Venkatagiri: కిక్కిరిసిన వెంకటగిరి
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:54 AM
వెంకటగిరి జనసంద్రమైంది. గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ముఖ్య ఘట్టమైన విరూపోత్సవానికి ఇసుకేస్తే రాలని రీతిలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
వెంకటగిరి/వెంకటగిరి టౌన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యో తి): వెంకటగిరి జనసంద్రమైంది. గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ముఖ్య ఘట్టమైన విరూపోత్సవానికి ఇసుకేస్తే రాలని రీతిలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.గురువారం తెల్లవారుజామున భక్తుల దర్శనార్ధం దేవస్థానం వద్ద వేపమండలతో పందిరి వేసి పోలేరమ్మను కొలువుదీర్చారు.అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు బారులు తీరారు. అదేవిధంగా అమ్మవారికి వేయికళ్ల దుత్తల్లో బియ్యపు పిండితో చేసిన ప్రమిదలుంచి నూనెతో దీపాలు వెలిగించి నెత్తిన పెట్టుకువచ్చి నాలుగు రోడ్ల కూడళ్లలో బద్దలుకొట్టారు. మడిచీరలపై ఆసాదుల తప్పెట్లు నడుమ నడుస్తూ అమ్మవారి వద్దకు చేరుకొని మరికొందరు నవధాన్య మొలకలను అమ్మవారికి సమర్పించుకున్నారు.వెంకటగిరి రాజుల కోట(నగరి) నుంచి వచ్చిన బంగారు శూలం, సరుడు ఆభరణాలను అమ్మవారికి అలంకరించి తీసుకువెళ్లారు.అక్కడినుంచే సారెగా వచ్చిన బొట్టు, చిలకం, కాటుక,గాజులను రాజాల అనుచరులు అమ్మవారికి మధ్యాహ్నం 12గంటలకు సమర్పించారు. దీంతో వెట్టివారు కుండలో వెలిగించిన గండర దీపాన్ని అమ్మవారికి చూపించి ఊరి పొలిమేరల్లోకి తీసుకుపోయి ఉంచారు. అక్కడ అమ్మవారి బలి దున్నపోతును ఒక్క వేటుతో తెగనరికి ఆ రక్తంతో పొలికుండల్లోని ఆన్నంతో కలిపి ఊరి పొలిమేరల్లో పొలి..పొలి అని అరుస్తూ చల్లారు.ఇలా పొలి చల్లడం వల్ల ఊరిని చీడపీడలు ఆశించవని ఇక్కడి ప్రజల నమ్మకం. దున్నపోతు రక్తంతో తడిచిన కత్తిని అమ్మవారికి చూపడంతో నగరిలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ట్రాక్టర్‌ను తీసుకువచ్చి అమ్మవారి ప్రతిమను అందులో ఉంచి భక్త జనసందోహం నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. శివాలయం వద్దకు చేరుకున్న తరువాత అమ్మవారికి అలంకరించిన ఆభరణాలను తీసివేసి కైవల్యానది మీదుగా మల్లయ్య తోట వద్ద ఏర్పాటు చేసిన విరూప మండపం తీసుకెళ్లారు.అక్కడ అమ్మవారి ప్రతిమను విరూపం గావించారు.అంతవరకు గండర దీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.అమ్మవారి ప్రతిమ మట్టిని ఇంట ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయన్న నమ్మకంతో ఆ మట్టిని దక్కించు కునేందుకు భక్తులు పోటీపడ్డారు.
సర్కారు తరపున పట్టు వస్త్రాల సమర్పణ
జాతర సందర్భంగా ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం మధ్యాహ్నం పోలేరమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆయన వెంట దేవస్థాన కమిటీ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ, ఈవో ఎ.శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్ వెంకటేశ్వర్,ఎస్పీ సుబ్బరాయుడు,పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్, ఆర్టీవో భానుప్రకాష్ రెడ్డి, తదితరులున్నారు.పోలేరమ్మ జాతర ఖర్చులకు సంబంధించి తొలివిడతగా రూ.40 లక్షల చెక్కును ఆలయ ఈవో, చైర్మన్‌లకు అందించారు. త్వరలో మరో రూ.10 లక్షలు పంపనున్నట్లు తెలిపారు.కాగా జాతర ప్రశాంతంగా జరగడంలో పోలీసులు ముఖ్యపాత్ర పోషించారు.ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా విరూపోత్సవాన్ని పర్యవేక్షించి ప్రశంసలందున్నారు.