Malwadi Bridge: ఈ బ్రిడ్జికి 83 ఏళ్లు !
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:15 AM
సప్తగిరులకు సౌందర్య చిహ్నంగా ఉండే మాల్వాడిగుండం జలపాతం పైభాగంలో నిర్మించిన ఈ వంతెన వయస్సు 83 ఏళ్లు.ఎలాంటి యంత్రాలు, సిమెంటు లేకుండా బండరాళ్ల సహాయంతో కూలీల ద్వారా కట్టిన బ్రిడ్జి నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.
తిరుమల, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): వందేళ్ల క్రితం వరకూ తిరుమల కొండకు దట్టమైన అడవిమార్గం ద్వారానే చేరుకోవాల్సి వచ్చేది. మహంతుల కాలంలో తిరుమల క్షేత్రానికి భక్తుల రాక పెరిగింది. ఈ క్రమంలో వయస్సు పైబడిన వృద్ధులను డోలీలో తిరుమలకు తీసుకువచ్చి, దర్శనానంతరం అలానే తీసుకువెళ్లేవారు.రవాణా సౌకర్యం మెరుగుపరచాలని భావించిన మహంతులు 1940లో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు.సరుకుల చేరవేత కోసం ఎడ్లబండిపై ప్రయాణాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే ఈ బాటలో మాల్వాడి గుండం జలపాతం వద్ద దాటడం కష్టంగా ఉండేది.1943లో తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేశారు కానీ 1944 ఏప్రిల్ 10వ తేదీ అధికారికంగా వినియోగంలోకి తీసుకువచ్చారు. ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ రోడ్డు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ఘాట్‌రోడ్డు మొత్తమ్మీద మాల్వాడిగుండం వంతెనను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొండపై నుంచి జాలువారే నీటిఽధారకు ఇబ్బంది లేకుండా అప్పట్లోనే చాలా తెలివిగా దీన్ని నిర్మించారు. రాయిపై రాయిపెడుతూ రెండు వెంట్స్ (స్తంభాలు)తో నిర్మాణాన్ని పూర్త్తిచేశారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఎలాంటి మరమ్మతుల అవసరం రాకపోవడం గమనార్హం. చిన్నపాటి రావిమొక్కలు వచ్చిన సందర్భాల్లో సిబ్బంది తొలగిస్తుంటారు.భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో పైనుంచి కిందకు దూకే నీటిని ఈ బ్రిడ్జిపై నుంచి భక్తులు వీక్షిస్తుంటారు.