Tirumala: అనుమతుల్లేని దుకాణం!
ABN , Publish Date - Jul 01 , 2026 | 01:39 AM
శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్థాన మండపం ప్రవేశమార్గాన్ని (టీటీడీ బ్రాడ్‌కా్‌స్టకు వెళ్లే మార్గం) మూసివేసి టీ దుకాణం ఏర్పాటు చేయడం తిరుమలలో చర్చనీయాంశమైంది.
తిరుపతి(టీటీడీ), జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్థాన మండపం ప్రవేశమార్గాన్ని (టీటీడీ బ్రాడ్‌కా్‌స్టకు వెళ్లే మార్గం) మూసివేసి టీ దుకాణం ఏర్పాటు చేయడం తిరుమలలో చర్చనీయాంశమైంది. సాధారణంగా తిరుమలలో దుకాణాలకు టీటీడీ ఎస్టేట్ అధికారులు లైసెన్సులు జారీ చేస్తారు. అయితే ఇందుకోసం ముందుగా ఒక ప్రాంతాన్ని నిర్దేశిస్తారు.లైసెన్సులు జారీ చేసే సమయంలోనే అక్కడ ఎటువంటి పదార్థాలు విక్రయించాలనే అంశాలను పొందుపరుస్తారు. అయితే తిరుమలలో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపం ప్రవేశమార్గాన్ని మూసి వేసి ఏకంగా సోమవారం ఉదయం ఏ అనుమతులూ లేకుండా ఒక దుకాణం వెలిసింది.ఆస్థాన మండపం ప్రవేశ మార్గాన్ని మూసివేసి రేకులతో షెడ్డును ఏర్పాటు చేస్తున్నా కనీసం గుర్తించకపోవడం విజిలెన్స్, ఎస్టేట్ అధికారుల వైఫల్యం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ దర్జాగా విక్రయాలు జరుగుతున్నా అటు ఎస్టేట్ అధికారులు కానీ ఇటు విజిలెన్స్ అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంత బాహాటంగా సోమవారం ఉదయం నుంచే ఒక్క దుకాణం వెలిసి విక్రయాలు ఎలా చేపట్టగలిగారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.శ్రీవారి ఆలయానికి సమీపంలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా దుకాణాలను ఏర్పాటు చేసుకుంటే ఎలా గుర్తిస్తారన్న వాదనలు విన్పిస్తున్నాయి.తిరుమల ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లును ఈ విషయమై అడగ్గా.. దుకాణం ఏర్పాటుకు తాము అనుమతి ఇవ్వలేదన్నారు. దుకాణం ఏర్పాటు చేసిన సమాచారం అందిన వెంటనే దాన్ని మూసివేయించ డంతోపాటు తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు.