TDP: మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వైసీపీ
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:44 AM
వైసీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన కూటమి పార్టీల నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చిత్తూరు సిటి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన కూటమి పార్టీల నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్‌కు హిందుత్వమంటే గిట్టదన్నారు. చివరకు వేంకటేశ్వరస్వామినీ వదలకుండా టీటీడీలో నెయ్యి కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు. ‘అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కారు. వచ్చినా సభను జరగనివ్వరు. శాసనమండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు చెప్పులతో వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించారు. దేవుడినీ రాజకీయలకు వాడుకుంటున్నారు. దీనిపై భగవంతునికి, భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని మంత్రి డిమాండు చేశారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షణ్ముగం రెడ్డి, సునీల్ కుమార్ చౌదరి ఆరోపించారు. వైసీపీ నేతల అరాచకాలతో రాష్ట్ర పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆందోళన వ్యక్తంచేశారు. టీటీడీలో కల్తీ నెయ్యి విషయంలో అబద్దాన్ని నిజం చేసేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. టీటీడీలో నెయ్యి కల్తీ విషయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ గుర్తుచేశారు. అయినా, వైసీపీ నేతలు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలను వైసీపీ నేతలు ఇప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తారని కలలుగంటున్నారని, ఇక ఎప్పటికీ వారు అధికారంలోకి రాలేరన్నారు. టీటీడీలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చినా ఎదురు దాడికి దిగడం వైసీపీ నేతల మూర్ఖత్వానికి నిదర్శనమని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. కల్తీ మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలకు బెయిల్ కూడా రాలేదన్నారు. కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, ఆ ట్రాప్‌లో ఎవరూ పడరాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు సూచించారు. మాజీ సీఎం జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు.
టీటీడీలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చినా ఎదురు దాడికి దిగడం వైసీపీ నేతల మూర్ఖత్వానికి నిదర్శనమని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. కల్తీ మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలకు బెయిల్ కూడా రాలేదన్నారు. కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, ఆ ట్రాప్‌లో ఎవరూ పడరాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు సూచించారు. మాజీ సీఎం జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు.