Share News

Elephant: రెండు ఏనుగుల మృతి

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:04 AM

మంద నుంచి వేరుపడిన రెండు ఏనుగులు.. పంట పొలాలవైపు అడుగులేశాయి. మామిడితోటలో అంతరపంటగా సాగు చేసిన వేరుశనగ పంటలోకి వెళ్లే క్రమంలో, పొలంచుట్టూ లాగిన విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందాయి.

Elephant: రెండు ఏనుగుల మృతి
తురకపల్లె ఫారెస్టు ఠాణా సమీపంలో మామిడితోట వద్ద, చింతగుంట గ్రామం తురకపల్లె ఫారెస్టు ఠాణాకు సమీపంలో కరెంట్‌ షాక్‌తో చనిపోయిన ఏనుగులు

‘గజ’ విలాపం

ఎర్రావారిపాలెం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మంద నుంచి వేరుపడిన రెండు ఏనుగులు.. పంట పొలాలవైపు అడుగులేశాయి. మామిడితోటలో అంతరపంటగా సాగు చేసిన వేరుశనగ పంటలోకి వెళ్లే క్రమంలో, పొలంచుట్టూ లాగిన విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందాయి. చనిపోయిన వాటిలో ఆరేళ్ల మగ ఏనుగు, 14 ఏళ్ల ఆడ ఏనుగు ఉన్నాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి ఎర్రావారిపాలెం మండలం చింతగుంట పంచాయతీ కొత్తతురకపల్లె వద్ద ఫారెస్టు ఠాణా సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కొత్తతురకపల్లెకు చెందిన సమీర్‌ కువైట్‌ నుంచి ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. తమ సమీప బంధువు మామిడి తోటలో భూమిని కౌలుకు తీసుకుని అంతరపంటగా వేరుశనగ, పాడి పశువులకు గడ్డి సాగు చేశారు. అడవి పందులు వేరుశనగ పంటకు, దుప్పులు పశువుల గడ్డి తిని నష్టపరుస్తున్నాయి. వీటిని అడ్డుకునేందుకు విద్యుత్‌ లైన్‌ నుంచి పొలం చుట్టూ కరెంట్‌ తీగలు తీశారు. అక్తర్‌ పొలాలు కూడా పక్కనే ఉన్నాయి.

మంద నుంచి వేరుపడి..

చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ ప్రాంతం నుంచి 16 ఏనుగుల మంద చింతగుంట సరిహద్దు అటవీ ప్రాంతంగుండ్లగుట్ట, సవళ్ల, తలకోన సౌత్‌ బీట్‌ పరిధిలో తిరుగుతున్నాయి. ఆ మంద నుంచి ఆదివారం రాత్రి మగ, ఆడ ఏనుగులు వేరుపడి నెరబైలు పంచాయతీ పాత తురకపల్లెకు చేరాయి. కొందరు రైతుల పొలాల్లో గడ్డి తిని ధ్వంసం చేశాయి. రాత్రి 11 గంటల సమయంలో చింతగుంట పంచాయతీ కొత్తతురకపల్లె ఫారెస్టు ఠాణా సమీపంలో సమీర్‌ కౌలుకు సాగు చేసిన వేరుశనగ పొలంవైపు వచ్చాయి. అప్పటికే పొలం చుట్టూ 11 కేవీ కరెంటు తీగలు తీసి ఉన్నారు. వేరుశనగ పొలంలోకి వెళ్లే క్రమంలో మగ ఏనుగు.. అక్కడికి 100 అడుగుల దూరంలో గడ్డి కమతానికి ఎగవన మామిడి తోటలో ఆడ ఏనుగు వస్తుండగా కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే మరణించాయి. వేరుశనగకు, గడ్డికి వేర్వేరుగా కరెంట్‌ తీగలు తీసినట్లు ఫారెస్టు అధికారులు గుర్తించారు. సాధారణంగా కరెంట్‌ తీగలకు ఏదైనా జంతువు తగిలి మరణిస్తే అటువైపు విద్యుత్‌ సరిగా ప్రసరించదు. ఇక్కడ 11కేవీ లైన్‌కు రెండుచోట్ల కనెక్షన్‌ ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

సంఘటనా స్థలానికి అధికారులు

సోమవారం ఉదయం స్థానిక రైతుల సమాచారంతో తిరుపతి డీఎ్‌ఫవో సాయిబాబా, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎ్‌ఫవో రామకొండారెడ్డి, ఎస్వీజూపార్క్‌ డాక్టర్‌ అరుణ్‌, సిబ్బంది.. డిస్కం ఏఈ జ్యోతి ప్రసాద్‌, చిన్నగొట్టిగల్లు ఏడీఈ రామి రెడ్డి, రెవెన్యూ అధికారి మస్తాన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగులు మృతి చెందిన రైతుల పేర్లు, భూమి పట్టా వివరాలు, ప్రమాదానికి కారణాలను పరిశీలించారు. జూ డాక్టర్‌ అరుణ్‌ ఆధ్వర్యంలో డాక్టర్లు రెండు ఏనుగులకు సాయంత్రం 5 గంటలకంతా పోస్టుమార్టం పూర్తి చేశారు. కరెంట్‌ షాక్‌తో మరణించినట్లు నిర్ధారించారు. ఈ రెండు ఏనుగుల మృతి దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విచారం వ్యక్తంచేసినట్లు చంద్రగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి దేవర మనోహర్‌ తెలిపారు.

ఇద్దరిపై కేసు

ఈ ఘటనకు కారకులైన రైతులు సమీర్‌, అక్తర్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎ్‌ఫవో సాయిబాబ తెలిపారు. త్వరలో ఇద్దరిని అరెస్టు చేస్తామన్నారు. వన్యప్రాణులకు హానిచేసే వారిని వదిలేది లేదన్నారు. ఈ ఏనుగుల మృతితో.. మిగతావి చింతగుంట పరిసరాల్లోకి వచ్చే అవకాశం ఉందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక, వన్యప్రాణులను చంపేందుకు పొలాల వద్ద కరెంట్‌ను వాడితే కఠిన చర్యలు తప్పవని డిస్కం ఎడీఈ రామిరెడ్డి, ఏఈ జ్యోతిప్రసాద్‌ హెచ్చరించారు.


16 ఏళ్లలో 55 గజరాజులు వివిధ ప్రమాదాల్లో మరణం

ఎర్రావారిపాలెం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 16 ఏళ్ల వ్యవధిలో జరిగిన వివిధ ప్రమాదాల్లో 55 గజరాజులు మృత్యువాత పడ్డాయి. అడవుల్లో ఆహార కొరత, స్మగ్లర్ల చొరబాటుతో ఇవి జనాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మృత్యువాత పడుతున్నాయి.

2009వ సంవత్సరం: సిద్దలగండి ప్రాజెక్టులోని నీటిలో కూరుకుపోయి గున్న ఏనుగు మరణించింది.

2010: ఎర్రావారిపాలెం మండలం చింతగుంటలో కరెంట్‌తో గజరాజు మృతి.

2011: చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండలో బావిలో పడి నిండు శూలాలు ఆడ ఏనుగు మరణించింది.

2013: విద్యుదాఘాతంతో ఎర్రావారిపాలెం మండలంలో ఒక ఆడ ఏనుగు, కుప్పంలో మూడు ఏనుగులు చనిపోయాయి.

2014: కౌండిన్య అడవుల్లో ఒక ఏనుగు మరణం.

2015: ఎర్రావారిపాలెం మండలం పులిగోనుపల్లె వద్ద నాటు బాంబు నమిలి మగ ఏనుగు.. చింతగుంట సబ్బరామాపురం వద్ద కరెంట్‌ షాక్‌తో మరొకటి.. రామ కుప్పం అడవుల్లో ఇంకోటి మరణించాయి.

2017: ఎర్రావారిపాలెం మండలం కోటకాడపల్లె వరి పొలాల్లో ఒక ఏనుగు మృతి చెందింది.

2018: రామసముద్రం శెట్టివారిపల్లె వద్ద పొలాల్లో ఏనుగు మరణం.

2019: ననియాల అడవుల్లోని చెత్తపెంట బీట్‌లో ఒకటి,పలమనేరు గొబ్బిళ్లటూరు వద్ద కరెంట్‌ షాక్‌తో ఒకటి, ననియాల అడవుల్లో ఆడ ఏనుగును మగది చంపింది. చిత్తూరు- తమిళనాడు సరిహద్దులో రైల్వే ట్రాక్‌ దాటుతూ ఎనిమిది ఏనుగులు మృత్యువాత పడ్డాయి. కుప్పం ప్రాంతంలో వేలాడే కరెంటు తీగలతో మరొకటి.. ఐరాల మండలంలో రెండు.. బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌ వద్ద ఒకటి చనిపోయాయి.

2020: గంగవరం వద్ద కరెంట్‌ షాక్‌తో ఒకటి మరణించింది.

2021: పుత్తూరు- కార్వేటినగరం వద్ద ఒంటరి ఏనుగు ట్రాన్స్‌ఫార్మరు ఢీకొని మరణం. పలమనేరు మండలం కోతిగుట్ట వద్ద ఒకటి, బంగారుపాళ్యం మండలం రాగిమాను పెంట వద్ద మరొకటి, సోమల మండలంలో ఇంకొకటి కరెంట్‌ షాక్‌తో చనిపోయాయి.

2022లో సదుం మండలం చెరుకువారిపల్లె వద్ద ఒకటి, మొగిలివారిపల్లె వద్ద ట్రాన్స్‌ఫార్మరు ఢీకొని మరొకటి, బంగారుపాళ్యం మండలం శెట్టీంలో ఒకటి, టేకు మందలో ఒకటి, మొగలి ఘాట్‌లో మరొకటి, పలమనేరు బీట్‌ కొణదల మడుగు వద్ద నిండుశూలాల ఏనుగు మృతి.

2023: మొగిలి ఘాట్‌లో లారీ ఢీకొని 3 ఏనుగుల మృతి. బైరెడ్డిపల్లెలో మరొకటి చనిపోయింది.

2024: ఎర్రావారిపాలెం మండలంలో పులిబోను పల్లె వద్ద.. భాకరాపేటలో దేపట్లవారి పల్లె వద్ద.. మొత్తం రెండు చనిపోయాయి.

2025: పలమనేరులోని గౌనివాని చెరువు వద్ద ఒకటి.. మరో రెండు ఏనుగులు మృతి చెందాయి.

Updated Date - Mar 10 , 2026 | 02:04 AM