Village festival: మళ్లీ మొదలైన పల్లెపండుగ
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:15 AM
వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గ్రామీణ రహదారుల్ని కూటమి ప్రభుత్వం దశల వారీగా బాగు చేస్తోంది. పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా రూ.177.87 కోట్లతో 1723 పనుల్ని మంజూరు చేసింది.
గతంలో రూ.101.50 కోట్లతో 1619 పనుల పూర్తి
చిత్తూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గ్రామీణ రహదారుల్ని కూటమి ప్రభుత్వం దశల వారీగా బాగు చేస్తోంది. పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా రూ.177.87 కోట్లతో 1723 పనుల్ని మంజూరు చేసింది. వీబీజీ రామ్‌జీ (ఉపాధి హామీ) నిధులతో ఈ పనుల్ని చేపట్టనున్నారు.
గత పల్లెపండుగలో
228.50 కిలోమీటర్ల అభివృద్ధి
డిప్యూటీ సీఎం పవన్ ఆధ్వర్యంలో గతేడాది పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసి, జిల్లాలోని 228.50 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.101.52 కోట్ల నిధుల్ని కేటాయించారు. ఇప్పటివరకు రూ.76.89 కోట్లతో 215 కిలోమీటర్ల మేర పనుల్ని పూర్తి చేశారు. మొత్తం 1619 పనులు కాగా.. వాటిలో 1601 సీసీ రోడ్లు, 18 బీటీ రోడ్లు ఉన్నాయి.
ఈసారి 356 కిలోమీటర్లు లక్ష్యం..
పల్లెపండుగ మొదటి విడత విజయవంతం కావడంతో ఇప్పుడు రెండవ విడతగా పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలో 356.11 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని రూ.177.87 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 40 కిలోమీటర్ల పనులు రూ.15.53 కోట్లతో ఇప్పటికే పూర్తి చేశారు. మొత్తం 1723 పనులుకాగా.. 1575 సీసీ రోడ్లు, 148 బీటీ రోడ్లు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని వీబీజీ రామ్‌జీ పథకంతో అనుసంధానించారు.
రహదారులకే రూ.579 కోట్లు
జిల్లాలోని 89.40 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు గతేడాది అక్టోబరులో ప్రభుత్వం రూ.39.40 కోట్లను మంజూరు చేసింది. గతేడాది ఆగస్టులోనే రూ.38.25 కోట్ల నాబార్డు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్‌తో జిల్లాలోని రహదారుల అభివృద్ధి పనులు చేపట్టగా.. అంతకుముందే రూ.222 కోట్లతో రహదారుల్ని మరమ్మతు చేశారు. పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల్ని మినహాయించి ఇప్పటివరకు ప్రభుత్వం జిల్లా రహదారులకు కేటాయించిందే రూ.300 కోట్లు. పల్లె పండుగలను కలుపుకొంటే రూ.579 కోట్ల వరకు కేటాయించినట్లు. మరోవైపు రూ.వేల కోట్లతో నేషనల్ హైవేస్, ఎక్స్‌ప్రెస్ హైవేస్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
పల్లె పండుగల వివరాలు....
పల్లె పండుగ 1.0 పల్లెపండుగ 2.0
కిలోమీటర్లు 228.50 356.11
పూర్తయిన పనులు 215 40
నిధుల కేటాయింపు రూ.101.52 కోట్లు రూ.177.87 కోట్లు
ఖర్చయిన నిధులు రూ.76.89 కోట్లు రూ.15.53 కోట్లు
మొత్తం పనులు 1,619 1,723