Share News

RJD: ఎంఈవోల మధ్య సమన్వయమేదీ?

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:04 AM

ఎంఈవోలు సమన్వయంతో పనిచేయడం లేదని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్‌ అభిప్రాయపడ్డారు.

RJD: ఎంఈవోల మధ్య సమన్వయమేదీ?
ఎంఈవోల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్జేడీ శామ్యూల్‌

చిత్తూరు సెంట్రల్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎంఈవోలు సమన్వయంతో పనిచేయడం లేదని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్‌ అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష వార్షిక కార్యాచరణ ప్రణాళిక, బడ్జెట్‌ 2026-27 అంశాలపై ఎంఈవోలకు ఒక్క రోజు ఓరియంటేషన్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ.. 19 మండలాల్లోని ఎంఈవో 1,2ల మధ్య విభేదాల కారణంగా పలు ఫిర్యాదులు రాష్ట్ర స్థాయి విద్యాశాఖకు అందాయన్నారు. మరో 20 మంది ఎంఈవోల తీరు సైతం మారలేదని హెచ్చరించారు. టీచర్లు, విద్యార్థుల హాజరు పర్యవేక్షణలోనూ విఫలమయ్యారన్నారు. టెన్త్‌ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని చెప్పారు. ప్రతి రోజూ చిత్తూరులో 1447 మంది, తిరుపతిలో 1526 మంది విద్యార్థులు గైర్హాజరవుతున్నారన్నారు. మార్చిలో నిర్వహించే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు పక్కాగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థినీ షైనింగ్‌ స్టార్స్‌గా చేస్తూ వారిని పాసయ్యేలా టీచర్లు చొరవ చూపాలని ఆదేశించారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫేక్‌ అటెండెన్స్‌లు వేస్తున్నారని, మరోవైపు దీర్ఘకాలికంగా గైర్హాజరైన విద్యార్థులు ఉన్నారని, వీటిని వెంటనే గుర్తించాలన్నారు. 30 మందికన్నా తక్కువగా విద్యార్థులున్న పాఠశాలలకు మూడు విడతలుగా నోటీసులు జారీ చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగకుంటే వచ్చే విద్యా సంవత్సరం తక్కువ హాజరున్న ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు మూసి వేయాలని ఆదేశించారు. ఇప్పటికే చిత్తూరులో 30, తిరుపతిలో 15 ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్‌రోల్‌మెంట్‌ యాక్షన్‌ ప్లాన్‌ నెలాఖరులోపు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎఫ్‌ఏ-3 పరీక్షలు ముగిసినా, చిత్తూరులో 41 శాతం, తిరుపతిలో 21 శాతం విద్యార్థుల మార్కులు అప్‌లోడ్‌ చేయలేదన్నారు. ఉన్నత పాఠశాల వ్యవస్థలో అమలు చేస్తున్న విద్యాశక్తి కార్యక్రమం పురోగతి తిరుపతిలో బాగా తగ్గిందన్నారు. పీఎంశ్రీ కింద చిత్తూరులో 42, తిరుపతిలో 40 పాఠశాలల్లో పూర్తి చేసిన సివిల్‌ వర్క్‌ బిల్లులు వెంటనే అప్‌లోడ్‌ చేయాలన్నారు. సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల డీఈవోలు రాజేంద్రప్రసాద్‌, కుమార్‌, సమగ్రశిక్ష ఏపీసీలు గౌరిశంకర్‌, వెంకటరమణ, ఏడీలు, డీవైఈవోలు, ఎంఈవోలు పాలొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 03:04 AM