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. 114 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జిల్లా కేంద్రంగా మదనపల్లె ఇప్పుడు రూపుదిద్దుకుంది. 2022లో జిల్లాల పునర్విభజన సమయంలో వైసీపీ ప్రభుత్వం మదనపల్లెకు మొండిచేయి చూపింది.
డివిజన్ కేంద్రంగా 175 ఏళ్ల చరిత్ర
కడప జిల్లా మొదటి కలెక్టర్‌గా నియమితులైన థామస్ మన్రో జిల్లా పర్యటనలో భాగంగా 1804లో మదనపల్లెకు వచ్చారు. తర్వాత 1850లో బ్రిటీష్ ప్రభుత్వం మదనపల్లెను డివిజన్ కేంద్రంగా ప్రకటించింది. మొదటి సబ్‌కలెక్టర్‌గా ఎఫ్.బి.మనోలిని నియమించారు. అప్పటి చిత్తూరు జిల్లాలో 66 మండలాలుండగా, మదనపల్లె 31 మండలాల్లో విస్తరించి దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా పేరుగాంచింది.
బ్రిటీష్ దొరల దర్పం ఈ భవనం
బ్రిటీష్ దొరల రాజదర్పానికి చిహ్నంగా మదనపల్లె లో చెక్కుచెదరని నిర్మాణంగా నాటి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఉంది. ఇప్పుడదే కలెక్టర్ కార్యాలయంగా రూపుదిద్దుకుంది. 1850లో నిర్మించిన ఈ భవనం పటిష్టంగా ఉండడమే ఇందుకు కారణం. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఈ భవనం సాక్ష్యం. క్విట్‌ఇండియా ఉద్యమంలో మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు ఽఆందోళన చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఎంతోమంది గాయపడగా, మరికొందరు జైలుకెళ్లారు.
అనిబిసెంట్‌కు అనుబంధం
స్వాతంత్య్ర సంగ్రామం ఊపందుకున్న రోజుల్లో అనిబిసెంట్ మదనపల్లెకు వచ్చారు. అప్పటికే డివిజన్‌లో ఎక్కడ చూసినా బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న కుట్రను గమనించిన ఆమె..జాతీయ సమైక్యతకోసం హోమ్‌రూల్ ఉద్యమాన్ని చేపట్టారు. అనిబిసెంట్ 1913లో దివ్యజ్ఞాన ఎడ్యుకేషనల్ ట్రస్టును, 1915లో ధియోసాఫికల్ (బి.టి)కళాశాలను ఇక్కడ స్థాపించారు. రాయలసీమలో వేలాదిమంది విద్యార్థుల జీవితాల్లో విద్యాజ్యోతిని వెలిగించిన బి.టి.కాలేజీ దక్షిణ భారతదేశంలోని శాంతినికేతన్‌గా నిలిచిపోయింది.
కాంగ్రె్‌సకు హస్తం గుర్తు ఇక్కడే
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాంగ్రె్‌సపార్టీ ఎన్నికల చిహ్నం హస్తం గుర్తును ప్రకటించింది మదనపల్లెలోనే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మదనపల్లె పర్యటనలో 1978 ఫిబ్రవరి 2న హస్తం గుర్తును ప్రకటించారు.
జాతీయ గీతానికి జన్మనిచ్చింది ఇక్కడే
బి.టి.కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కజిన్స్ ఆహ్వానం మేరకు 1919 ఫిబ్రవరి 25న విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ మదనపల్లెకు వచ్చారు.ఆ సమయంలో బెంగాలీ భాషలో రాసిన జనగణమన గీతాన్ని ఆంగ్లంలోకి ఇక్కడే అనువదించారు. బి.టి.కళాశాలలో ఒక సమావేశంలో ఈ గీతాన్ని మొదట తానే స్వయంగా ఆలపించారు. నాటి బి.టి.కళాశాల విద్యార్థుల గీతాలాపనతో ప్రారంభమైన జనగణమన గీతం నేడు దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులను ఉత్తేజపరుస్తోంది.
జిడ్డు కృష్ణమూర్తి పుట్టిల్లు
ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 11న మదనపల్లెలో జన్మించారు. జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు ఎనిమిదో సంతానం ఈయన. అనిబిసెంట్ ఆయనను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచ తత్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ఈయన స్థాపించిన రిషీవ్యాలీ స్కూల్ దేశంలోనే ప్రముఖ విద్యాకేంద్రంగా భాసిల్లుతోంది.
భవనాల కోసం వెతుకులాట
- కలెక్టరేట్ మాత్రమే సిద్ధం
అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారిన మదనపల్లెలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కోసం వెతుకులాట కొనసాగుతూనే వుంది. ఇప్పటికి కలెక్టరేట్ మాత్రమే సిద్దమై..పాలన మొదలైంది. మిగిలిన అన్ని శాఖల జిల్లా కార్యాలయాలకు అవసరమైన భవనాల కోసం అధికారులు వెతుకుతున్నారు. రెండు రోజుల క్రితం మదనపల్లె కేంద్రంగా రాష్ట్రప్రభుత్వం అన్నమయ్య జిల్లాను పునర్‌వ్యవస్థీకరించింది.గతనెల 31 నుంచి పాలన కూడా ప్రారంభించాలనడంతో ఉరుకుపరుగుల మీద జిల్లా యంత్రాంగం మదనపల్లెకు వచ్చింది. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేశారు.ఇందులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోలకు కార్యాలయాలను కేటాయించారు.సీఎల్‌ఆర్‌సీ భవనాన్ని సబ్‌కలెక్టర్ కార్యాలయానికి కేటాయించారు. రేస్ బీఈడీ కళాశాల భవనాలను ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు.బీటీ ఉమెన్స్ కళాశాల భవనాలను ఆడిట్ , మెప్మా, సివిల్‌సప్లై, భూగర్భ జల, పౌరసంబంధాల శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు,ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ర్టీ,దేవదాయ, రిజిస్ర్టేషన్ శాఖ, సీపీవో. జీఎ్‌సడబ్య్లుఎస్ శాఖలకు కేటాయించారు.బీటీ కళాశాల సముదాయంలో భవనాలను ట్రెజరీ, డీఆర్డీఏ, డ్వామా, డీపీవో కార్యాలయాలకు కేటాయించారు. ఇక్కడే సమావేశ మందిరానికి కూడా కేటాయించారు. బెంగళూరు రోడ్డులోని నక్కలదిన్నెలో పట్టుగుడ్ల ఉత్పత్తి కేంద్రం కార్యాలయ భవనాలను వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలైన ఉద్యాన, మృత్య్స, సూక్ష్మ నీటిపారుదల, జిల్లావనరుల కేంద్రం, సహకారశాఖ, మార్క్‌ఫెడ్, టూరిజం, జౌళి,చేనేత, స్కిల్ డెవల్‌పమెంట్, పరిశ్రమల శాఖలకు కేటాయించారు. వీటిలో చాలా కార్యాలయాలు చెట్లు, పిచ్చిమొక్కలు, మట్టిదిబ్బలతో నిండి వుండడంతో వాటిని చదును చేసే పనిలో అధికారులున్నారు. వీటిని పూర్తిగా చదును చేయడానికి కనీసం వారం పడుతుంది. అదే సమయంలో రాయచోటి నుంచి దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను వారం రోజుల్లోగా తరలించనున్నారు. మదనపల్లెలో జిల్లా పాలన వారం రో జుల్లో గాడిన పడుతుందని చెప్పవచ్చు.