Share News

Tirumala: శ్రీవారి కొలువులో మరో ఇద్దరు సన్నిధిగొల్లలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:33 AM

శ్రీవారి ఆలయంలో మరో ఇద్దరు సన్నిధిగొల్లులు కొలువుదీరనున్నారు.ఇకపై స్వామివారి సేవలో మొత్తం నలుగురు సన్నిధి గొల్లలుండనున్నారు.

Tirumala: శ్రీవారి కొలువులో మరో ఇద్దరు సన్నిధిగొల్లలు
అర్చకుడిని శ్రీవారి ఆలయానికి తీసుకెళుతున్న సన్నిధి గొల్లలు

తిరుమల,నవంబరు10(ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆలయంలో మరో ఇద్దరు సన్నిధిగొల్లులు కొలువుదీరనున్నారు. ఇకపై స్వామివారి సేవలో మొత్తం నలుగురు సన్నిధి గొల్లలుండనున్నారు. తిరుమల ఆలయ వ్యవహారాల్లో సన్నిధిగొల్ల వ్యవస్థ ఎంతో కీలకమైంది. శ్రీవారి ఆలయ గర్భగుడి తలుపులు తెరిచిన తర్వాత అర్చకుల కంటే ముందుగా స్వామిని దర్శించుకునే ప్రత్యేకమైన, వంశపారపర్య హక్కు యాదవ వంశానికి చెందిన ‘సన్నిధిగొల్ల’కు మాత్రమే ఉంటుంది. ఆలయం తలుపులు తీయడం నుంచి తిరిగి తాళాలు వేయడం వరకు వీరి సేవలు పురాతన కాలం నుంచి కొనసాగుతున్నాయి. 2018వరకు గొల్ల వెంకట రామయ్య యాదవ్‌, ఆయన కుమారులు రమే్‌షయాదవ్‌, పద్మనాభ యాదవ్‌ శ్రీవారి సేవలో పాల్గొనేవారు. అయితే 2018 మే నెలలో వెంకట రామయ్య మృతి చెందిన తర్వాత రమేష్‌, పద్మనాభం మాత్రమే విధులు నిర్వహిస్తూ వచ్చారు.2021లో పద్మనాభం కూడా మృతి చెందిన క్రమంలో ఆయన సోదరుడు కిషోర్‌ యాదవ్‌ విధుల్లో చేరారు. అప్పటి నుంచి వీరిద్దరే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. సాధారణంగా సన్నిధిగొల్ల దివిటీతో అర్చక నిలయం నుంచి అర్చకులను, జీయర్‌ మఠం నుంచి గుడి తాళం పెట్టెను ఆలయానికి తీసుకురావడం, తలుపులు తీయడం, తొలుత గర్భాలయానికి చేరుకోవడం, తొలిహారతి తీసుకోవడం వంటివి చేస్తారు. దాని తర్వాత తోమాల సేవకు పూమాలతో వచ్చే జీయర్‌ బృందాన్ని ఆలయానికి తీసుకురావడం, యధావిధిగా రెండోగంట, మూడోగంట, కల్యాణోత్సవానికి మడితో వచ్చే అర్చకులను దగ్గరుండి తీసుకురావడం వీరి ప్రధాన విధులు. ఇలా అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు ఆలయంలోనే ఉంటూ విధులు నిర్వహించి తిరిగి తాళాలను వేయడం వీరి బాధ్యతలు.


అయితే ఇద్దరే వుండడంతో విధి నిర్వహణ భారంగా మారింది. ఎవరైనా సెలవు పెడితే సమస్య అవుతోంది. ఈ క్రమంలో గతేడాది ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిఽధి యాదవ పోస్టు ఏర్పాటుకు గతేడాది డిసెంబరు నెల16వ తేదీన టీటీడీ బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కిషోర్‌ యాదవ్‌ సాధారణ సన్నిధిగొల్లగా , రమేష్‌ యాదవ్‌ ప్రధాన సన్నిధిగా మారనున్నారు.రమేష్‌ యాదవ్‌ కుమారుడు జయకృష్ణ యాదవ్‌, పద్మనాభ యాదవ్‌ కుమారుడు జయేష్‌ యాదవ్‌ నూతన సన్నిధి గొల్లలుగా స్వామిసేవలోకి రానున్నారు. దీంతో మొత్తం నలుగురు సన్నిధిగొల్లలు ఇకపై సేవలందించనున్నారు.

Updated Date - Nov 11 , 2026 | 12:33 AM