TTD: టెండరు పిలిచి రద్దు చేశారు
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:38 AM
తిరుపతిలో శ్రీవారి భక్తుల వసతి సముదాయాల్లో ఒకటైన శ్రీనివాసం సముదాయ ఆవరణలో భక్తులకు టోకెన్లు జారీ చేసే క్యూలైన్లపై షెల్టర్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ టెండర్లు పిలిచింది. గడువు, ప్రక్రియ ముగిశాక టెండర్లను ఆమోదించకుండా పెండింగు పెట్టింది. నాలుగు నెలల తర్వాత టెండర్లు రద్దు చేసింది. దీంతో అసలు టీటీడీ టెండర్లు పిలవడమెందుకు? పిలిచాక రద్దు చేయడమెందుకు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తరువాత ప్రతిపాదనే విరమించుకున్న టీటీడీ
తిరుపతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): శ్రీనివాసం భక్తుల వసతి సముదాయ ప్రాంగణంలో శ్రీనివాసం, మాధవం పేరిట రెండు కాంప్లెక్సులు వున్నాయి. ఈ ప్రాంగణంలోనే భక్తులకు టైమ్ స్లాటెడ్ దర్శన టోకెన్ల జారీ కోసం రెండు క్యూలైన్లున్నాయి. మాధవం కాంప్లెక్సుకు పశ్చిమాన శాశ్వత క్యూలైన్ వుండగా, శ్రీనివాసం వద్ద ప్రస్తుతం వినియోగిస్తున్న క్యూలైన్ వుంది. ఈ క్యూలైన్లపై షెల్టర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ రూ. 7.50 కోట్లతో అంచనాలు రూపొందించింది. గతేడాది మే 20వ తేదీన జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని చర్చించి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది.దానికనుగుణంగా టీటీడీ చీఫ్ ఇంజనీర్ సాంకేతికపరమైన అనుమతి ఇచ్చారు. గతేడాది జూలై 10న టీటీడీ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. ఆగస్టు 4 టెండర్లు దాఖలు చేయడానికి తుది గడువు కాగా ఐదు సంస్థలు బిడ్‌లు కోట్ చేశాయి. ఎస్‌ఆర్‌వీఎస్ ఇండస్ట్రీస్ అనే సంస్థ తప్ప మిగిలిన నాలుగు సంస్థలూ టెండర్లకు అర్హత సాధించాయి. ఆగస్టు 25న కమర్షియల్ బిడ్‌లు తెరిచారు.అందులో మెస్సర్స్ సిద్ధార్థ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ అంచనాల కంటే 3.69 శాతం తక్కువ మొత్తానికి కోట్ చేసింది. నిబంధనల ప్రకారం ఈ సంస్థ టెండరును ఆమోదించాలి. పని అంచనా విలువ రూ. 2 కోట్లు మించితే పాలకమండలి అనుమతి అవసరం కాబట్టి ఇంజనీరింగ్ అధికారులు వర్క్స్ కమిటీకి నివేదించారు. గతేడాది అక్టోబరు 19న వర్క్స్ కమిటీ సమావేశమై ఈ అంశాన్ని బోర్డు ముందు వుంచాలని సిఫారసు చేసింది. దానికనుగుణంగా అదే నెల 28న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. దీనిపై చర్చించిన బోర్డు టెండరు ఆమోదించే అంశాన్ని పక్కన పెట్టింది. దీంతో సిద్ధార్థ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దాఖలు చేసిన లోయెస్ట్ టెండరును ఆమోదించాలంటూ ఇంజనీరింగ్ విభాగం డిసెంబరు 16న జరిగిన పాలకమండలి సమావేశం అజెండాలో మళ్ళీ ఈ అంశాన్ని చేర్చింది.
అయితే ఆ సమావేశంలో ఏకంగా టెండర్లను రద్దు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దానితో పాటు షెల్టరు నిర్మాణ ప్రతిపాదనను కూడా విరమించుకుంటూ తీర్మానించింది.క్యూలైన్లపై షెల్టర్ల ఏర్పాటును ప్రతిపాదించిన టీటీడీ బోర్డే టెండర్లను రద్దు చేసి ఆ ప్రతిపాదననే విరమించుకోవడం ఎందుకనేది అంతుబట్టడం లేదు. ఇంజనీరింగ్ విభాగం అధికారుల సమయం, శ్రమా రెండూ వృధా అయ్యాయి. టెండరు నోటీసుల ప్రచురణలతో శ్రీవారి నిధులు వృధా అయ్యాయి. అలాగే టెండర్లలో పాల్గొన్న నిర్మాణ సంస్థల సమయం, శ్రమ కూడా వృధా అయ్యాయి. పోనీ శ్రీనివాసం ప్రాంగణంలో క్యూలైన్లపై షెల్టర్ల అవసరం లేదా అంటే చాలా ఎక్కువగా వుంది. తిరుపతిలో అసలే ఎండల తీవ్రత ఎక్కువ. ఒకటి రెండు నెలలు మినహా ఏడాది పొడవునా ఉక్కపోత వాతావరణమే వుంటుంది. ఎండల నుంచీ, వర్షాల నుంచీ క్యూలైన్లలో వుండే భక్తులకు రక్షణగా షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. అలాంటప్పుడు ఇలా పరస్పర భిన్నమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుందన్నది టీటీడీయే చెప్పాల్సి వుంది.